విశాఖపట్టణం స్టీల్ ప్లాంటును తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేస్తుందా..? ఇదీ కీలకమైన ప్రశ్న… చేయదు అనేది జవాబు… చేయలేదు అనేది వివరణ… అబ్బే, ప్రభుత్వం కాదు, సింగరేణి కంపెనీతో కొనుగోలు చేయిస్తారు అని కొందరి స్పష్టీకరణ… అది కూడా జరగదు అనేది సత్యం… కేసీయార్ పొలిటికల్ ఫాయిదా కోసం పన్నిన తెలివైన ఎత్తుగడ ఇది… రావల్సినంత పొలిటికల్ మైలేజీ రాగానే మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనే మాట మాట్లాడడు… ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం…
అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం కాదు అది ‘ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు’ పిలిచింది… సరళంగా చెప్పాలంటే… ‘‘బొగ్గు సరఫరా చేయండి, మీకు అందుబాటులో ఉంటే ఉక్కు ఖనిజం సరఫరా చేయండి, దానికి బదులుగా మేం ఉక్కు ఇస్తాం…’’ ఇదీ ఈ టెండర్… అంటే కొన్ని పనులను ఔట్ సోర్సింగ్ చేయబోతున్నారు… అంతే… అదే నిజం… మరిక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేది ఏముంది..? ప్రైవేటీకరణ విధానాన్ని అడ్డుకునే అద్భుత రాజకీయ విధానం ఏముంది ఇందులో..?!
దిగువన ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్’ డాక్యుమెంట్ ఉంది… ఆసక్తి ఉన్నవాళ్లు చదువుకోవచ్చు… రా మెటీరియల్ మాత్రమే కాదు, వర్కింగ్ కేపిటల్ కోసం కూడా ఈ బిడ్… అది కూడా స్టీల్ సప్లయ్ చేసి, బాకీ తీరుస్తుంది… బ్లాస్ట్ ఫర్నేస్, బ్లాస్ట్ ఆక్సిజెన్ ఫర్నేస్ రూట్‌లో ఉక్కు ఉత్పత్తి వ్యవహారాలను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంభాళిస్తోంది…
Ads
ఈ బిడ్డు వేసేవాళ్లు తప్పనిసరిగా స్టీల్ వ్యాపారంలో గానీ, ఉక్కు ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ బిజినెస్‌లో గానీ ఉండి ఉండాలని ‘ఈవోఐ’ డాక్యుమెంట్ స్పష్టంగా చెబుతోంది… అయితే రా మెటీరియల్స్‌లో కుకింగ్ కోల్ కూడా ఒకటి కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణి కాలరీస్ ఈ బిడ్లలో దిగుతుందని తెలంగాణ ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి… కానీ దానికీ తెలుసు… బొగ్గు సప్లయ్ చేయడం కూడా కష్టమేనని… రాష్ట్రం ఏర్పడినప్పుడు 3500 కోట్ల లాభంలో ఉన్న సింగరేణి ఇప్పుడు 8500 కోట్ల నష్టాల్లో ఉందని ఆల్‌రెడీ ప్రతిపక్షాలు చెబుతున్నాయి… మనం కాసేపు ఆ చర్చ జోలికి వెళ్లకుండా… మరో విషయం చెప్పుకుందాం…
ఇది ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రైవేటీకరణ విధానం… ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇన్వాల్వ్ కావద్దనేది కేంద్రం చెబుతున్న పద్దతి… సో, సింగరేణిలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నందున ఈ విధానం ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంటు పనుల ప్రైవేటీకరణలో పాల్గొనలేదు… సింగరేణిలోని మిగతా 49 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా కాబట్టి అదీ అంగీకరించదు… ప్రస్తుతం కేవలం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ బిడ్లు పిలిచారు… ఫైనాన్షియల్ బిడ్స్ దశలో ఈ రూల్స్ బయటికి తెస్తారు… ప్రభుత్వ సంస్థలు ఈ ప్రైవేటీకరణ తంతులో పార్టిసిపేట్ చేస్తే అసలు మొత్తం ప్రైవేటీకరణ స్పూర్తికే విరుద్ధం కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను ఇలా బిడ్ల నుంచి మినహాయిస్తున్నారు…
సో… క్లారిటీ ఏమిటంటే..? ఇప్పుడు పిలిచిన బిడ్లు మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు నిమిత్తం కాదు… ఒకవేళ దానికే పిలిచినా సరే ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి బిడ్ వేయలేదు… కేవలం బొగ్గు సప్లయ్ చేయాలి, స్టీల్ తీసుకోవాలి అనే పనులకు మాత్రమే ఈ బిడ్లు… ఐనాసరే, బొగ్గు సరఫరా బిజినెస్‌లో ఉన్నందున సింగరేణి ఈ బిడ్లకు అర్హత కలిగినదే అనుకున్నా సరే… ఎక్కువగా విదేశీ బొగ్గును తీసుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంటుకు సింగరేణి బొగ్గు అవసరం లేదు… ఒకవేళ ఉక్కు ఖనిజం సప్లయ్ చేస్తుందీ అనుకుంటే… బయ్యారం తన చేతిలో లేదు, అక్కడ దొరికే ముడి ఖనిజం నాణ్యమైన ఉక్కు ఉత్పత్తికి పనికిరాదు…!!
చిన్న బేసిక్ లాజిక్… కేంద్రం విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోంది… వెనక్కి తగ్గడం లేదు… బిడ్లు వేయమని అడుగుతోంది… సో, ఆ బిడ్లలో పార్టిసిపేట్ చేయడం అంటేనే ప్రైవేటీకరణకు ఊతం ఇచ్చినట్టు కదా… ఇక ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరచేతిని అడ్డుపెట్టడం ఏమిటి…?! మరొక డౌట్… కేసీయార్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకం, కేంద్రాన్ని ఎదుర్కొనడానికి సిద్ధమే అంటూ, సింగరేణి గనుల్ని కేంద్రం అడ్డగోలుగా అమ్మేస్తూ సింగరేణికి ఉరి బిగిస్తుందనీ అంటున్నారు కదా… మరి తను దక్కించుకున్న తాడిచర్ల కోల్ మైన్‌ను సింగరేణికి ఇవ్వకుండా ఇంకెవరికో 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ఏమిటి..?
మైన్స్‌కూ, మైనింగ్ కంపెనీకి నడుమ తేడా ఉంది… సింగరేణిలో 51 శాతం రాష్ట్ర సర్కారుదే వాటా, మరి కేంద్రం ఏకపక్షంగా ప్రైవేటీకరించలేదు, అలా చేయబోమనీ మోడీయే స్వయంగా చెప్పాడు… ఐనా సింగరేణినే అమ్మేస్తున్నట్టు ప్రచారం దేనికి..?! బైలదిల్లా గనులను ఆదానీకి ధారాదత్తం చేసి బయ్యారంకు ఉరి అని మరో ప్రచారం… ఆదానీ అక్కడ కేవలం మైనింగు పని మాత్రమే చేస్తాడు, అది ఎన్ఎండీసీ మైన్… ఐనా బయ్యారంలోనే బొచ్చెడు ఖనిజం ఉందని చెబుతూ మరోవైపు బైలదిల్లా పాటేమిటి..?
Share this Article