ఈనాడు పత్రికను గాలికి వదిలేసినట్టే… ఈటీవీని కూడా వదిలేశాడా రామోజీరావు…! ఈ మాట పరుషంగా ఉన్నాసరే, అంకెలు అబద్ధం ఆడవు… తను దీటుగా గేమ్ ఆడుతున్న ఫీల్డులో కూడా ఆటను వదిలేస్తున్న తీరు సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది… ఆయన తప్పు ఎక్కడయ్యా అంటే…? సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించకపోవడం..!
ఈటీవీ పేరిట చాలా చానెళ్లున్నయ్… ఈటీవీ, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్… ఇంకేమైనా ఉన్నాయో తెలియదు… ఇందులో నడిచేది ఈటీవీ అనబడే వినోద చానెల్ మాత్రమే… మిగతావి ఉన్నా లేనట్టే… ఈటీవీ బండిల్ పేరిట అడ్డగోలు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి తప్ప ఆ మిగతా చానెళ్లు దేనికీ పనికిరావు… అసలు బార్క్ జాబితాలోనే అవి ఎక్కడో దిగువన ‘‘ఉన్నాం’’ అన్నట్టుగా కనిపిస్తుంటాయి…
Ads
ఇది తాజా బార్క్ రేటింగుల చార్ట్… ఉన్నవే నాలుగు వినోద చానెళ్లు ప్రధానంగా… అందులో జెమినివాడు ఎప్పుడో సమరం నుంచి వైదొలిగాడు… తీటకు ఏదైనా కొత్త సినిమా కొంటే, అది ప్రసారం చేసి, ఆ రేటింగ్స్ మంచిగా వస్తే ఆరోజుకు ఖుషీ… అంతకుమించి వాడికి ఏమీ చేతకావడం లేదు… దాని పని అయిపోయినట్టే… మిగతావి మూడు…
వీటిల్లో మాటీవీ ఓ మాయల మరాఠీ… ఓ నాలుగైదు సీరియళ్లు మినహా పెద్దగా రోజూ వచ్చే రియాలిటీ షోలు ఏమీ ఉండవు… ఆ సీరియళ్లకే రేటింగ్ ప్రమోషన్ చేసుకుంటూ మిగతావాళ్లకు అందనంత ఎత్తులో ఉంటున్నది టీవీ… తన రేటింగులకు ప్రధాన కారణం సీరియళ్లు… కార్తీకదీపం, వదినమ్మ, గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, చెల్లెలికాపురం ఎట్సెట్రా… అన్ని తలకుమాసిన సీరియళ్లే…
నిజానికి వాటితో పోలిస్తే జీవాడి సీరియళ్లు ఈమధ్య బాగా నడుస్తున్నయ్… అఫ్కోర్స్, సీరియళ్లన్నీ ఒకేతరహా అవలక్షణాల్ని కలిగి ఉంటయ్… ఒకడిని చూసి ఇంకొకడు ఒకేతరహా చెత్తను నింపుతున్నారు… వేరే దిక్కులేన ఇళ్లల్లో జనం చూడకతప్పడం లేదు… ఉన్నంతలో జీవాడు త్రినయని, ప్రేమఎంతమధురం, రాధమ్మకూతురు, నంబర్ వన్ కోడలు, నాగభైరవి, హిట్లర్ గారి పెళ్లాం, కల్యాణ్ వైభోగం… సీరియళ్లతో మాటీవీకి మస్తు పోటీ ఇస్తున్నాడు… రెండో స్థానంలో నిలబడటానికి నానా ప్రయత్నాలూ చేస్తున్నాడు… కాకపోతే రియాలిటీ షోలలో ఫెయిలవుతున్నాడు…
ఇక్కడ జాలిపడాల్సింది ఈటీవీని చూసి… మూడో స్థానంలోకి పడిపోవడం మాత్రమే కాదు… మాటీవీ రేటింగుల్లో సగం కూడా లేవు… మరీ దారుణంగా పడిపోయింది ఈటీవీ ఇమేజీ… ఎందుకిలా..? రియాలిటీ షోలు, స్పెషల్ ఈవెంట్లు బాగా ఉంటయ్ కదా… పైగా పేరుకు వినోద చానెల్ అయినా దాన్ని నెట్టుకురాగలుగుతోంది రాత్రి 9 గంటల ప్రైమ్ టైమ్ న్యూస్ బులెటినే కదా… మరి అంత ఘోరంగా ఎందుకు పడిపోయింది… కారణం :: సీరియళ్లు… ఒక్కటంటే ఒక్క సీరియల్ ఆసక్తికరంగా ఉండటం లేదు… ఆలీ నటించిన యమలీల ప్లస్ నాపేరు మీనాక్షి, మనసు మమత కాస్త చానెల్ రేటింగ్స్‌ను ఆదుకుంటున్నయ్… కానీ పస లేదు… కేవలం ఆ క్షుద్ర కామెడీ జబర్దస్త్ మాత్రమే చానెల్‌ను నిలబెట్టదండీ సారూ… మరీ జెమిని టీవీ స్థాయికి పడిపోయాక కళ్లు తెరుస్తారా ఏం..?!
Share this Article