అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం…
మరి అంత పెద్ద ఫిలిమ్ సిటీ, ప్రభుత్వాలను ఆడించగల తండ్రి, వేల కోట్ల రూపాయల ఆస్తులు, చేతిలో నంబర్ వన్ పత్రిక… సుమన్‌కు ఆమాత్రం ఉండటంలో పెద్ద వింత ఏమీ లేదు… ఓసారి ఏకంగా దర్శకుడు బాపునే బ్లాక్ లిస్టులో పెట్టాడట… తనే కాదు, ప్రఖ్యాత కెమెరామన్ మీర్‌ను కూడా… ఇంకొందరు ప్రముఖుల్ని కూడా ఆ లిస్టులో చేర్చేసి, ఈటీవీలోకి నో ఎంట్రీ అన్నాడుట…
ఇది ఎవరూ చెబుతున్నది..? సమీర్… ఒకప్పుడు సుమన్ ఆంతరంగిక టీం మెంబర్… దాదాపు ప్రతి ఈటీవీ సీరియల్‌లోనూ కనిపించేవాడు… అంత గ్రిప్… తనతోపాటు ప్రభాకర్… తరువాత సెట్‌లో ఓ లేడీతో రాసలీలలు చేస్తున్నాడని, ఎవరో చెబితే, దాన్ని నమ్మేసి సమీర్‌కు గేటు చూపించాడు సుమన్… తరువాత కొన్నాళ్లకు ప్రభాకర్ కూడా బయటికి రావల్సి వచ్చింది..! అందుకని సమీర్ మాటలకు ఈ అంశంలో కొంత విశ్వసనీయత ఉంది…
Ads
అసలు అంతటి దర్శకుడు బాపుతో పనిచేయించుకోవడమే ఓ అదృష్టం కదా… మరి ఏకంగా బ్లాక్ లిస్టులో పెట్టడం ఏమిటి..? ఎంత అవమానం అంటారా..? వాళ్లు అవసరానికి అలుముకోగలరు, అవసరం తీరితే అవతలకు నెట్టేయగలరు, వాళ్ల వ్యాపారంలో ఎమోషన్‌కు తావు ఉండదు… అదంతే… అప్పట్లో ఈటీవీలో శ్రీభాగవతం అనే సీరియల్ వచ్చేది, దానికి బాపుయే దర్శకుడు… రామానందసాగర్ రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్‌ను కూడా తీసుకున్నారు అందులో… సరే, అదంతా వేరే కథ…
అవును, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటారా..? టైమ్స్ వాళ్ల తెలుగు సైటులో ఓ వార్త కనిపించింది… సమీర్‌ను వెళ్లగొట్టిన అంశం మీద… తాజాగా సమీర్ బయటపెట్టాడు ఇలా అని ఏదో రాసుకుంటూ వచ్చారు… ఆ యూట్యూబ్ చానెల్ ఏదో తెలుసుకుందామని సెర్చితే ఇదే సమీర్ అవే అంశాల్ని గత సెప్టెంబరులో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు…
అంతకుముందు సంవత్సరం కూడా చెప్పాడు… అంటే, ఎప్పుడు వీలయితే అప్పుడు ఇవే అంశాల్ని చెబుతూనే ఉన్నాడన్నమాట… ఈటీవీ మీద ఇంకా విషం తగ్గలేదన్నమాట… అసలు ఆ సుమనే ఇప్పుడీలోకంలో లేడు కదా, ఇంకా అవన్నీ తవ్వడం ఎందుకు సమీర్..?! అంతటి బాపు కూడా ఓసారి సుమన్‌ను తేరిపార చూసి, మనసులో ఓసారి జాలిగా నవ్వుకుని, మళ్లీ వెనుతిరిగి కూడా చూడకుండా వెళ్లిపోయి ఉంటాడు… హుందాగా… తన బతుకులాగే తలెత్తుకుని మరీ…!! ఎవరు బ్లాక్ లిస్టులో పెడితే వాళ్ల మొహాలే నలుపు…!!
Share this Article