నిన్నటి నుంచి బడిపిలగాండ్లకు పరీక్షలు మొదలయ్యాయి. ప్యాంటు షర్టు వేసుకొని, జేబులో ఒక బాల్ పెన్ పెట్టుకొని, చేతులూపుకుంటూ వెళ్తున్న వీళ్ళను చూస్తుంటే మన రోజులు యాదికొచ్చినై.. పరీక్షల ముందు రోజు ఇంకు పెన్ను కడుక్కొని, పెన్ను పత్తి, గడ్డ, నాలుక శుభ్రంగా కడిగేది. పెన్ను పత్తి సాఫ్ చేసేందుకు నాయిన ఎఫ్ఫార్ డబ్బాలోని భారత్ బ్లేడు లేదా దోస్తుగాడి ఇంట్లోంచి పాత బ్లేడు సగం ముక్క తెచ్చి పత్తి మధ్యలో ఉండే సన్న అతుకు మధ్యలో పెట్టి సాఫ్ చేసేది.
ఈ పనిలో వేలు కోసుకొనేది. ఎంత కడిగినా ఒత్తి పట్టినా రక్తం కారుడు ఆగకపోయేది. అమ్మా, నాయినా తిడుతరని అంగీ కింది పట్టీతో గట్టిగా చుట్టేది. వంటింట్లో పోపుల డబ్బా దగ్గరికి పోయి పసుపు రాసేది. అమ్మ చూసుడు… తిట్లు, గడ్డం డబ్బా ఎందుకు తీసినవని. నాయినా కొట్టబోవుడు ఉండేవి.
పరీక్షనాడు.. పైసలు ఉన్నవాళ్లు గట్టి అట్ట, లేనోల్లు జొన్న అట్ట కొనుక్కునే వాళ్ళం. ఎంత మంచి తిండి తిన్నా ముక్కు ఎప్పటికీ కారేది. ఎగబీల్చి ఎగబీల్చి అసయ్యంగ ఉండేది. అప్పుడన్నీ చేతులంగీలే కదా… ముక్కు తుడిచి తుడిచి అట్టకట్టేది. ఇప్పటోలె బల్లలు లేకపోయేవి. కింద కూసొని రాస్తుంటే కారుతున్న ముక్కు ఆపే వశం కాకుండేది. ఇప్పుడు విజయ సంకేతంగా చూపే బొటన వేలిని ఎత్తి చూపితే బయటకు పోయి ముక్కు తుడుచుకొని వస్తానన్నట్టు. అట్ల సారుకు చెప్పి బయటికి పోయేది..
Ads
పరీక్ష అట్టకు పేర్లు రాసుకొని, బొట్టుపెట్టి, ఇంకొందరు వూదుబత్తీలు వెలిగించి అట్టాకు చెక్కుకొని పోయేది. పరీక్షకు పోతుంటే ఇంట్ల అమ్మా, నాయినా, దేవునికి దండం పెట్టుకొని బడికి పోయేది. పరీక్ష మొదలు కాగానే అద్దుడు కాగితం ఇచ్చేవారు. ఇంకు మరకలు ఈ కాగితం పీల్చుకునేది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పత్తి ఇరుగుడు, పెన్ను గడ్డ పగులుడు, చేతికి ఇంకు అంటుడు, దాన్ని అంగీకి తుడుసుడు.. మన పెన్ను పారక పోతే దోస్తుగాన్ని అడుగుడు, వాడు మళ్లీ ఇంకు పోస్తవా అని షర్తు పెట్టుడు.. పోస్త అని పెన్ను అడిగి తీసుకొని, దాని పత్తి ఇరుగకుండా మోపున రాసుడు… నిజంగా ఎంత మార్పు….
— Ramesh Sharma Vuppala వాల్ పైనుంచి సంగ్రహించబడినది…
Share this Article