తండ్రి బిజూ పట్నాయక్ రెండుసార్లు… కొడుకు నవీన్ పట్నాయక్ 5 సార్లు ముఖ్యమంత్రి వరుసగా… పాతికేళ్లుగా దాదాపు… ఇక ఆ పట్నాయక్ వారసత్వానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే…! నవీన్ పట్నాయక్‌ను ఇన్నేళ్లూ అమితంగా ఆదరించిన ఒడిశా ప్రజలు ఈసారి మరీ ఘోరంగా తిరస్కరించారు…
ప్చ్, అనేక విషయాల్లో ఆదర్శ నాయకుడే… కానీ ఆరోగ్యం క్షీణించి, చేరదీసిన బ్యూరోక్రాట్ల చేతుల్లో బందీ అయిపోయాడో ఇక అన్నిరకాల పతనం ఆరంభమైంది… ఇంత దారుణమైన ఓటమిని ఎవరూ ఊహించలేదు… ఎగ్జిట్ పోల్స్‌లో కూడా ఎంపీ సీట్లకు సంబంధించి బీజేపీ అప్పర్ హ్యాండ్ ఉండొచ్చని భావించినా… అసెంబ్లీకి వచ్చేసరికి ఎప్పటిలాగే నవీన్ పట్నాయక్‌కు మెజారిటీ ఇస్తారని అనుకున్నారందరూ…
కేంద్రంలో అధికారం తిరిగి దక్కడానికి కూడా బీజేపీకి బలమైన ఆసరా (21లో 19) ఇచ్చి, మరీ నవీన్ పట్నాయక్ పార్టీని ఒక స్థానానికి పరిమితం చేసిన ఒడిశా వోటర్లు అసెంబ్లీ అధికారాన్ని (క్లియర్ మెజారిటీ) కూడా బీజేపీకే ఇస్తున్నారు… ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేని నవీన్ పట్నాయక్ మరో టరమ్ వరకూ పోరాడే శక్తిసామర్థ్యాలు కనిపించడం లేదు… (తన ఆరోగ్యం వేగంగా క్షీణించడం వెనుక ఏదో కుట్ర ఉందనీ, దర్యాప్తు చేయిస్తామని మోడీ ఏదో సభలో అన్నాడు…) తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన మాజీ ఐఏఎస్ అధికారి, తమిళుడు అయిన పాండ్యన్ కూటమి మీదే అందరికీ డౌట్…
Ads
24 ఏళ్ల తరువాత రాష్ట్రంలో మరో ముఖ్యమంత్రి రావడం ఇదే… 2014లో 20, 2019లో 12 ఎంపీ సీట్లు గెలిచిన బీజేడీ ఈసారి జస్ట్, ఒక సీటే (ఫైనల్ కాదు)… 2019లో బీజేపీకి ఒడిశా ప్రజలు కేవలం 23 సీట్లు ఇచ్చారు… కానీ ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నారు… (మ్యాజిక్ ఫిగర్‌కు ఐదారు సీట్లు ఎక్కువే)… కాంగ్రెస్ కూడా 15 సీట్లతో మళ్లీ జీవం పొందుతున్నట్టు కనిపిస్తోంది…
ఇక్కడ చెప్పుకోవాల్సింది… బీజేపీతో పొత్తు చర్చల గురించి..! కీలకమైన బిల్లుల విషయంలో నవీన్ పట్నాయక్ కేంద్రంలో బీజేపీకి మద్దతుగానే నిలిచారు… తన రాష్ట్రం గురించే తన ఆలోచన… ఈసారి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని మొదటి నుంచీ అనుకుంటున్నదే, క్షేత్ర స్థాయిలో బీజేపీ బలపడింది… చాన్నాళ్లుగా వర్క్ చేసుకుంటోంది…
ఈ స్థితిలో లోకసభకు బీజేపీకి ఫాయిదా ఉండేలా… అసెంబ్లీకి బీజేడీకి ఫాయిదా ఉండేలా… ఉభయతారకంగా సీట్ల ఒప్పందం కుదుర్చుకోవాలనే భావనతో ప్రయత్నాలు సాగాయి… కానీ ఎలాగూ అధికారంలోకి వస్తామనే భావనతో ఉన్న రాష్ట్ర బీజేపీ ఎక్కడికక్కడ ఈ ప్రయత్నాలకు అడ్డం పడ్డట్టు సమాచారం… ఒక దశలో ఇక బీజేడీ కూడా వదిలేసింది… ఫలితంగా ఈ దారుణమైన ఓటమి…
పొత్తే గనుక కుదిరి ఉంటే… క్లీన్ స్వీప్ సాధ్యమయ్యేది, కాంగ్రెస్ ఈ సీట్లు కూడా గెలవకుండా ఉండేది… మోడీ మొదటి నుంచీ ఒడిశా రిజల్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు… ‘ఈ ప్రభుత్వం డెడ్ లైన్ జూన్ 4, మా ప్రభుత్వం వచ్చేది జూన్ 10’ అన్నాడు… సరే, ఒడిశా ప్రజలు మార్పు కోరుకున్నారు… పట్నాయక్ శక్తి ఇక యాక్టివ్ రాజకీయాలకు సరిపోకపోవచ్చు, బీజేపీ మరింతగా తన బలాన్ని పెంచుకుంటుంది అధికారం ఆసరాగా… పాండ్యన్‌కు పట్నాయక్ వారసత్వాన్ని పునర్వైభవం దిశగా తీసుకెళ్లే రాజకీయ లక్షణాలు లేవు… వెరసి ఒడిశాలో పట్నాయక్ పాలన పరంపరకు ఇక స్వస్తి..!!
Share this Article