మరీ దిక్కుమాలిన వార్త అనలేం… మంచి కోణమే… కానీ రాయడంలో ఫ్లాప్… ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానెల్ గురించి కాదు… ఆంధ్రజ్యోతి సైటులో వచ్చే కొన్ని వార్తలు పాత్రికేయ ప్రమాణాలకు దూరంగా ఉంటాయి ఎందుకో మరి… ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ టీం దాన్నలా గాలికి వదిలేసినట్టుంది… ఉదాహరణకు ఈరోజు రాసిన నామా నాగేశ్వరరావు వార్త…
ముందుగా ఆ వార్త సారాంశం చెప్పుకుందాం… అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం నామా నాగేశ్వరరావు పార్లమెంటులో ప్రశ్న వేస్తూ ‘‘కేసీయార్ 750 మంది పంజాబ్, ఒడిశాలకు చెందిన రైతులకు ఆర్థికసాయం చేశాడు, ఆ వివరాలు ఇవ్వగలరా’’ అని కేంద్ర మంత్రిని అడిగాడు… తద్వారా కేసీయార్‌కు దేశవ్యాప్తంగా మస్తు మైలేజీ వస్తుందని భ్రమపడ్డాడు… నిజానికి అప్పట్లో కొందరు రైతులకు ఇచ్చిన చెక్కులు వాపస్ వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి… అంతేకాదు, తెలంగాణలో కౌలు రైతులకు పైసా ఇచ్చే దిక్కులేదు గానీ ఎక్కడో పంజాబ్ రైతులకు తెలంగాణ ప్రజల సొత్తును దానం చేశాడనే విమర్శలూ వచ్చాయి…
నామా ప్రశ్నతో ‘వివరాలు తెప్పించి చెబుతాను’ అని సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు… ఆ 750 మంది వివరాలు పంపించాలని..! రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు… అసలు 750 మందికి ఇస్తే కదా… సరే, ఇప్పుడెందుకు ఈ వార్త రాయాల్సి వచ్చిందో తెలియదు గానీ… నామా అడిగిన ప్రశ్నతో కేసీయార్ ఇరుకునపడ్డాడనీ, ఏదో చేయబోతే ఇంకేదో అయ్యిందని ఈ వార్త చెబుతూ పోయింది… ఒక్కసారి ఆ వార్తలోని ఈ పేరా చదవండి…
Ads
ఇదీ అసలు కథ..! కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గతంలో నల్ల చట్టాలు (Nalla Chattalu) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలు కార్మికుల హక్కులు కాలరాసేలా ఉన్నాయని.. రద్దు చేయాల్సిందేనని దేశ వ్యాప్తంగా అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. కేసీఆర్ సర్కార్ కూడా ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది కూడా. అయితే.. ఈ ఉద్యమంలో వందలాది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రైతులను ఆదుకోవడానికి రంగంలోకి దిగిన కేసీఆర్ సర్కార్.. (KCR Sarkar) రూ. 3 లక్షలు చొప్పున సాయం చేశారు. అయితే ఎంత మంది రైతులకు ఇచ్చారు..? ఎంత చొప్పున సాయం చేశారు..? అనే వివరాలు ఇప్పటి వరకూ కేంద్రానికి (Central Govt) రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. పదే పదే అడిగినప్పటికీ ఇంతవరకూ కేసీఆర్ సర్కార్ నుంచి కేంద్రానికి ఎలాంటి సమాచారం వెళ్లలేదు. ఈ విషయంపై ఇటీవల హామీల అమలు కమిటీ ప్రశ్నించింది.
వార్త రాసిన రిపోర్టరే వాటిని నల్ల చట్టాలు అనడం ఏమిటి..? పైగా అవి కార్మికుల హక్కుల కోసం సాగిన ఉద్యమమట… వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రచ్చ జరిగిందట.,. ఈ ఉద్యమంలో వందలాది మంది రైతులు మరణించారట… అంటే సదరు రిపోర్టర్‌కు, దీన్ని అనుమతించిన సబెడిటర్‌కూ ఆ చట్టాల మౌలిక సమస్య మీద అసలు అవగాహనే లేదన్నమాట… పార్లమెంటులో కాదు పరువు పోయింది… ఈ సైటులో…!!
Share this Article