.
Mohammed Khadeerbabu ……… పరీక్ష అట్ట … నాలుగు మూలలూ కూసుగా ఉన్న అట్ట ఎవరి దగ్గరా ఉండేది కాదు. బతుకును బట్టి మూలలు. ఒకటి అరిగి, రెండు అరిగి, నాలుగూ అరిగి, అరిగి.. అరిగి… పరీక్షలకు అట్ట కలిగి ఉండటమే పెద్ద పరీక్ష.
కోపాలూ తాపాలూ సంతోషాలూ రహస్యాలూ… దాని మీదే. పెన్ను రాస్తుందా లేదా రాసి చూడటం. విదిలించి రాసే ఇంకు పెన్నయితే దాని మీదే విదిలించడం. రఫ్‌వర్క్ దాని మీదే. ఇంపార్టెంట్ కొసెన్ల కొండగుర్తులు సీక్రెట్‌గా దాని పైనే. బెస్ట్‌ఫ్రెండ్ పేరూ మన పేరూ రాసుకోవడం…,
Ads
బాణంతో ఉన్న లవ్ గుర్తు వేసి మధ్యలో న్యూస్‌పేపర్ నుంచి కట్ చేసిన కృష్ణ బొమ్మ, చాక్లెట్లు కొంటే ఫ్రీగా ఇచ్చే నాసిరకం స్టిక్కర్లను అడ్డదిడ్డంగా అంటించి మళ్లీ పీకతే ఏర్పడిన సగం సగం మచ్చలు, కారాసు పోసుకొని తీరిగ్గా తినగా పీల్చిన నూనె మరకలు,.. ఎండకు అదే నీడ… వానకు అదే గొడుగు. విద్యార్థుల ఇంటి జీవితానికీ స్కూలు చదువుకూ ఆనవాళ్లు– అట్టలు.
శెట్టి గార్ల పిల్లలు కొత్త అట్టలు తెచ్చేవారు. వాటికి సోకైన కాడక్లిప్పులు ఉండేవి. కాగితం రిలీజ్ చేయడానికి కాడను కదిలిస్తే అది టప్పున ఎగిరితే అబ్బురం. తతిమా అందరి దగ్గరా అట్టలకు కిరీటం లాంటి మోటు క్లిప్పు ఉండేది. దాని స్ప్రింగ్ పోతే కాగితం నిలవదు. తుప్పు పడితే క్లిప్పు ఒంగదు.
లూజు క్లిప్పున్న అట్ట ఒక విద్యార్థిని జీవితకాలం బాధించగలదు. కొందరు బంగారు తండ్రులది ఒట్టి అట్టే. క్లిప్పు ఉండదు. పది పైసలకు చిన్న క్లిప్పు పావలాకు పెద్ద క్లిప్పు అల్యూమినియంవి దొరుకుతాయి. ఇంట్లో ఆ డబ్బులు ఇస్తే ఆ భాగ్యం.
అట్టలు లేకుండా పరీక్ష రాయడం అసాధ్యం. కింద కూచుని రాయాలి. మొండి బెంచీల మీద కూచుని రాయాలి. ‘అయితేమందిలే పోరా’ అని పేదతల్లి బలవంతంగా కొడుక్కు టావు పేపరు కొనిచ్చి స్కూలుకు పంపితే వాడొచ్చి దిక్కులు చూస్తూ నిలబడేవాడు.
టీచరు తిట్టలేదు. పరీక్ష మొదలైపోతుంది. వాడికి అట్ట సంపాదించి ఇచ్చి… అడావిడిగా పరీక్షకు కూచోబెట్టి మొదట టీచరు గదా పాసయ్యేది.
అట్ట అప్పుకు తిరిగే అమ్మలు ఉంటారని తెలుసునా? అట్ట అప్పు ఇచ్చే దయామయులు కూడా ఇరుగూ పొరుగూ ఉండేవారు. ఇంట్లో ఒక అట్ట ఎక్స్‌ట్రా ఉన్నా అప్పుగానే ఇచ్చేవారు. పరీక్ష రాసేసి మళ్లీ ఇచ్చేయాలన్న మాట.
గతంలోని ఆటలో ఏదో తకరారుకు ఆ ఇంటి కుర్రాడు పగబట్టి ఉంటే వాడు ఇవ్వనే ఇవ్వడు. వాళ్లమ్మ బుజ్జగిస్తుంది. ఈ అమ్మ ఎదురు చూస్తుంది. రుణగ్రహీత టెన్షన్‌గా గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. అబ్బాస్ కిమిరోస్తమి మాత్రమే దీనిని సినిమాగా తీయగలడు.
పాత అట్టలు రోతగా మారితే పిల్లలకు నామోషీ. ఎక్కడైనా ఇళ్లకు రంగులు వేస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అనా… దీనికి పూయవా’ అనంటే పెయింటరు బ్రష్ ముంచి తప్పు తప్పున రెండు దెబ్బలు వేస్తాడు. ఆకుపచ్చ, తెలుపు, నీలం…. చేతులకు రంగు అంటుతున్నా లెక్క చేయక పరిగెత్తుకుంటూ తెచ్చుకుని ఎండకు ఆరబెడితే ఇంకేంటి… అది కొత్తఅట్టే.
కొందరు పిల్లలు తమ నోట్సుల్లో మిగిలిన రూళ్ల కాగితాలను అట్టలకు అంటించి శుభ్రంగా కనిపించేలా చూస్తారు. మరి గమ్ బాటిలో? అమ్మా.. అంత డబ్బున్నోళ్లం కామండీ. వొండిన అన్నాన్ని బొటనవేలితో గట్టిగా రుద్దితే అదే గమ్ము. అలా తయారైన అట్ట రాసేప్పుడు గరుకు గరుకుగా ఉంటుంది. అయితే ఏం… చూడ్డానికి బాగుందిగా.
నాలుగు మూలలూ సరిగా ఉన్న, నిజమైన ఖాకీ రంగులో ఉన్న కొత్త అట్ట!
ఎందరి కలల వస్తువో! ఎందరికి అపురూప సంపదో!
లేమి కూడా కలిమి అని తెలియాలంటే రోజులు గడిచి తిరిగి చూడాలి. చిన్న ఆనందాల చిరు సంతోషాల కలిమి.
ఇలాంటి పిల్లలు ఈ దేశంలో ఎప్పటికీ పోరు. ఈ సీజన్‌లో ఏ బడి దగ్గర నిలబడ్డా కిరీటం క్లిప్పును టపాటపా చప్పుడు చేయిస్తూ మూలలు అరిగిపోయిన అట్టతో పరీక్షకు హుషారుగా వెళుతూ కనపడతారు.
‘ట్రాన్స్‌పరెంట్ అట్టలతోనే పరీక్ష రాయాలట నాన్నా’ అని పిల్లలు అడిగితే మరు నిమిషమే తెచ్చి, వారి చేతుల్లో పెట్టి, కొత్త అట్టలతో పరీక్షలు వారు రాయగలుగుతున్నందుకు అమితంగా సంతోషిస్తూ ఉండలేక ఇది రాశాను…. నా పిల్లలతో పాటు ఇంకొందరు పిల్లలకు అట్టలు ఎందుకు ఇవ్వను? – ఫిబ్రవరి, 2025
Share this Article