చుట్టంతా నీరు.. మధ్యలో ఓ దీవి. ప్రపంచం మొత్తం నుంచి ఏకాకై పడేసినట్టుండే ఆ దీవిలో ఎత్తైన గోడల మధ్య తప్పించుకోవడం అసంభవమయ్యే ఓ పెద్ద జైలు. అంతుకుమించి నిత్యం నిఘా నీడలో కనిపించే భారీభద్రత. ఆ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు.. కేవలం చెంచాలు ఉపయోగించి పారిపోతే..? ఆ వాస్తవ సంఘటనే ఎస్కేప్ ఫ్రమ్ అల్కాట్రాజ్ మూవీ నేపథ్యం.
వివిధ నేరాల్లో శిక్షనుభవిస్తూ.. ఎంతటి భారీ భద్రత ఉన్న జైళ్లనుంచైనా పారిపోగల్గే కరుడుగట్టిన నేరస్థులకు… ఆ అవకాశం లేకుండా చేసే జైలే అల్కాట్రాజ్. అమెరికాలోని.. శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఓ ద్వీపంలో ఉంటుంది.. ది రాక్ అని కూడా పిలిచే ఆ ఆల్కాట్రాజ్ జైల్. చుట్టూ సముద్రం ఉండటం వల్ల ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకోడానికి అవకాశమే ఉండేది కాదు. కానీ, అంతకుముందెవ్వరూ సఫలం కాని ఆ జైలు నుంచి.. 1962, జూన్ 11న అర్ధరాత్రి ముగ్గురు ఖైదీలు తెలివిగా తప్పించుకున్న ఘటన చరిత్రలో ఓ పుటగా మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు పలువురు ఖైదీలు 14 సార్లు విఫలయత్నం చేశారే తప్ప.. జైలు గోడలు దాటి విజయవంతంగా బయటకు వెళ్లలేకపోయారు.అంతేకాదు.. ఆ విఫలయత్నంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఫ్రాంక్ మోరీస్, జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ అనే సోదరులు మాత్రం విజయవంతంగా ఆ జైలు నుంచి బయటపడ్డారు. తప్పించుకున్నారు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కథకు ముందు.. మనం ముందుగా ఆ ఘనకార్యాన్ని సాధించిన ముగ్గురు ఖైదీల గురించీ కాస్త చెప్పుకోవాల్సిందే!
Ads
వాషింగ్టన్ డీసీకి చెందిన ఫ్రాంక్ మోరీస్.. చిన్నతనం నుంచే పెద్ద మోసకారి.13 ఏళ్లకే జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత పలు నేరాలతో తరచూ జైలు శిక్షలు మోరీస్ కు సర్వసాధారణమైపోయాయి. అంతేకాదు.. ఏ జైలులో వేసినా.. ఏదో ఒక ప్లాన్‌తో తప్పించుకునేవాడు. ఫ్రాంక్ తెలివితేటలకు పోలీసులు కూడా ఆశ్చర్యపోయేవారట. ఆ క్రమంలోనే నేరస్థులెవ్వరూ తప్పించుకోవడానికి కనీసం ఊహించుకోవడం కూడా కష్టమయ్యే అల్కాట్రాజ్ కు ఫ్రాంక్ ను తరలించారు. అంతకుముందే ఫ్రాంక్ కు స్నేహితులైన జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ అనే సోదరుల ద్వయం కూడా ఆ జైలుకే తరలించడంతో.. ముగ్గూరూ ఒకటయ్యారు. మోరీస్ తో కలిసి ఈ ద్వయం నేరాలకు పాల్పడేది. జార్జియాలో పుట్టిన జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్.. ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లేవారు.
ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా ఫ్లాంక్ తన బ్రెయిన్ తో తెలివితేటలకు పదునుపెడితే.. జాన్, క్లారెన్స్‌లు కండబలాన్ని ఉపయోగించేవారు. అలా మోసాల నుంచి దొంగతనాల వరకూ.. ఈ ముగ్గురూ చేయని నేరమంటూ లేదు. దాంతో ఫ్రాంక్, ఆంగ్లీన్ సోదరులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆంగ్లిన్ సోదరులను అట్లాంటా ఫెడరల్ పెనిటెన్షియరీకి.. ఫ్రాంక్ ను లుసియానా జైలుకు తరలించారు. ఆ క్రమంలో ఫ్రాంక్ లుసియానా నుంచి.. ఆంగ్లీన్ బ్రదర్స్ ఫెడరల్ కారాగారం నుంచి తప్పించుకోడానికి విఫలయత్నం చేసి.. ముగ్గురూ ఆయా జైళ్ల వద్ద దొరికిపోయారు. దాంతో ఫ్రాంక్ తో పాటు.. ఆంగ్లీన్ బ్రదర్స్ ను.. మొత్తంగా ముగ్గురిని సముద్రం మధ్యలో ఉన్న ఆల్కాట్రాజ్ ద్వీపంలోని జైలుకు తరలించడం.. అక్కడ వారికి ఓ ఘరానా దొంగతో పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత వాళ్లు తప్పించుకునే తీరే ఎఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్ మూవీ.
మరెలా తప్పించుకున్నారు…?
వీళ్ల ముగ్గురికీ ఉన్న పరిచయం తెలియకో, ఏమో… జైల్లో ముగ్గురినీ ఒకే సెల్‌లో వేయడమే మళ్లీ ముగ్గురూ కలిసి వ్యూహరచన చేసేందుకు అవకాశం కల్పించిందేమో! వీరితోపాటు.. అలెన్ వెస్ట్ అనే మరో ఖైదీ కూడా ఇక్కడి సెల్‌లో ఉండటం.. జైళ్ల నుంచి తప్పించుకోవడంలో వెస్ట్ ది వెన్ను చూపని గుణం కావడం.. అప్పటికే ఆల్కాట్రాజ్ లో వెస్ట్ నాల్గేళ్లబట్టి ఉంటుండటంతో.. ఈ నల్గురూ కలిసి గ్రేట్ ఎస్కేప్ కు ప్లాన్ చేశారు.
ఆల్కాట్రాజ్ జైలులో ఖైదీలకు పని కల్పించే క్రమంలో.. ఫర్నీచర్ తయారు చేస్తుంటారు. అలాగే, అమెరికా సైనికులకు దుస్తులు తయారు చేస్తారు. ఓ రోజు జైలును శుభ్రం చేస్తున్నప్పుడు వెస్ట్‌కు పడేసిన అక్కరకురాని రంపం బ్లేడ్స్ కనిపిస్తాయి. దాంతో వాటిని ఎవరికీ కనిపించకుండా తన సెల్‌లోకి తీసుకెళ్తాడు. నలుగురూ కూడా కేవలం మోసాలు, దొంగతనాలు మాత్రమే చేయడంతో జైలు సిబ్బంది వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కేవలం కరడుగట్టిన నేరగాళ్లపైనే నిఘా పెట్టడమే.. ఈ నలుగురూ ఓ అవకాశంగా మల్చుకున్నారు.
ఆల్కాట్రాజ్ జైలు నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని.. చిన్న పొరపాటైనా ప్రాణాలే పోతాయని తెలిసినా.. నలుగురి ఆలోచనలు ఒకటే కావడంతో.. విజయవంతంగా పారిపోవచ్చని గట్టి పట్టుదలతో పథకం రచించారు. తాము సెల్‌లో కనిపించకపోతే సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వస్తుందని.. వెతుకుతారని తెలిసి.. ముందుగా నాలుగు డమ్మీ తలకాయలను తయారు చేయాలని ప్లాన్ చేస్తారు. జైల్లో వాడే సబ్బులు, పేపర్ల వంటివాటిని పోగుచేసి.. నాలుగు తలకాయలను తయారుచేసే పనికి ఫ్రాంక్ నేతృత్వం వహిస్తాడు. పెయింటింగ్‌ల కోసం వినియోగించే కలర్లు దొంగిలించి.. ఆ డమ్మీ బొమ్మలకు రంగులు వేస్తాడు. జైల్లో సెలూన్ నుంచి కొంచెం జుట్టును తీసుకొచ్చి.. ఆ డమ్మీ తలలకు అతికిస్తాడు. అలా డమ్మీ తలలు రెడీ చేస్తాడు.
కానీ, ఎలా తప్పించుకోవాలి…?
జైలు గదిలో గాలి, వెలుతురు కోసం ఏర్పాటుచేసిన అతి చిన్న వెంటిలేటర్‌పై మోరీస్ కన్ను పడుతుంది. దాన్ని రోజుకింత రాత్రి వేళలో పెకిళిస్తూ.. మొత్తంగా ఓ రంధ్రం చేస్తే సులభమవుతుందని భావిస్తారు ఈ నల్గురు ఖైదీలు. కానీ, అందుకు పనిముట్లు కావాలి. కానీ, అవకాశమున్న వనరులతోనే ఏదైనా సాధించాలి. అందుకే చెంచాలు, రంపాలే పనిముట్లు చేసుకుని.. జైల్లో అందుబాటులో ఉన్న ప్రతి లోహపు వస్తువునూ వాడేస్తారు. ఓ పాడుబడిన వాక్యూమ్ క్లీనర్ మోటర్‌ను సైతం ముక్కలు చేసి వాడేస్తారు.
రోజూ వీటన్నింటి సాయంతో గోడకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ.. ఆ వెంటిలేటర్‌ను పెకిళించేందుకు ప్రయత్నం కొనసాగుతుంటుంది. అయితే ఇదంతా కూడా శబ్దమయ్యే అవకాశముండగా.. ఖైదీలను ఉత్సాహంగా ఉంచేందుకు జైల్లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ హవర్ సమయంలో.. ఈ మొత్తం ఆపరేషన్ నిర్వహించేవారు ఈ నల్గురు ఖైదీలు. ఖైదీలంతా బిగ్గరగా తమకు నచ్చిన పాటలు పాడుతూ.. మంచాలు, చువ్వలను డ్రమ్స్ లాగా వాడే టైంలో.. ఈ నలుగురు గోడకు రంధ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యేవారు. అలా తమ దొంగచాటు పనిని బట్టబయలు కాకుండా కానిచ్చేశారు.
జైలు గదికి రంధ్రం చేసి బయటకు వెళ్లినా.. ఆ సముద్రాన్ని దాటడమెలా అనేది మరో పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న..? జైల్ అధికారుల రెయిన్ కోట్స్ తయారీకి తెచ్చిన వాటర్ ప్రూఫ్ షీట్లను భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సెల్‌లోకి తెచ్చి.. వాటిని లైఫ్ జాకెట్లలా కుట్టి.. ఒక చోట భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత వెంటిలేటర్‌ను పూర్తిగా తొలగించి.. రాత్రి వేళ జైల్లో లైట్లు ఆర్పేసే జీరో హవర్లో తప్పించుకోవాలనేది ఈ కేటుగాళ్ల ప్లాన్. అనుకున్నట్లుగానే జీరో హవర్‌లో ఆ నలుగురు.. ముందుగా తయారు చేసుకున్న నాలుడు డమ్మీ తలకాయలను మంచాలపై పెట్టి.. ఆ రంధ్రం నుంచి పారిపోవడానికి సిద్ధమైతారు. అయితే ఫ్రాంక్, ఆంగ్లిన్ సోదరులు మాత్రమే ఈ రంధ్రం నుంచి బయటపడగల్గుతారుగానీ.. వెస్ట్ మాత్రం తప్పించుకోలేకపోతాడు.
ముగ్గురు కలిసి వెస్ట్ ను రంధ్రం నుంచి బయటకు లాగేందుకు విశ్వప్రయత్నం చేసినా.. సాధ్యం కాకపోవడంతో పారిపోతారు. ఆ క్రమంలో సీలింగ్ మీదకు చేరుకునేందుకు వెంటిలేటర్స్ తీయడమూ ఇబ్బందిగానే మారుతుంది. అయితే అందులో ఓ వెంటిలేటర్ కొంచెం వదులుగా ఉండటం వారికి కలిసొస్తుంది. అలా సీలింగ్ పైకి చేరుకుంటారు. వెస్ట్ కు ఆ జైలుపైనున్న అవగాహనతో ముందే సెక్యూరిటీకి సంబంధించిన అన్ని సూచనలు, సలహాలివ్వడంతో పారిపోవడం ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఎలాగోలా వెస్ట్ కూడా సముద్రపు ఒడ్డుకు చేరుకున్నా.. అప్పటికే వారు పారిపోవడం.. లైఫ్ జాకెట్ వారితోనే ఉండిపోవడం.. ఆలోపు డమ్మీ తలకాయల వ్యవహారం బయటపడి జైల్ అధికారులు సెర్చింగ్ మొదలెట్టడం.. అలా వెస్ట్ ను పట్టుకోవడంతో వాళ్ల గ్రేట్ ఎస్కేప్ స్టోరీ వినిపించడం.. వెస్ట్ చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు, ఎఫ్బీఐ ద్వీపం మొత్తం వారికోసం గాలించడం.. వారి ఆచూకీ తెలియక.. పరువు పోతుందనే భావనతో ఆ ముగ్గురు చనిపోయారని ప్రకటించడం ఇలా సాగుతుంది మొత్తంగా ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్.
వాళ్లు చనిపోయారనే కారణంతో పోలీసులు కేసు కూడా మూసివేశారు. 2013లో వచ్చిన ఓ లేఖతో మళ్లీ వారి కోసం వెతకులాట మొదలవుతుంది. నా పేరు జాన్ ఆంగ్లీన్. నేను, నా సోదరుడు క్లారెన్స్, ఫ్రాంక్ మోరీస్ కలిసి.. 1962 జూన్‌లో ఆల్కాట్రాజ్ జైలు నుంచి తప్పించుకున్నాం. ఆ రోజు రాత్రి మేం విజయవంతంగా సముద్రాన్ని దాటి బతికి బయటపడ్డామని లేఖలో ఉండటం శాని ఫ్రాన్సిస్కో పోలీస్ అధికారులకు ఏటూ తేల్చుకోలేని స్థితిని కల్పించింది. దాంతో ఎఫ్‌బీఐ మళ్లీ విచారణ ప్రారంభించింది. ఆ ముగ్గురు ఇంకా వాళ్లు వాటెండ్ నేరగాళ్లేనని ప్రకటించడమే ఈ స్టోరీలోని థ్రిల్.
ఈ ఆల్కాట్రాజ్ ఎస్కేప్ చోటుచేసుకుని ఏకంగా 60 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఎఫ్బీఐకి మోరీస్, ఆంగ్లిన్ సోదరుల ఆచూకీ అయితే లభించలేదు. ఇప్పుడు ముగ్గురి వయస్సూ 90ల్లో ఉండొచ్చని అంచనా. మరి ఈ ముగ్గురూ బతికే ఉన్నారా.. చనిపోయి ఉంటారా.. 2013లో లేఖ రాసింది వాళ్లేనా అన్నవి పరిశోధనాధికారులకు కూడా అంతుపట్టని రహస్యాలుగానే ఇప్పటికీ మిగిలిపోవడం ఈ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్ స్టోరీలో విశేషాలు.
క్లైంట్ ఈస్ట్ వుడ్ ప్రధాన పాత్రలో డాన్ సీగెల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చే అవకాశముంది. నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.
- రమణ కొంటికర్ల…
Share this Article