చూసారా చూసారా ! ఈ సినిమాను ఎవరయినా చూసారా ! ఛాన్సే లేదు . NTR తెలుగులో నటించి , తన పాత్రకు తానే డైలాగుల డబ్బింగ్ చెప్పని ఒకే ఒక్క సినిమా . అందువలనే ఫ్లాప్ అయింది . అంతే కాదు . 1955 లో ప్రారంభించబడి , 1973 లో విడుదలయింది . సినిమా వెండితెర మీదకు రావటానికి 18 ఏళ్ళు పట్టిందన్న మాట . ఈ సినిమా కష్టాలు ఏంటయ్యా అంటే :
1955 లో H.M రెడ్డి గజదొంగ అనే టైటిల్ తో NTR , సావిత్రి , బి సరోజాదేవిలతో సినిమా మొదలు పెట్టారు . రాజనాల , ఆర్ నాగేశ్వరరావులు విలన్లు . సినిమా సగం అయిపోయాక నిర్మాత H M రెడ్డి కన్ను మూసారు . సినిమా ఆగిపోయింది . NTR సినిమా కదా ! పూర్తి చేయటానికి మరొకరు వచ్చారు . షూటింగ్ మొదలయిన కొంత కాలానికి ఆర్ నాగేశ్వరరావు చనిపోయాడు . షూటింగ్ మళ్ళా ఆగిపోయింది .
కొంత కాలం తర్వాత ఆర్ నాగేశ్వరరావు స్థానంలో తమిళ నటుడు నంబియార్ని తీసుకున్నారు . డైరెక్టర్ కూడా మారిపోయారు . వైఆర్ స్వామి తప్పుకుని పార్థసారథి వచ్చి చేరారు. సినిమా పేరుని ధర్మ విజయంగా మార్చారు . కింద పడి పైన పడి షూటింగ్ పూర్తి చేసారు . పోస్ట్ ప్రొడక్షన్లో సమస్యలు వచ్చాయి . ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి . 18 ఏళ్ళు ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు .
Ads
పెద్ద స్టారింగ్ ఉన్న సినిమా కావటం వలన నిర్మాత టి గోపాలకృష్ణ సాహసం చేసి , భుజాలపైకి ఎత్తుకున్నారు . పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు . 18 ఏళ్ల తర్వాత డబ్బింగ్ చెప్పమని NTR ని అడిగే ధైర్యం చేయలేకపోయారు . డబ్బింగ్ ఆర్టిస్ట్ దశరధరామిరెడ్డి చేత డబ్బింగ్ చెప్పించి విడుదల చేసారు . టైటిల్ మార్చి ఎర్రకోట వీరుడు అని పేరు పెట్టారు . తమిళంలోకి తిరుడడే తిరుడన్ టైటిల్ తో డబ్ చేసి విడుదల చేసారు .
NTR సినిమా కదా ! జనం చూడటం మొదలెట్టారు . తీరా చూస్తే , NTR గొంతు కాదు . మరెవరిదో ఆ గొంతు . ఛా ఛా అన్నారు తెలుగు ప్రేక్షకులు . ఒక్క పాట కూడా హిట్ కాలేదు. సినిమా ఘోరంగా దెబ్బ తిన్నది . ఇదీ ఈ సినిమా యొక్క సినిమా కష్టాలు .
తెలుగులో మరో సినిమాకు కూడా NTR కు వేరే వారి గొంతు ఉంది . (మరొక సినిమా కూడా ఉన్నట్లు మిత్రులు చెబుతున్నారు)… సినిమా పేరు సంపూర్ణ రామాయణం . అయితే అది తమిళ సినిమా . తెలుగులోకి డబ్బింగ్ చేసారు . నేనయితే ఈ సినిమా పేరు కూడా వినలేదు . సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు….. By డోగిపర్తి సుబ్రహ్మణ్యం
Share this Article