Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకే ఒక డైలాగ్… బలమైన జంగిల్ రాజ్, మాఫియా రాజ్ కూలిపోయింది…

December 25, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల ) …… అప్పటివరకూ అచంచలమైన విశ్వాసంతో అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్… 2005 బీహార్ ఎన్నికల్లో కుప్పకూలింది…. అందుకు, కర్ణుడి చావుకి వేయి కారణాల్లా ఎన్నో ఉండొచ్చు. కానీ, ఆ కారణాలన్నింటిలోకి.. ఓ ప్రధాన కారణం ఆర్జేడీని గద్దె దించింది. ఇప్పటివరకూ మళ్లీ కనీసం ఆ పార్టీకి అధికారంలోకొచ్చే అవకాశాలు కూడా లేకుండా చేసేసింది.

అదే సమయంలో ప్రజల విశ్వాసం చూరగొన్న ఓ నాయకుడి నోటి నుంచి వచ్చే మాటలకు ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో చర్చకు పెట్టింది. ఓ నాల్గు పదాల మాట తూటా అయి పేలింది. ముఖ్యంగా ఆర్జేడీకి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. తద్వారా మాఫియా రాజ్, గూండా రాజ్, జంగిల్ రాజ్ కుప్పకూలింది.

Ads

ఈ విషయాన్ని అప్పటి పాట్నా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన.. ఎన్.హెచ్. ఖాన్ చెప్పడంతో గతంలోనే వెలుగులోకొచ్చింది.

ఒక్క జాతీయస్థాయి నాయకుడు తన ప్రచారంలో వేసిన కేవలం నాల్గు పదాల ఓ ప్రశ్న… ఆర్జేడీని నామరూపాల్లేకుండా చేసింది. అప్పటివరకూ ఒక్క వెలుగు వెలిగిన ఆర్జేడీ.. కుప్పకూలిపోయేలా చేసింది.

ఆ నాల్గు పదాలే.. కహా హై మేరా కిస్లాయ్…? ఈ పదాలు ప్రశ్నగా సంధించిన గొంతు.. నాటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పాయ్.

1924, డిసెంబర్ 25 సరిగ్గా క్రిస్ మస్ రోజు… దివంగత ప్రధాని వాజ్ పాయ్ పుట్టినరోజు. అందుకే, ఈ ఆసక్తికర ముచ్చట.

పాట్నాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివే 14 ఏళ్ల కిస్లాయ్ కుమార్ అనే బాలుడు పట్టపగలే స్కూల్ బస్ ఎక్కుతుండగా కిడ్నాప్ కు గురైన ఘటన బీహార్ రాష్ట్రాన్ని కుదిపేసింది. పేరెంట్స్ కమిటీలు, ప్రజాసంఘాలు, స్టూడెంట్ యూనియన్స్ తో పాటు.. ప్రతిపక్షాలూ ఆ విషయంపై రచ్చ రచ్చ చేశాయి. అది కాస్తా దేశం మొత్తం దావానంలా పాకింది.

అప్పటికే ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. అప్పటికే బీజేపీ, జేడీయూ కూటమి బంధం బలపడుతోంది. ఆ సమయంలో నాటి ప్రధాని వాజ్ పాయ్ పాట్నాకు ప్రచారం కోసం వెళ్లాడు. ఒకే ఒక్క ప్రశ్న సంధించాడు.

అదే.. కహా హై మేరా కిస్లాయ్..?

కిస్లాయ్ అంటే లేత.. లేదా, ప్రశాంతత అనే అర్థం కూడా ధ్వనించడంతో.. వాజ్ పాయ్ వదిలిన ఆ బాణం కిడ్నాప్ అయిన బాలుడితో పాటు.. బీహార్ ప్రశాంతతపైనా ప్రశ్నల లేవనెత్తింది. అలా తన ఒకే ఒక్క ప్రశ్నతో ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టేశాడు వాజ్ పాయ్.

మొత్తంగా బీహార్ రాష్ట్ర శాంతిభద్రతలనే ప్రశ్నార్థకం చేస్తూ వాజ్ పాయ్ భాగల్పూర్ సభలో పెట్టిన ఆ చర్చతో.. ఆర్జేడీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది.

అప్పటికే బాలుడి కిడ్నాప్ కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నా.. ఎన్నికల హడావిడి ముందు ఆ కిడ్నాప్ కథను పెద్దగా పట్టించుకోకపోవడమే నాటి ప్రభుత్వానికి శరాఘాతమై కూర్చుంది. ఇక వాజ్ పాయ్ వ్యాఖ్యలతో ఏకంగా… బాలుడి కిడ్నాప్ వ్యవహారం యావత్ దేశం మొత్తం పాకింది.

వెంటనే ఆర్జేడీ ప్రభుత్వం పోలీసులపైకి సీరియస్సైంది. హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో ఏకంగా ఓ వార్ రూమే ఏర్పాటు చేసింది. నిత్యం ఉదయం నుంచీ రాత్రి వరకూ చర్చలు. బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించాలని పోలీస్ శాఖపై తీవ్ర ఒత్తిడి.

మరోవైపు బాలుడి కిడ్నాప్ కేసులో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నివేదికలు కావాలంటూ నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కార్యాలయం నుంచి గవర్నర్ కు ఆదేశాలు. గవర్నర్ నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి. ఇక ఆ సమయంలో నిద్ర లేని రాత్రులు గడిపామంటూ నాటి పాట్నా ఎస్పీగా పనిచేసిన ఖాన్ చెప్పిన మాటలివి.

కిడ్నాపర్స్ ఆ బాలుణ్ని విముక్తి చేయాలంటే ఏకంగా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. బాలుడు కిస్లే తండ్రి పాట్నాలోని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. పోలీసులపై నమ్మకముంచిన తండ్రి కేకే గుప్తా.. వారడిగిన 25 లక్షల రూపాయలు కాదు కదా.. ఒక్క రూపాయి కూడా తానిచ్చేది లేదంటూ అప్పటికే తేల్చి చెప్పేశాడు.

మరోవైపు పోలీసుల వద్దేమో ఇవాళ ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో అందుబాటులో లేకుండేది. ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో బాలుణ్ని రక్షించేందుకు మార్గాలను వెతకడం మాత్రమే పోలీసుల పనైంది అప్పుడు. ఆ క్రమంలో కేంద్ర ఏజెన్సీల సాయాన్ని కూడా నాటి కేంద్ర ప్రభుత్వం అందించడంతో.. ఎట్టకేలకు కిడ్నాపర్స్ కాల్ ను రికార్డ్ చేయగల్గారు బీహార్ పోలీసులు.

అది కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ రాకేష్ కుమార్ అలియాస్ చున్నూఠాకూర్ పనేనని తేలింది. ఠాకూర్ ను పట్టుకున్న పోలీసులు.. ఆ తర్వాత అతడి భార్యతో పాటు.. కిడ్నాప్ తో సంబంధమున్న మరో పది మంది గ్యాంగ్ స్టర్స్ ను కూడా పట్టుకుని హాజీపూర్ జైలుకు తరలించారు.

అలా 2005, ఫిబ్రవరి 2న కిస్లాయ్ కుమార్ అనే బాలుడు రికవరీ అయ్యాడు. చున్నూఠాకూర్ తరపున పేరుమోసిన మరో గ్యాంగ్ స్టర్ అయిన విక్కీ ఠాకూర్, అతడి సహచరులు కలిసి కిడ్నాప్ చేసినట్టుగా ధృవీకరించారు. ఆ ఘటనలో పర్యవసానంగా ఆ గ్యాంగ్ ను ఛేజ్ చేసి పట్టుకునే క్రమంలో… వారం రోజులకే 2005, ఫిబ్రవరి 9వ తేదీన విక్కీఠాకూర్ తో పాటు.. మరొకరు పోలీసుల ఎదురుకాల్పుల్లో ఎన్ కౌంటరయ్యారు.

ఇక రాకేష్ ఠాకూర్ విషయానికొస్తే… ముజఫర్‌పూర్ జిల్లాలోనే అత్యధికంగా 42 కేసులున్న నోటోరియస్ గ్యాంగ్ స్టర్. మర్డర్స్, మద్యం స్మగ్లింగ్ తో పాటు.. పోలీసుల చేతుల్లోంచి పలుమార్లు తప్పించుకున్న నేరస్థుడు. నేపాల్ పారిపోయి లోకల్ పోలీసులకు చుక్కలు చూపించిన క్రిమినల్. ఆ మధ్య కొంతకాలం క్రితం కుటుంబానికి సంబంధించిన ఓ కార్యక్రమం కోసం బీహార్ వచ్చిన రాకేష్ ఠాకూర్ ను పోలీసులు తప్పించుకోకుండా వలపన్ని పట్టుకున్నారు.

కిస్లాయ్ కిడ్నాప్ అనంతరం జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ముగ్గురు కీలక కిడ్నాపర్స్ ఎన్ కౌంటర్స్ తో… కిడ్నాపుల పర్వానికే పాట్నాలో తెరపడింది.

అలా కిస్లాయ్ కిడ్నాప్ కథ సుఖాంతమైనా… వాజ్ పాయ్ కహా హై మేరా కిస్లాయ్ అనే మాటల రిఫ్లెక్షన్ ఆర్జేడీ ప్రభుత్వానికి జంగల్ రాజ్ అనే ట్యాగ్ ను వేసి గద్దె దించి లాలూ టీంకు దు:ఖాన్ని మిగిల్చింది. దాంతో 2010లో ఏకంగా ఎన్నికల్లో 243 సీట్లకుగాను.. 22 సీట్లకు పడిపోవడమే కాకుండా.. అప్పటినుంచీ ఇంకా ఆర్జేడీ కోలుకోవడం లేదు.

ఇక 2019 ఎన్నికల్లోనైతే ఆర్జేడీకి లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా దక్కలేదంటే కొన్ని అంశాలను ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు లైట్ తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలుంటాయో తెలియజెబుతోంది ఈ స్టోరీ.

అయితే, ఎప్పటికైనా రాజకీయాల్లో రాణించకపోతామా అని ఆర్జేడీ ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోతోంది. గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలో మహాఘట్ బంధన్ అలయెన్స్ లో భాగంగా 75 సీట్లను, లోక్ సభ ఎన్నికల్లో 23 సీట్లు గెల్చుకునేవరకూ కూడా ఆర్జేడీ ప్రస్థానం ఓ ప్రశ్నార్థకంగానే కొనసాగింది.

పాట్నాలోని కిస్లాయ్ ఇల్లు ఇప్పుడు ఓ బూత్ బంగ్లాను తలపిస్తూ.. కింద తాళం కప్పతో.. నిర్జీవంగా నాటి ఘటనకు ఓ ప్రతీకలా దర్శనమిస్తుంటుంది. దాన్ని చూసినప్పుడల్లా స్థానికంగా ఇంకా అవే చర్చలు జరిగే ఓ రీమైండర్ ఐపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్జేడీ పాలిట శాపంగా మారింది.

kislay

2005కు ముందు బీహార్ అంటే కిడ్నాపుల కలకలం సర్వసాధారణం. సాయంత్రం ఆరుగంటలు దాటిందంటే బయటకు వెళ్లడానికి కూడా జనం జంకేవారు. అలాంటి పరిస్థితుల్లోనే కిస్లాయ్ కిడ్నాప్ ఎన్నికల కాలంలో జరగడం.. దాన్ని నితీష్ కుమార్ తన అస్త్రంగా వాడుకోవడం.. వాజ్ పాయ్ నోట చర్చనీయాంశమై యావత్ దేశం దృష్టి పడటంతో.. శాంతిభద్రతల తీవ్రతపై అక్కడి ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి సారించాల్సిన అనివార్యత ఏర్పడింది.

అయితే, ఇక్కడ బీహార్ లో నాటి శాంతిభద్రతల సమస్య ఏవిధంగా ఉండేదనేది ఒక పాయింటైతే.. కిస్లాయ్ కిడ్నాప్ తో అవి అదుపులోకి రావడం మరో పరిష్కారం. కిస్లాయ్ కిడ్నాప్ కలకం బహుకాలం పాలించిన పార్టీనే తుడిచిపెట్టేసేలా చేయడం గమనించాల్సిన మరో ముఖ్య విషయం.

ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అదే అంశాన్ని ఫోకస్డ్ గా చూడాల్సి రావడం ఇంకో మరో విశేషం. ఇన్ని విశేషాలకు… ఓ విశ్వసనీయత కల్గిన నాయకుడు మాట్లాడే మాట ప్రధాన కారణం. ఆ నాయకుడే మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పాయ్.

చాలామంది చాలా మాట్లాడుతుంటారు. కాస్త చదువు నేర్పిన జ్ఞానం.. నాల్గు మాటలు నేర్చిన పిట్టలైతే.. ఏవి పడితే అవి రోజూ తెల్లార్లేస్తే విమర్శలు, ప్రతివిమర్శలతో చెలరేగిపోతారు. ఫలనా పార్టీ నాయకుణ్ని.. పాలకపక్షం ఇట్లా అన్నదంటే… ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడు కడిగిపడేశాడంటూ మీడియా రొడ్డకొట్టుడు వార్తలు చూస్తున్నాం.

ఈ క్రమంలో… మాటకెంత విలువుంటుందో పట్టిచూపిన దార్శనికుడు వాజ్ పాయ్. ఆయనకున్న క్రెడిబిలిటీతో పాటు.. ప్రధాని పదవిలో కూడా ఉండటంతో… బీహార్ బాలుడి కిడ్నాప్ పై ఆయన చేసిన నాల్గే నాల్గు పదాలు ఆర్జేడీ దుమ్ము రేపాయి. కహా హై మేరే కిస్లాయ్ వ్యాఖ్య ఎంత ప్రభావితం చేసింది… ఎన్ని పరిణామాలకు కారణమైందో ఈ స్టోరీ చెబుతుంది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘మగ శివాజీ’ లీడ్ రోల్… దండోరా ఓ మంచి ప్రయత్నమే… కానీ..?!
  • ఈషా (Eesha) – ఈ దెయ్యం భయపెట్టలేదు… చిరాకెత్తించింది…
  • ఒకే ఒక డైలాగ్… బలమైన జంగిల్ రాజ్, మాఫియా రాజ్ కూలిపోయింది…
  • తక్కువ మంది అతిథులతో పెళ్లి… ఆశీస్సులు, పలకరింపులు, మర్యాదలు…
  • అసలే వాణిశ్రీ… పైగా చిరంజీవి… విజయశాంతీ ఉండనే ఉంది… ఇంకేం..?!
  • దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!
  • ఏరు దాటాక బోడి మల్లన్న… ఇది పవర్ లిఫ్టర్ ప్రగతి మరో మొహం…
  • అక్రమాల తిరుమల చీకట్లలో… ఒకటీఅరా మంచి నిర్ణయాలు… ఇలా…
  • బీఆర్ఎస్‌కు పార్టీ విరాళాల్లో భారీ క్షీణత… ఇది దేనికి సంకేతం..?!
  • ఎవరేం తక్కువ..? శివాజీ సామాను రచ్చ కాస్తా పెద్ది చికిరి పాట వైపు మళ్లింది…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions