.
ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్
ఒక లిపి ఏర్పడడానికి వందల, వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా కాలప్రవాహంలో గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది.
Ads
కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి.
మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది. ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తాయి.
తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తోంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇంగ్లీషులో రాయడం ఇప్పుడు ట్రెండ్.
హైదరాబాద్ కు చెందిన ఒక ప్రఖ్యాత రియలెస్టేట్ సంస్థ ఏటా వేల ఇళ్ళు నిర్మిస్తూ… వేల కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటుంది. యజమానులు కూడా పదహారణాల తెలుగువారే. ఇళ్ళ నిర్మాణంతోపాటు ఇంటీరియర్, పి వీ సీ కిటికీలు, బాత్ రూమ్, కిచెన్ ఇలా ఇంటికి కావాల్సిన సకల ఉత్పత్తులు ఒకే గొడుగుకింద ఉండేలా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
వినియోగదారులు, కొనుగోలుదారులకు ఆ విషయం తెలియాలి. బహుశా ఒక యాడ్ ఏజెన్సీని పిలిచి ప్రకటనల తయారీ, విడుదల పనిని అప్పగించి ఉంటారు. ఆ యాడ్ ఏజెన్సీ తయారు చేసి…ప్రముఖ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనల ఖర్చు ఒక రోజుకే కోట్లల్లో ఉంటుంది.
# అందులో ఒకానొక తెలుగు ప్రకటనలో సగం ఇంగ్లిష్ భాష, సగం తెలుగు భాష ఉండడం పొరపాటు కాదు. నేటి తరం అవసరాలకు అనుగుణంగా యాడ్ ఏజెన్సీ ఉద్దేశపూర్వకంగానే అలా తయారు చేసింది.
# పాతతరం వారు తెలుగు చదువుకుంటారు; కొత్త తరంవారు ఇంగ్లిష్ చదువుకుంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ప్రస్తుత మార్కెట్ అవసరమిది. ఇక్కడ తన క్లయింటుకు మేలు చేసిన యాడ్ ఏజెన్సీని మెచ్చుకోవాలే కానీ… విమర్శించకూడదు.
# ఇంగ్లిష్ లో ఎలాంటి భాషాపరమైన, వ్యాకరణపరమైన దోషాల్లేవు కానీ… తెలుగులో మాత్రం తెలుగు ఒక్కటే లేదు.
# “మీ కలల గృహాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి” ఈ సంస్థ ఎలా సహాయపడుతుందో అని పైన శీర్షికలో తెలుగులో మెదలుపెట్టి- ఎండ్ టు ఎండ్ టర్న్ కీ సొల్యూషన్స్; పర్సనలైజ్డ్ సొల్యూషన్స్; సర్వీస్ ఎక్సలెన్స్; అన్ మ్యాచ్డ్ ప్రాడక్ట్ రేంజ్; నావెల్ కాన్సెప్ట్; హోమ్ ఆటోమేషన్… ఇలా లెక్కలేనన్ని చెప్పి చివర “హైదరాబాద్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మియాపూర్” అని చెప్పారు.
(మియాపూర్లో ఇల్లు కొనడానికా? మియాపూర్లో ఈ షో రూమ్ ను సందర్శించడానికా! క్లారిటీ లేదు. ముందు పేజీలో షో రూమ్ కు రమ్మన్నట్లు ఉంది కాబట్టి… మియాపూర్ లో షో రూమ్ ఉంది అని చెప్పబోయి… మియాపూర్ ను పొగిడినట్లున్నారు అని పాఠకులు పెద్ద మనసుతో అనుకోవాలి!)
# “ఎండ్ టు ఎండ్”; “టర్న్ కీ” లాంటి ఇంగ్లిష్ మాటలను “ముగింపు నుండి ముగింపు”, “తిరిగిన తాళం చెవి” అని తెలుగులోకి అనువదించకుండా యథాతథంగా కేవలం తెలుగు లిపిలో ఇచ్చినందుకు ఈ ప్రకటనను తయారుచేసిన యాడ్ ఏజెన్సీని అభినందించాలి.
# మనం తెలుగులో ఆలోచించడం మానేసి దశాబ్దాలు అవుతోంది కాబట్టి మన నిత్యవ్యవహారాల్లో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిషే ఉంటుంది. మన లోలోపలి భావం కూడా ఇంగ్లిష్ లోనే టర్న్ కీ పద్ధతిలో సుళ్ళు తిరుగుతూ ఉంటుంది!
“తెలుగులో తెలుగెక్కడుందిరా తెలుగోడా!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article