మీరు ఈటీవీ చూస్తుంటారా..? జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్… మరో నాలుగు రోజులు పోతే జబర్దస్త్ ఓల్డ్ రీమిక్స్, జబర్దస్త్ ఓల్డ్ గోల్డ్ వంటివీ రావచ్చు అది వేరే సంగతి… అన్నీ కామెడీ అనబడే బూతుపురాణాలే అనేదీ వేరే సంగతే… అవి గాకుండా క్యాష్… అది ఓ కామెడీ కిట్టీ పార్టీ… ఢీ… పేరుకు సర్కస్ ఫీట్లు అనబడే డాన్స్ షో, అందులోనూ కామెడీయే ప్రధాన సరుకు… వావ్, కంటెస్టెంట్లతో సాగించే కిట్టీ పార్టీ టైపు విట్టీ పార్టీ… అందులోనూ కామెడీయే అంతఃప్రధానంగా అసలు సరుకు… అదేదో స్టార్ మహిళ… పేరులో స్టార్ ఉన్నా సరే, ఈటీవీ వాళ్లు పాతరాతి యుగం నుంచీ నడిపిస్తున్న షో… అదీ సుమ మార్క్ కామెడీ పంచులు కమ్ కిట్టీ పార్టీ టైపు షో… ఆలీతో సరదాగా, అది కామెడీ కాదు గానీ కామెడీ చేయడానికి ఆలీ బాగా ఘోరంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు… సో, ఇలా ఈటీవీలో ఏ రియాలిటీ షో చూసుకున్నా అది కామెడీతో లింకయి ఉంటుంది… కామెడీ లేనిదే, సారీ కామెడీగా చెప్పబడే ఆ సరుకు లేనిదే ఈటీవీ షోలు ఉండవు…
ఇప్పుడు తాజాగా మరో కామెడీ షో తీసుకొస్తున్నది ఈటీవీ… రేటింగుల కోసం ఫాఫం, అది కామెడీనే నమ్ముకున్నది కదా మరి… మరి సుధీర్, పూర్ణ, వర్షిణి, ఆది… ఇలా అందరితోనూ కావాలని తీసేస్తాం, తోకలు కత్తిరిస్తాం టైపు కీచులాటలు పెట్టుకుంటున్నది టీవీ… ఈ స్థితిలో కొత్త కామెడీ షో ఎలా మరి..? అందుకే కొత్త వాళ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు… వర్ష, ఇమాన్యుయెల్, తదితర తలాతోకా లేని కామెడీ నడిపించే కమెడియన్లు అన్నమాట… మరీ ఘోరం ఏమిటంటే..? ఈ ఇమాన్యుయెల్ అనబడే ఓ వింత కేరక్టర్ తండ్రి పాత్ర వేస్తూ, కూతురిని పట్టుకుని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు కక్కుర్తితో… దాన్ని చూస్తూ రోజా, యాంకర్ పడీ పడీ నవ్వుతుంటారు… ప్రేక్షకుడు థూమిబచె అని ఆ కమెడియన్లను తిట్టేసుకుంటూ ఉంటారు… అసలు విషయానికొస్తే ఈ కొత్త కామెడీ షో పేరు… శ్రీదేవి డ్రామా కంపెనీ…
Ads
అర్జునుడో, నకులుడో… ఓ యాంకర్ కనిపిస్తున్నాడు అందులో… నాట్ ఇంప్రెసివ్… ఇమూన్యుయేల్ ఓవరాక్షన్ సరేసరి… పాత నటులు రేఖ… బహుశా ప్రతిసారీ ఓ గెస్టును పిలిచి, కామెడీ షో నడిపిస్తారేమో… ఆలీ, సంగీత ఎట్సెట్రా కనిపించేది అందుకే… సరే, ఎలా ఉంటుందో మొదటి షో చూస్తే తెలుస్తుంది, అది మరో అదిరింది షో అయి పేలిపోతుందా, జబర్దస్త్‌కు మరో కాపీ షో అవుతుందా అనేది… కాకపోతే పాత రొటీన్ కమెడియన్లు ఒక్కరూ లేకపోవడం పెద్ద రిలీఫ్… అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… మాటీవీ వాడు కామెడీ స్టార్స్ అని ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఓ షో ప్లాన్ చేశాడు కదా… వర్షిణి, అవినాష్, చమ్మక్ చంద్ర, యాదమ్మరాజు తదితర కామెడీలో కాస్త పేరొచ్చిన స్టార్స్‌ను తీసుకొస్తున్నాడు కదా… సేమ్, అదే ఆదివారం, ఆదే మధ్యాహ్నం ఈటీవీ వాడి కొత్త డ్రామా కంపెనీ ప్రసారం చేస్తారట… అంటే… ఈటీవీకి కాస్త పోటీ కామెడీ షో మాటీవీ వాడు ప్లాన్ చేస్తే, అది కూడా నీకు దక్కనివ్వనురోయ్ అన్నట్టుగా ఈటీవీ వాడు అదే టైమ్‌లో ఓ కొత్త షోకు శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట… కానీ ఏమాటకామాట… పరమ దరిద్రమైన, నికృష్టమైన, బేకార్ జీటీవీ, మాటీవీ సీరియళ్లతో పోలిస్తే ఇవే కాస్త నయం… ఈ విషయంలో ఈటీవీ ధోరణి కమర్షియల్ అయినా అభినందనీయమే…
Share this Article