సినిమా అంటేనే ఓ దందా… కమర్షియల్ లెక్కలు చూసుకోవాల్సిందే… లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేరు, నెత్తిన బట్టేసుకుని పారిపోవాలి… అయితే ఆ కమర్షియల్ లెక్కలు కూడా ఓ కథలో ఇమడాలి… సినిమా అంతా కన్నీళ్లు పారించినా, డిష్యూం డిష్యూం మోతమోగించినా, రొమాంటిక్ సీన్లు దట్టించినా జనం చూడరు… మరీ ఇప్పటితరం ప్రేక్షకులు మన సినిమా మార్కు సూపర్ మ్యాన్ ఫైట్లను చూడటం ఎప్పుడో మానేశారు… కాకపోతే మన హీరోలకు ఇంకా సమజైతలేదు… మొన్న గోపీచంద్ సినిమా ఏదో వచ్చింది, దాని రిజల్ట్ ఎంత చేదుగా ఉందో మన ఇండస్ట్రీ ముఖ్యులు ఓసారి స్టడీ చేస్తే కళ్లు తెరుస్తారేమో… ఈమధ్య రజినీకాంత్ పెద్దన్న వచ్చింది, దాంతోపాటే విశాల్ ఎనిమీ కూడా వచ్చింది, ఫుల్ యాక్షన్ సీన్లు… మరీ ఎనిమీలో అయితే విశాల్, ఆర్య రెచ్చిపోయి యాక్షన్ సీన్లు చేశారు… పలుసార్లు లాజిక్ కూడా లేకుండా యాక్షన్ సీన్లు వచ్చి ప్రేక్షకుడిని దబీదబీ గుద్దేస్తాయి… నన్ను నిలబెట్టినవి ఇలాంటి సినిమాలే కదా అనే భావన విశాల్‌లో ఉందేమో, కానీ తన సినిమా విజయాల గ్రాఫ్ ఓసారి స్టడీ చేసుకుని ఉంటే ఈ సినిమా చేయకపోయి ఉండేవాడు…
సినిమా అన్నాక ఒకింత కామెడీ, కాసింత రొమాన్స్, సరిపడా యాక్షన్, రవ్వంత ఎమోషన్ గట్రా ఫార్ములా ప్రకారం ఉండాలేమో… కానీ బడబడా ఫైట్లే సినిమా అయితే..? బయట రాజకీయ నాయకులే పచ్చి బూతులు, మాటల ఫైట్లతో బోలెడంత వినోదాన్ని కలిగిస్తున్నారు… వాళ్ల స్థాయి చూసి జనం బాధపడే రోజులు కూడా పోయాయి… జస్ట్, ఇప్పుడు రాజకీయ నాయకుడంటే ఏవగింపు మాత్రమే… ఇక తెర మీద ఈ పిచ్చి ఫైట్లు చూసి చప్పట్లు కొట్టేదెవడు..? థ్రిల్ ఏముంది..? పైగా అందులోనూ తాళ్లు, డూప్స్, గ్రాఫిక్స్ సరేసరి… కాసేపు మమతమోహన్‌దాస్ కనిపించినప్పుడు సినిమా చూడబుల్‌గా ఉంది… హీరో అన్నాక హీరోయిన్ ఉండాలా..? నటి మృణాళిని ఎందుకు ఉందో ఈ సినిమాలో ఓపట్టాన అర్థం కాదు… బోలెడు సినిమాల్లో ఉన్నట్టే ప్రకాష్‌రాజ్ ఈ సినిమాలోనూ ఉన్నాడు… అదే లుక్కు, అవే పాత్రలు, అదే టోన్, అదే చూపు… చూసీ చూసీ మొనాటనీ వచ్చేసింది… థమన్ క్రియేటిటీలోని ఒరిజినాలిటీ, క్వాలిటీ ఏమిటో ఈ సినిమా పాటల నాసితనం వింటే తెలుస్తుంది… 25 ఏళ్ల తరువాత కలిసిన స్నేహితుల తత్వాలు, జీవితాలు, అనుభవాల నడుమ ఘర్షణ నిజానికి బాగా పండాలి… కానీ సినిమా తీసిన తీరు పెద్ద ఎమోషనల్‌గా ప్రేక్షకుడికి కనెక్టయ్యేలా లేదు… ఈ సినిమా గురించి ఇంకా చెప్పుకోవడం శుద్ధ దండుగ వ్యవహారం గానీ… ఈ సినిమా చూశాక ఓసారి మంచి మిత్రులు అనే ఓ పాత తెలుగు సినిమా గుర్తొస్తుంది…
Ads
అది 1968 నాటి సినిమా… అంటే యాభై ఏళ్లు దాటిపోయింది… కృష్ణ, శోభన్‌బాబు ప్రధాన పాత్రధారులు… ఇద్దరూ మిత్రులే, ఒకేచోట ఉంటుంటారు… ఏదో విషయంలో మాటామాటా పెరిగి వేర్వేరు దారులు వెతుక్కుంటారు… శత్రుత్వంతో కాదు, తత్వాల నడుమ వైరుధ్యం… అయిదేళ్ల తరువాత ఫలానారోజు కలవాలని తేదీ పెట్టుకుంటారు… (త్రీ ఇడియట్స్ సినిమాలో కూడా ఈ ఛాయ కనిపిస్తుంది మనకు… బుకిష్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి నడుమ ఘర్షణ అది…) ఆ ఫలానా రోజు వస్తుంది… ఎవరి బతుకులు ఎలా గడిచాయో, ఎవరి అనుభవాలు ఏమిటో చెప్పుకోవాలి… అక్కడ కోదండపాణి స్వరపరిచిన పాటను ఘంటసాల, బాలు పాడారు… వేర్వేరు గొంతులు… ఇదీ ఆ పాట లింక్… ‘‘ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమి..’’ (నిజానికిది చాన్నాళ్ల తరువాత కలుసుకోబోయే జంటకు కూడా బాగా సూటయ్యే పల్లవి… అఫ్ కోర్స్, చరణాలు సినిమా కథను బట్టి ఉంటయ్…) ఈరోజుకూ ఆ పాట వింటే చాలాసేపు చెవుల్లో గింగురుమంటూ ఉంటుంది… నీతితో బతికితే ఎదురులేదనేది ఒకరి అనుభవం… (కడుపు నిండిన పాత్ర)… ఈ దుర్మార్గమైన లోకంలో కత్తి పట్టుకుంటేనే కథ నడుస్తుందనేది మరొకరి అనుభవం… దాంతో విలన్ అవుతాడు… ఇద్దరి నడుమ కాన్‌ఫ్లిక్ట్… మనం టెక్నికల్‌గా, సినిమా ఖర్చుపరంగా చాలా చాలా ముందుకొచ్చాము, రీచ్, మార్కెట్, రెవిన్యూ రూట్స్ అన్నీ పెరిగాయి, కానీ వెనుకటి ఆ పాత సినిమాల రేంజ్ కూడా తీయలేకపోతున్నాం… అదీ చెప్పదలుచుకున్నది…!! ఇండస్ట్రీకి ఇదే అసలైన ఎనిమీ…!!!
Share this Article