75 సంవత్సరాల ఆజాదీ… ఈ సందర్భంగా కేంద్రం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఏడాది పొడవునా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది… ఎప్పటిలాగే అక్టోబరు రెండో తేదీ వచ్చింది… ఈ తేదీ అనగానే స్ఫురించేది మహాత్మాగాంధీ జయంతి… దేశమంతా ఆయన్ని స్మరిస్తూ బోలెడన్ని అధికారిక కార్యక్రమాలు సాగడం పరిపాటే… తప్పేముంది, జాతిపితగా మనం కీర్తించే ఓ ఘననాయకుడిని ఏటా ఆయన జయంతి రోజున స్మరించడంకన్నామంచి నివాళి ఏముంటుంది..? అయితే పాపం, మరో మంచి నాయకుడు కూడా ఇదేరోజున పుట్టాడు… వేరే రోజుల్లో గనుక పుట్టి ఉంటే ఆయనకు కాస్త ప్రాధాన్యం, మంచి నివాళి దక్కి ఉండేదేమో..!! ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి…! కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వాలు గానీ గాంధీని స్మరించడంలో చూపే శ్రద్ధలో కాసింతైనా ఆయన్ని స్మరించుకోవడంలో చూపించేవి కావు ఇన్నేళ్లూ… వ్యక్తిత్వంలో ఆయన తక్కువేమీ కాదు, నిజాయితీకి నిలువెత్తు రూపం… స్వాతంత్ర్య సమరయోధుడే… ఈ దేశానికి ప్రధానిగా కూడా చేశాడు, అదీ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో… పాకిస్థాన్‌తో ఓ యుద్ధాన్ని నడిపాడు… అంతేకాదు, యుద్ధానంతరం ఓ మిస్టరీ మరణానికి బలయ్యాడు…
ఇప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీయే… అది ఒక కుట్రపూరిత హత్య అనేది ప్రజల నమ్మకం… పాకిస్థాన్‌కు తెలుసు, అమెరికాకు తెలుసు, రష్యాకు తెలుసు… భారత ప్రభుత్వానికీ తెలుసు… కానీ ఆయన మరణానికి బాధ్యులెవరో, కారణాలేమిటో బయటపడదు, బయటికి రానివ్వరు… భయం… దర్యాప్తు లేదు, పోస్ట్‌మార్టం లేదు… చివరకు నామ్కేవాస్తే ఏర్పాటు చేసిన ఓ దర్యాప్తు కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పాల్సిన ఆయన వ్యక్తిగత వైద్యుడు కూడా కుట్రపూరిత ప్రమాదంలో మరణించాడు… అంతే ఇక, మరిచిపోయాం… ఇదీ మన జాతి మన కోసం ప్రాణాలొదిలిన ఓ నేతకు ఇచ్చే ‘‘నివాళి’’…!! (మన దేశం స్థానంలో ఇజ్రాయిల్ వంటి దేశం ఉండి ఉంటే, ఆ దేశం ఎలా ప్రతిస్పందించేదో ఓసారి ఊహించుకోవాలి…) సరే, కనీసం ఆయన జయంతి రోజైనా ఇన్నేళ్లూ సరిగ్గా గుర్తుతెచ్చుకుంటున్నామా..? అదీ లేదు… ఏదో మొక్కుబడిగా…!! ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ఇచ్చిన అధికారిక ప్రకటనల్ని చూసి ఒకింత ఆశ్చర్యం కలిగింది… అందులో గాంధీతో సమానంగా శాస్త్రికీ చోటుంది… అదీ విశేషం…
Ads
కావచ్చు… బీజేపీ ఎప్పుడూ గాంధీని తక్కువ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… ఈ దేశం ఇప్పటికీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీ అనుసరించిన రాజకీయ ధోరణులే కారణమని భావిస్తూ ఉంటుంది… గాంధీతోపాటు నెహ్రూ కుటుంబాన్ని కూడా నిందిస్తూ ఉంటుంది… గాంధీ గనుక నెహ్రూ బదులు పటేల్‌ను ప్రధానిగా చేసి ఉంటే ఈ దేశం కథ, దిశ వేరే ఉండేదని విశ్వసిస్తూ ఉంటుంది… అధికారికంగా గాంధీని గౌరవించినా సరే, లోలోపల గాంధీ మీద ఆగ్రహమే… లాల్ బహదూర్ శాస్త్రి మీద ప్రత్యేకంగా ప్రేమ ఏమీ లేకపోయినా సరే, పాకిస్థాన్‌ను ఓ యుద్ధంలో ఓడించిన ప్రధానిగా గౌరవిస్తుంది బీజేపీ… ఈసారి అధికారిక స్మారక ప్రకటనల్లో అందుకేనేమో గాంధీతో సమానంగా శాస్త్రికీ చోటు దక్కింది… ఎలాగైతేనేం..? శాస్త్రికి కూడా గాంధీతో సమనివాళి దక్కింది…!!
Share this Article