బాలీవుడ్ నంబర్ వన్ నటి ఎవరిప్పుడు..? కంగనా..? దీపిక పడుకోన్..? ప్రియాంక చోప్డా..? శ్రద్ధాకపూర్..? ఎవరు..? వాళ్లెవరూ కాదు..! నిస్సందేహంగా ఆలియా భట్..! రెమ్యునరేషన్ లెక్కలు కాసేపు వదిలేయండి… డిమాండ్, పాపులారిటీ, దర్శకులు ఎవర్ని ప్రిఫర్ చేస్తున్నారు కోణాల్లో చూస్తే… ఆలియా నంబర్ వన్ ఇప్పుడు..! ఇండియన్ కాదు, బ్రిటిష్ పౌరసత్వమున్న నటి… వయస్సు కూడా 28 దాటలేదు… ఆమె సినిమా వయస్సు మరీ తొమ్మిదేళ్లే… చేసింది పట్టుమని పదమూడు సినిమాలు మాత్రమే… అంతేకాదు, ఆలియాకు బుర్రలేదు అన్నట్టుగా వందల జోకులు ఆమె పేరుతో కనిపిస్తయ్ సోషల్ మీడియాలో, నెట్లో..! నిజంగానే తన మాటల్లో లౌక్యం, పరిణతి గట్రా పెద్దగా ఉండవ్… కానీ తన ప్రొఫెషన్ విషయానికొచ్చేసరికి ఆమె సాధించుకున్నది తక్కువేమీ కాదు… వేరేవాళ్లకు అందనంత పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నదిప్పుడు… ఉదాహరణకు ఓ తాజా వార్త…
అందరికీ తెలుసు కదా భన్సాలీ ఎంత పాపులర్ దర్శకుడో… నిజజీవిత ప్రేమికులు, భార్యాభర్తలు రణవీర్ సింగ్, దీపికతో కలిసి మూడు సినిమాలు చేశాడు… రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్… తెర మీద ముచ్చటైన జంట… నాలుగోసారి కూడా జతకడతారు అని అందరూ భావించే ఓ ప్రాజెక్టును భన్సాలీ స్టార్ట్ చేశాడు… కానీ అనూహ్యంగా దీపిక మొగడు రణవీర్ సింగ్ బదులు ఆలియా భట్ మొగడు రణవీర్ కపూర్‌ను హీరోగా ఎంచుకున్నాడు… హీరోయిన్గా తాను మెచ్చే దీపికయే ఫైనల్ అనుకున్నాడు… కానీ తన మొగడికి బదులు రణవీర్ కపూర్‌ను తీసుకొస్తున్నాడని కినుక వహించిందో, ఇంకేమనుకున్నదో గానీ… భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది… దాంతో చిరాకెత్తిన భన్సాలీ ఆమెను కూడా తీసిపారేశాడు… అంతేకాదు, ఏవో ఇష్యూస్ తలెత్తి రణవీర్ కపూర్‌ను కూడా తీసేసి… దీపిక మొగడినే ఎంపిక చేసుకున్నాడు… హమ్మయ్య, ఇంకేముంది… సెటిల్డ్, మళ్లీ దీపిక వచ్చి చేరుతుంది… మళ్లీ ఆ ముచ్చటైన జంట నాలుగోసారి జతకడతారు అనుకున్నారు అందరూ… నో, అలా జరగలేదు… దీపికను భన్సాలీని తిరిగి ఆహ్వానించలేదు… ప్రత్యామ్నాయం వెతికాడు… ఆలోచించాడు… ఆలియా భట్ పేరు ఎదుట టిక్ పెట్టేశాడు… సో, దీపిక మొగడితో ఆలియా రొమాన్స్ చేయబోతోంది ఓ క్లాసిక్ మూవీలో… మ్యూజికల్ లవ్ స్టోరీ…
Ads
‘బైజు బావ్రా’ ఒరిజినల్ వెర్షన్ లో భరత్ భూషణ్, మీనా కుమారి జంటగా నటించారు… దీపికని మీనా కుమారి క్యారెక్టర్ లో ప్రేక్షకులకి చూపించాలని భన్సాలీ భావించాడు మొదట్లో… చివరకు అది వర్కవుట్ కాలేదు… ఆ చాన్స్ చివరకు ఆలియాను వరించింది… ఆలియా ఈరోజు నిర్మాతలకు, దర్శకులకు బెటర్ చాయిస్‌గా కనిపిస్తోంది… ఆమెలో నటనా ప్రతిభ ఉంది, ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉంది… సినిమా మధ్యలో సతాయించదు… ఇంకేం కావాలి..? పైగా గంగూబాయ్‌లో ఆమె పర్ఫామెన్స్ చూశాక భన్సాలీ ఆమె తప్ప ఇంకెవరు కనిపిస్తారు..? గంగూబాయ్ మాత్రమే కాదు, బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ, డార్లింగ్స్ కూడా ఆమె చేతుల్లో ఉన్నయ్… ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఆమె ఓ ప్రధాన ఆకర్షణ… అంతేనా..? ఎన్టీయార్, కొరటాల శివ రాబోయే సినిమా చాన్స్ కూడా ఆలియాను వరించిందట… ఆర్ఆర్ఆర్ షూటింగ్ టైమ్‌లో ఆమెను చూసి, తన రాబోయే ముప్ఫయ్యో సినిమాకు ఆమే కావాలని జూనియరే రికమెండ్ చేశాడని టాక్… ఇలా పాపులర్, ప్రిస్టేజియస్ ప్రాజెక్టులకు ఆమే బెటర్ చాయిస్‌గా కనిపిస్తోంది… జస్ట్, 13 సినిమాలు, 9 ఏళ్ల సినిమా వయస్సులో ఆమె సాధించింది చాలా ఎక్కువే…!!
Share this Article