.
మీకు చిరంజీవి నటించిన వేట సినిమా గుర్తుందా..? కఠోర భద్రత వ్యవస్థలున్న అండమాన్ జైలు నుంచి తప్పించుకుంటాడు చిరంజీవి… తన పరారీ జైలు అధికారులకు, బ్రిటిషర్లకు హాశ్చర్యం కలిగిస్తుంది… సరే, అది ఓ కథ…
చిరంజీవిదే మరో సినిమా రాక్షసుడు గుర్తుంది కదా… అందులోనూ ఓ దుర్భేద్యమైన జైలు వంటి దీవి నుంచి ముగ్గురు తప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు… చివరకు ఇద్దరు తప్పించుకుంటారు, మూడో వ్యక్తి అక్కడే కుక్కలకు బలైపోతాడు… డెస్టినీ… సరే, అదీ ఓ కథే…
Ads
సరే, ఇక ఓ రియల్ స్టోరీలోకి వెళ్దాం… ముందు అది చదవండి…
(రమణ కొంటికర్ల) ( 99126 99960 ) ….. చుట్టంతా నీరు.. మధ్యలో ఓ దీవి. తక్కిన ప్రపంచం నుంచి ఏకాకై పడేసినట్టుండే ఆ దీవిలో హిమాలయాల ఎత్తును తలపించే గోడల మధ్య తప్పించుకోవడం అసంభవం.. అంతకుమించి నిత్యం నిఘా నీడలో భారీ భద్రత. అలాంటి జైలు నుంచి ముగ్గురు ఖైదీలు.. నెయిల్ కట్టర్, చెంచాలు ఉపయోగించి పారిపోయారు. ఆ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిందే ఎస్కేప్ ఫ్రమ్ అల్కట్రజ్.
భారీ భద్రత ఉన్న జైళ్ల నుంచైనా పారిపోగల్గే కరుడుగట్టిన నేరస్థులకు… ఆ అవకాశం లేకుండా చేసే జైలే అల్కట్రజ్. అమెరికాలోని.. శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఓ ద్వీపంలో ఉంటుంది.. ది రాక్ అని కూడా పిలిచే ఆ ఆల్కట్రజ్ జైల్ చుట్టూ సముద్రం ఉండటం వల్ల ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకోడానికి అవకాశమే ఉండేదు.
అలా ప్రయత్నించిన వారెందరో విఫలమయ్యారు. అంతకుముందెవ్వరూ సఫలం కాని ఆ జైలు నుంచి.. 1962, జూన్ 11న అర్ధరాత్రి ముగ్గురు ఖైదీలు తెలివిగా తప్పించుకున్న ఘటన చరిత్రలో ఓ పెను సంచలనం. ఆ తర్వాత ఏడాది కాలం తిరగకుండానే ఆ జైలు మూసేశారు. అంతకుముందు పలువురు ఖైదీలు 14 సార్లు విఫలయత్నం చేశారే తప్ప.. జైలు గోడలు దాటి విజయవంతంగా బయటకు వెళ్లలేకపోయారు. అంతేకాదు.. ఆ విఫలయత్నంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.
కానీ, ఫ్రాంక్ మోరీస్ తో పాటు, జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ అనే సోదరులు మాత్రం విజయవంతంగా ఆ జైలు నుంచి బయటపడ్డారు. తప్పించుకున్నారు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
మరి ఆ ఘనకార్యాన్ని సాధించిన ముగ్గురు ఖైదీల కథేంటి..?
వాషింగ్టన్ డీసీకి చెందిన ఫ్రాంక్ మోరీస్.. చిన్నతనం నుంచే పెద్ద మోసకారి. 13 ఏళ్లకే జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత పలు నేరాలతో తరచూ జైలు శిక్షలు మోరీస్ కు సర్వసాధారణమైపోయాయి.. ఏ జైలులో వేసినా.. ఏదో ఒక ప్లాన్‌తో తప్పించుకునేవాడు. ఫ్రాంక్ తెలివితేటలకు పోలీసులు కూడా ఆశ్చర్యపోయేవారు.
ఆ క్రమంలోనే నేరస్థులెవ్వరూ తప్పించుకోవడానికి, కనీసం ఊహించుకోవడం కూడా కష్టమయ్యే అల్కట్రజ్ కు ఫ్రాంక్ ను తరలించారు. అంతకుముందే ఫ్రాంక్ కు స్నేహితులైన జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ అనే సోదరుల ద్వయం కూడా ఆ జైలుకే తరలించడంతో.. ముగ్గురూ మళ్లీ అక్కడ జట్టు కట్టారు.
మోరీస్ తో కలిసి ఈ ద్వయం నేరాలకు పాల్పడేది. జార్జియాలో పుట్టిన జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్.. ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లేవారు. ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా ఫ్లాంక్ తన బ్రెయిన్ తో తెలివితేటలకు పదునుపెడితే.. జాన్, క్లారెన్స్‌లు కండబలాన్ని ఉపయోగించేవారు. అలా మోసాల నుంచి దొంగతనాల వరకూ.. ఆ ముగ్గురూ చేయని నేరమంటూ లేదు.
దాంతో ఫ్రాంక్, ఆంగ్లీన్ సోదరులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆంగ్లిన్ సోదరులను అట్లాంటా ఫెడరల్ పెనిటెన్షియరీకి.. ఫ్రాంక్ ను లుసియానా జైలుకు తరలించారు. ఆ క్రమంలో ఫ్రాంక్ లుసియానా నుంచి.. ఆంగ్లీన్ బ్రదర్స్ ఫెడరల్ కారాగారం నుంచి తప్పించుకోడానికి విఫలయత్నం చేసి.. ముగ్గురూ ఆయా జైళ్ల వద్ద దొరికిపోయారు.
దాంతో ఫ్రాంక్ తో పాటు.. ఆంగ్లీన్ బ్రదర్స్ ను.. మొత్తంగా ముగ్గురిని సముద్రం మధ్యలో ఉన్న ఆల్కట్రజ్ ద్వీపంలోని జైలుకు తరలించారు. అక్కడ వారికి ఓ ఘరానా దొంగతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్లు ఆ జైలు నుంచి తప్పించుకునే కథే.. ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కట్రజ్ మూవీ.
మరెలా తప్పించుకున్నారు…?
అంతకుముందే పరిచయమున్న ఆ ముగ్గురినీ పక్క పక్క సెల్ లోనే ఉంచడంతో.. మళ్లీ ముగ్గురూ కలిసి వ్యూహరచన చేసేందుకు అవకాశం కలుగుతుంది. వారితోపాటు.. అలెన్ వెస్ట్ అనే మరో ఖైదీ కూడా వారి పక్క సెల్‌లోనే ఉండటం.. జైళ్ల నుంచి తప్పించుకోవడంలో వెస్ట్ ది వెన్ను చూపని గుణం కావడం.. అప్పటికే ఆల్కట్రజ్ లో వెస్ట్ నాల్గేళ్లబట్టి ఉంటుండటంతో.. ఆ నల్గురూ కలిసి గ్రేట్ ఎస్కేప్ కు ప్లాన్ చేస్తారు.
ఆల్కట్రజ్ జైలులో ఖైదీలకు పని కల్పించే క్రమంలో.. ఫర్నీచర్ తయారు చేసే కార్పెంటరీ పని చేయిస్తారు. అలాగే, అమెరికా సైనికులకు దుస్తులు తయారు చేస్తారు. ఓ రోజు జైలును శుభ్రం చేస్తున్నప్పుడు వెస్ట్‌కు పడేసిన అక్కరకురాని రంపం బ్లేడ్స్ కనిపిస్తాయి. దాంతో వాటిని ఎవరికీ కనిపించకుండా తన సెల్‌లోకి తీసుకెళ్తాడు.
నలుగురూ కూడా కేవలం మోసాలు, దొంగతనాలు మాత్రమే చేయడంతో జైలు సిబ్బంది వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కేవలం కరడుగట్టిన నేరగాళ్లపైనే నిఘా పెట్టడంతో.. అదే అదనుగా ఆ నలుగురూ పథకం రచన చేస్తారు.
ఆల్కట్రజ్ జైలు నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని.. చిన్న పొరపాటైనా ప్రాణాలే పోతాయని ఆ నల్గురికీ తెలుసు. అయినా, నలుగురి ఆలోచనలు ఒకటే కావడంతో.. విజయవంతంగా పారిపోవచ్చని గట్టి పట్టుదలతో పథకం రచిస్తారు. తాము సెల్‌లో కనిపించకపోతే సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వస్తుందని, వెతుకుతారని తెలిసి.. ముందుగా నాలుగు డమ్మీ తలకాయలను తయారు చేయాలని ప్లాన్ చేస్తారు.
జైల్లో వాడే సబ్బులు, పేపర్ల వంటివాటిని పోగుచేసి.. నాలుగు తలకాయలను తయారుచేసే పనికి ఫ్రాంక్ నేతృత్వం వహిస్తాడు. పెయింటింగ్‌ల కోసం వినియోగించే కలర్లు దొంగిలించి.. ఆ డమ్మీ బొమ్మలకు రంగులు వేస్తాడు. జైల్లో సెలూన్ నుంచి కొంచెం జుట్టును తీసుకొచ్చి.. ఆ డమ్మీ తలలకు అతికిస్తాడు. అలా డమ్మీ తలలు రెడీ చేస్తారు.
కానీ, ఎలా తప్పించుకోవాలి…?
జైలు గదిలో గాలి, వెలుతురు కోసం ఏర్పాటుచేసిన అతి చిన్న వెంటిలేటర్‌పై మోరీస్ కన్ను పడుతుంది. దాన్ని రోజుకింత రాత్రి వేళలో పెకిలిస్తూ.. మొత్తంగా ఓ రంధ్రం చేస్తే సులభమవుతుందని భావిస్తారు. కానీ, అందుకు పనిముట్లు కావాలి. అవకాశమున్న వనరులతోనే ఏదైనా సాధించాలి. అందుకే చెంచాలు, నెయిల్ కట్టర్ వంటి పనిముట్లతో పాటు.. జైల్లో అందుబాటులో ఉన్న ప్రతి లోహపు వస్తువునూ వాడేస్తారు. ఓ పాడుబడిన వాక్యూమ్ క్లీనర్ మోటర్‌ను సైతం ముక్కలు చేసి వాడేస్తారు.
రోజూ వీటన్నింటి సాయంతో గోడకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ.. ఆ వెంటిలేటర్‌ను పెకిళించేందుకు ప్రయత్నం కొనసాగుతుంటుంది. అయితే, ఇదంతా కూడా శబ్దమయ్యే అవకాశముండగా.. ఖైదీలను ఉత్సాహంగా ఉంచేందుకు జైల్లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ అవర్ సమయంలో.. ఈ మొత్తం ఆపరేషన్ నిర్వహించేవారు ఆ నల్గురు ఖైదీలు.
ఖైదీలంతా బిగ్గరగా తమకు నచ్చిన పాటలు పాడుతూ.. మంచాలు, చువ్వలను డ్రమ్స్ లాగా వాడే టైంలో.. ఆ నలుగురు గోడకు రంధ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యేవారు. అలా తమ దొంగచాటు పనిని బట్టబయలు కాకుండా కానిచ్చేస్తారు.
జైలు గదికి రంధ్రం చేసి బయటకు వెళ్లినా.. ఆ సముద్రాన్ని దాటడమెలా అనేది మరో పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న..? జైల్ అధికారుల రెయిన్ కోట్స్ తయారీకి తెచ్చిన వాటర్ ప్రూఫ్ షీట్లను భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సెల్‌లోకి తెచ్చి.. వాటిని లైఫ్ జాకెట్లలా కుట్టి.. ఒక చోట భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత వెంటిలేటర్‌ను పూర్తిగా తొలగించి.. రాత్రి వేళ జైల్లో లైట్లు ఆర్పేసే జీరో అవర్లో తప్పించుకోవాలనేది ఆ కేటుగాళ్ల ప్లాన్.
అనుకున్నట్లుగానే జీరో అవర్‌లో ఆ నలుగురు.. ముందుగా తయారు చేసుకున్న నాలగు డమ్మీ తలకాయలను మంచాలపై పెట్టి.. ఆ రంధ్రం నుంచి పారిపోవడానికి సిద్ధమైతారు. అయితే ఫ్రాంక్, ఆంగ్లిన్ సోదరులు మాత్రమే ఈ రంధ్రం నుంచి బయటపడగల్గుతారుగానీ.. వెస్ట్ మాత్రం తప్పించుకోలేకపోతాడు. సీలింగ్ మీదకు చేరుకునేందుకు వెంటిలేటర్స్ తీయడమూ ఇబ్బందిగానే మారుతుంది.
అయితే అందులో ఓ వెంటిలేటర్ ను మోరిస్ ఉపాయంతో బద్ధలు కొడతాడు. అలా సీలింగ్ పైకి చేరుకుంటారు. వెస్ట్ కు ఆ జైలుపైనున్న అవగాహనతో ముందే సెక్యూరిటీకి సంబంధించిన అన్ని సూచనలు, సలహాలివ్వడంతో పారిపోవడం ఈజీ అవుతుంది. కానీ, వెస్ట్ మాత్రం సముద్రపు ఒడ్డుకు కూడా చేరుకోలేక విఫలమవుతాడు. అప్పటికే వారు ముగ్గురు పారిపోతారు. లైఫ్ జాకెట్ కూడా వారితోనే ఉండిపోవడం.. ఆలోపు డమ్మీ తలకాయల వ్యవహారం బయటపడి జైల్ అధికారులు సెర్చింగ్ మొదలెట్టడంతో వెస్ట్ దొరికిపోతాడు.
అలా వెస్ట్ ను పట్టుకుని జైలు సిబ్బంది విచారిస్తే.. వాళ్ల గ్రేట్ ఎస్కేప్ స్టోరీ బట్టబయలువుతుంది. వెస్ట్ చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు, ఎఫ్బీఐ ద్వీపం మొత్తం వారికోసం గాలిస్తారు. కానీ, వారి ఆచూకీ కనుక్కోలేక. పరువు పోతుందనే భావనతో ఆ ముగ్గురు చనిపోయారని ప్రకటిస్తారు.
తరువాత ఏం జరిగింది..?
వాళ్లు చనిపోయారనే కారణంతో పోలీసులు కేసు కూడా మూసివేశారు. 2013లో వచ్చిన ఓ లేఖతో మళ్లీ వారి కోసం వెతకులాట మొదలవుతుంది. నా పేరు జాన్ ఆంగ్లీన్. నేను, నా సోదరుడు క్లారెన్స్, ఫ్రాంక్ మోరీస్ కలిసి.. 1962 జూన్‌లో ఆల్కాట్రాజ్ జైలు నుంచి తప్పించుకున్నాం. ఆ రోజు రాత్రి మేం విజయవంతంగా సముద్రాన్ని దాటి బతికి బయటపడ్డామని లేఖలో ఉండటం శాని ఫ్రాన్సిస్కో పోలీస్ అధికారులను ఏటూ తేల్చుకోలేని ఓ అయోమయ స్థితిలో పడేస్తుంది. ఆ కేసును సవాల్ గా తీసుకుని ఎఫ్‌బీఐ మళ్లీ విచారణ ప్రారంభిస్తుంది. ఆ ముగ్గురు ఇంకా మోస్ట్ వాటెండ్ నేరగాళ్లేనని ప్రకటిస్తుంది.
ఈ ఆల్కట్రజ్ ఎస్కేప్ చోటుచేసుకుని ఏకంగా 64 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఎఫ్బీఐకి మోరీస్, ఆంగ్లిన్ సోదరుల ఆచూకీ అయితే లభించలేదు. ఇప్పుడు ముగ్గురి వయస్సూ 90ల్లో ఉండొచ్చని అంచనా. మరి ఈ ముగ్గురూ బతికే ఉన్నారా.. చనిపోయి ఉంటారా.. 2013లో లేఖ రాసింది వాళ్లేనా అన్నవి పరిశోధనాధికారులకు కూడా అంతుపట్టని రహస్యాలుగానే ఇప్పటికీ మిగిలిపోవడం ఈ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కట్రజ్ స్టోరీలో విశేషాలు.
ప్రస్తుతం అల్కట్రజ్ పాప్యులర్ నేషనల్ పార్క్ సైట్ గా, మ్యూజియంగా పర్యాటకులను అలరిస్తోంది. క్లైంట్ ఈస్ట్ వుడ్ ప్రధాన పాత్రలో డాన్ సీగెల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి థ్రిల్లర్.. నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు…
వేట, రాక్షసుడు సినిమాలు మాత్రమే కాదు, చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లు ఉన్నాయి... ఐతే ఇక్కడ చెప్పదలుచుకున్నది... డెస్టినీ... చివరి క్షణంలో లక్కీ పర్సన్స్ ఎస్కేప్... భ్రష్టజాతకులు దొరికిపోతారు... అదీ కథలో నీతి..!!
Share this Article