తెలుసుగా… గాజు గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కిద్ది… అన్నట్టుగా ఆమధ్య ఏదో పదునైన సమర్థన పత్రికల్లో చదివినట్టు గుర్తు… ఇప్పుడు హఠాత్తుగా అదే గుర్తొచ్చింది… ఎందుకంటే..? ఏపీలో కొందరు ఇండిపెండెంట్లకు జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయించారు… అవును, ఇప్పుడు ఆ పగిలిన గాజు ముక్కలు పదునెక్కి ఠారెత్తించనున్నాయి… జనసేనను మాత్రమే కాదు, ఆ కూటమినే..!
పగిలేకొద్దీ పదునెక్కిద్ది అనే డైలాగ్‌కు కౌంటర్‌గా… తాగిన గ్లాసు సింకులో ఉండాలి, పేపర్ గ్లాసయితే డస్ట్ బిన్‌లో ఉండాలి అని వైసీపీ కూడా వ్యంగ్యంగా బాగానే ప్రచారం చేసినట్టుంది… సరే, ఆ సోషల్ పోరాటం మాటెలా ఉన్నా… ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులు సహా టీడీపీ, బీజేపీ నాయకులు కూడా ‘‘గాజు గ్లాసుకు వోటేయవద్దు ప్లీజ్’’ అని వోటర్లు మొరపెట్టుకోవాల్సి వచ్చేట్టుంది…
ఇదేంటి ఇసిత్రం..? ఎందుకలా అంటారా..? కారణం ఉంది… ఏపీలో అనేకచోట్ల వైసీపీ, యెల్లో కూటమి నడుమ టఫ్ ఫైట్ ఉంది… తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య కదా… సర్వశక్తులూ ఒడ్డుతోంది… జనసేన అధికారికంగా పోటీలో లేని కొన్నిచోట్ల ఇప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఇండిపెండెంట్లకు కేటాయించింది… అక్రమం ఏమీ కాదు, రూల్ ప్రకారమే…
Ads
గుర్తును పోలిన గుర్తుల వల్ల (అంటే కారు గుర్తును తలపించే ట్రక్కు గుర్తు వంటివి) టఫ్ ఫైట్ ఉన్నచోట్ల గెలుపోటములే ప్రభావితం అవుతాయి… అలా జరిగిన ఉదంతాలూ బోలెడు… ఈ గాజు గ్లాసుతో జరిగే నష్టం మరో తీరు… పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లేదా ఆ పార్టీ సానుభూతిపరులు పొరపాటున ఆ గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు మనవాళ్లే అనుకుని వోట్లేసే ప్రమాదం ఉంది… అది కూటమికి దెబ్బ అవుతుంది…
Sri Nivas Racharla సోషల్ మీడియా పోస్టు మేరకు… ఇదుగో ఇన్నిచోట్ల ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు…
1. విజయనగరం మాజీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్, అభ్యర్థి మీసాల గీత (టీడీపీ రెబల్).
2. మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్.
3. విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్.
4. టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్.
5. కాకినాడ జిల్లా జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర.
6. కావలి టీడీపీ రెబల్ సుధాకర్.
7. పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబు.
8. గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణ.
9. మంగళగిరిలో రావుసుబ్రహ్మణ్యం.
10. మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్.
11. ఎస్.కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి.
12. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నదళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప.
13. విజయవాడ ఎంపీ సీటులో నవతరం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన యనమండ్ర కృష్ణకిషోర్.
14. రాప్తాడు, మదనపల్లి, చంద్రగిరి, శ్రీకాళహస్తి కమలాపురం, మచిలీపట్నం కూడా…
జనసేన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే.. ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ కాదు.
1968 ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్/ కేటాయింపు) 10-b నిబంధన ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఎన్నికల నిబంధన ప్రకారం ఆరు శాతం ఓట్లు సాధించిన పార్టీకి శాశ్వత గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తుంది.
2019 శాసనసభ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై 137 సీట్లకు పోటీ చేసిన జనసేన కేవలం 5.53 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో జనసేన రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉంది.
ఇక రిజిస్టర్డ్ పార్టీలు ఎన్నికల గుర్తు కోసం శాసన సభ గడువు ఆరు నెలలలో ముగుస్తుందనగా ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకు గాజు గ్లాస్ గుర్తు తన పార్టీకి చెందాలంటూ రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) అధ్యక్షులు మేడా శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లడంతో గ్లాస్ గుర్తుపై వివాదం ప్రారంభమైంది.
2023 డిసెంబరు 20న ఆయన గాజు గ్లాస్ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు. కానీ ఆయన కంటే ముందే 2023 డిసెంబరు 12న మేము లేఖ రాశామని జనసేన హైకోర్టులో వాదించింది. జనసేన ముందుగా లేఖ ఇచ్చినందున గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించాల్సిందిగా హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాత్రమే గాజు గ్లాస్ గుర్తు ఇవ్వాలని హైకోర్టు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితా నుండి తొలగించమని కోర్టు ఆదేశించలేదు.
దీంతో ఎన్నికల గుర్తుల నిబంధనల మేరకు, జనసేన పోటీలో లేనిచోట్ల, ఆ గుర్తు కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు ఈరోజు ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది…
హేమిటో… చివరకు ఈనాడులో సైతం ఇలా తప్పుడు స్పాట్ వార్తలు… సిగ్గుచేటు…
Share this Article