.
స్టార్ మా పరివారం అని ఓ టీవీ షో వస్తుంటుంది… శ్రీముఖి హోస్టింగ్…
ఏమీ లేదు, స్టార్ మా సీరియళ్లలో నటించే నటీనటులతో, అప్పుడప్పుడూ బిగ్‌బాస్ పాత కస్టమర్లతో చిన్న చిన్న సరదా పోటీలు, మాటామంతీ కార్యక్రమం అది…
Ads
మొన్నొక తాజా ప్రోమో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది… గుండె నిండా గుడిగంటలు అనే సీరియల్ 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నదట… దాన్ని సెలబ్రేట్ చేయడమే ఈ ఆదిావారం స్టార్ మా పరివారం షో… హేమిటో…
అంత సక్సెస్ సీరియలా అని బార్క్ రేటింగ్స్ చూస్తే… స్టార్ మాటీవీ సీరియళ్ల జాబితాలోనే ఆరో ప్లేసులో ఉంది… మొదటి నుంచి వరుసగా కార్తీకదీపం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని, ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా.,. వీటి తరువాతే గుండె నిండా గుడిగంటలు… 8.40 వరకూ రేటింగ్స్… (ఒకప్పుడు టాప్ వన్‌లో ఉండే బ్రహ్మముడి సీరియల్ మధ్యాహ్నానికి మార్చాక రేటింగ్స్‌లో ఎక్కడో దిగువకు కొట్టుకుపోయింది…)
స్టార్ మా రీచ్ దృష్ట్యా పర్లేదు అనిపించే సీరియల్ … అసలు అది కాదు, టీవీ సీరియళ్లలో 300 ఎపిసోడ్స్ అనేది చాలా చిన్న విషయం… దానికి సెలబ్రేషన్ ఏమిటో మరి..! ఇదే చూస్తుంటే ఓ ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… అది జీతెలుగులో వచ్చే త్రినయని సీరియల్‌ను ఈ నెలాఖరులోపు, కాదు, 21వ తేదీతోనే ముగించేస్తారని…
నాలుగేళ్లుగా లాగీ లాగీ… పీకీ పీకీ… 1421 ఎపిసోడ్స్ చేశారు… తెలుగులో ఇదే లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్ అట… మాయలు, మంత్రాలు, జోస్యాలు, అతీంద్రియ శక్తులు, మూఢనమ్మకాలు, దొంగ సన్యాసులు, ఆత్మలు, విశాలాక్షి అమ్మవారే అప్పుడప్పుడూ అలా హీరో ఇంటికి రావడం… పాత విఠలాచార్య సినిమా బాపతు… చివరకు కథానాయిక యమలోకం కూడా వెళ్లి వచ్చింది… హీరోయిన్ పాత్ర వేసే ఆశిక పడుకోన్ ప్రస్తుతం తెలుగులో హైలీ పెయడ్ ఆర్టిస్టు… మంచి నటప్రతిభ కలిగిన కన్నడిగ…
నిజానికి ఇందులో ప్రధాన పాత్ర తిలోత్తమ… గతంలో పవిత్ర జయరామ్ నటించేది, యాక్సిడెంటులో చనిపోయాక ఆ పాత్రలోకి చైత్రను తీసుకొచ్చారు… ఇద్దరూ మంచి నటులే… బెంగాలీ సీరియల్ ఇది, తెలుగులోనే గాకుండా తమిళం, మలయాళం, మరాఠీల్లో కూడా రీమేక్ చేస్తున్నారు… ప్రతిచోటా హిట్టే…
కాకపోతే కంటెంటును స్థానికీకరించడంలో దరిద్రపు అభిరుచి… ఒకప్పుడు టాప్… జనం చూసీ చూసీ విసిగిపోయారు… ఇప్పుడది జీతెలుగు సీరియళ్లలోనే ఎక్కడో దిగువకు పడిపోయింది… ఇక సాగదీయడం వాళ్లకే విసుగెత్తినట్టుంది… మొహం కొట్టిందేమో… ఇక ఆపేస్తారట… ఐనా ఏముందిలే… హీరోయిన్ బిడ్డగా పుట్టిన హీరోయిన్ అత్త… హీరో సవతి తల్లిని చంపేయాలి… అంతే… దాంతో ఖేల్ ఖతం, దుకాణ్ బంద్..
అందగాడు చందు గౌడ, ఇప్పుడు కొద్దిగా లావయిన ఆశిక పడుకోన్ అందమైన టీవీ జంట… సూపర్ హిట్ జోడీ… తెలుగు టీవీ ఇండస్ట్రీ వాళ్లిద్దరితో మరో సీరియల్ ప్లాన్ చేసే ఉంటుంది… ఇద్దరూ జీతెలుగు ఆస్థాన కళాకారులే..!!
Share this Article