ఆ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ పంచాయితీ ఇప్పట్లో తేలదు గానీ… వేరే సబ్జెక్టుల్లోకి వెళ్లిపోదాం ఓసారి… చిన్న చిన్నవే కానీ కొన్ని ఆలోచనల్లో పడేస్తుంటయ్ కొన్ని వార్తలు… అలాంటిదే ఇది కూడా…! అప్పుడప్పుడూ జగన్ పాలనలో కొన్ని విచిత్ర జీవోలు… అనగా విస్తుపోయే ఆదేశాలు వస్తుంటాయి… చూచువారలకు చూడముచ్చటట టైపు ఉత్తర్వులు కావు అవి… చదువువారలకు జుత్తు పీకునట టైపు… విషయం ఏమిటంటే..? ఉత్తర కోస్తాలో ఓ జిల్లా… ఫాపం, వెనుకబడిన జిల్లాలు కదా, అధికార యంత్రాంగానికి కూడా మహా అలుసు… మరీ ప్రత్యేకించి సిక్కోలు, ఇజినారం జిల్లాల ప్రజలకు నోళ్లల్లో నాలుకలు ఉండవు అనేది సర్కారీ బాసులకు తెగనమ్మకం… ఒకాయన శ్రీకాకుళం గ్రామీణ తాగునీటి విభాగంలో డిప్యూటీ ఇంజినీర్ అట… పేరు శంకర్రావు… నిక్షేపంగా ఆ నీళ్ల పథకాలు, ఆ ఇంజనీరింగు రిపేర్‌లో, కొత్త ట్యాంకులో చూసుకోవచ్చు కదా… నో, జగనన్న విద్యాశాఖ ఓ జీవో ఇచ్చింది మొన్న 20వ తేదీన… ఏమిటయ్యా అంటే..?
ఏమయ్యా, శంకర్రావూ, ఫో, పోయి, ఇజినారం జిల్లా స్కూళ్ల సంగతి కాస్త చూసుకో… నిన్ను ఆ జిల్లాకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా వేస్తున్నాం పో… ఇక చూసుకో, పంతుళ్లు బళ్లకు వస్తారా, రారా చెక్ చేసుకో… నాడు-నేడు అని రిపేర్లు చేస్తున్నాం కదా బిల్డింగులకు, ఆ పనులూ చూసుకో అన్నట్టుగా ఆ జీవో జారీ అయిపోయింది… అసలు ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను తీసుకొచ్చి, బడుల మీద పర్యవేక్షణ పెత్తనం ఇవ్వడం ఏమిటో అంతుపట్టక టీచర్లు, ఇంజనీర్లు అందరూ కాసేపు జుత్తు పీక్కుని, మన ఖర్మ అనుకుని ఇక వదిలేశారు… అంతే తప్ప ఎవరూ నోరు మెదపలేదు… మెదుపుతారేమో అని జగన్ సందేహించలేదు గానీ, సాక్షి సందేహించింది… ఉలిక్కిపడింది… అబ్బే, తప్పేమీ లేదు అన్నట్టుగా ఓ వార్తను కుమ్మిపారేసింది… ఇలాంటి అధికార మార్పిడి క్రైంతో సమానం అనుకున్న సబ్ఎడిటర్ ఎవరో గానీ, సరిగ్గా దాన్ని తీసుకెళ్లి క్రైం న్యూస్ పేజీలో పెట్టేసి, నేనయితే ఈ వార్తకు సరైన ప్లేస్మెంట్ ఇచ్చాను, ఆ అధికారి ప్లేస్మెంటుతో నాకు సంబంధం లేదు అని చేతులు దులిపేసుకున్నాడు… నాడు-నేడు ఇంజనీరింగు పనులు సాగుతున్నాయి కదా, సో, ఈయన్ని వేయడం కరెక్టు అని రాసినా కాస్త పద్ధతిగా ఉండేది…
Ads
ఆయన గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉంది… విద్యాధికుడు, మూడు పీజీలు చదివాడు, ఎంఫిల్ చేశాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా ఎంపికయ్యాడు… సో, ఆయన ఆ పాత ప్రతిభను గుర్తించి ఇప్పుడు డిప్యుటేషన్ మీద డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వేశారు, తప్పేమీ లేదు పాపం… అన్నట్టుగా రాసేశారు వార్తను… నిజానికి రెండూ వేర్వేరు సర్వీసులు… పైగా ఒక డీఈవో పోస్టు ఖాళీగా ఉంటే ఓ సీనియర్ టీచర్‌కే బాధ్యతలు ఇస్తే సరిపోతుంది… బడులు, సిలబస్ గట్రా పూర్తిగా సపరేట్ సబ్జెక్టు… అందులోకి, అదీ పెత్తనం చేసే పోస్టులోకి ఓ ఇంజనీర్‌ను తీసుకురావడం ఏమిటి..? పర్ సపోజ్, ఓ టీచర్‌కు రెవిన్యూ విషయాల్లో మంచి పట్టుంది… తనను తహశిల్దార్ పోస్టులో పెడతారా..? పోనీ, ఒక డివిజనల్ పంచాయతీ అధికారికి రెవిన్యూ, అడ్మినిస్ట్రేషన్ మీద మంచి గ్రిప్ ఉంది… ఆర్డీవో పోస్టులో నియమిస్తారా..? ఓ ఇంజినీర్ మస్తు డిటెక్టివ్ నవలలు చదువుతాడు, అలాంటి సినిమాలే చూస్తాడు… డీఎస్పీ పోస్టులో పెట్టలేరు కదా… మరి ఒక ఇంజనీర్ బడుల శాఖకు రావడం ఏమిటి..? అబ్బే, పర్లేదులే సారూ, తాగునీటి విభాగం, విద్యావిభాగం రెండూ ఒకటే… చేస్తేనే పని, చేయకపోతే ఖాళీ అన్నట్టుగానే ఉంటయ్ అంటారా..? అవున్లెండి… సాక్షిలో ఇదే వార్త మరోసారి రాయిద్దాం… ఈసారి కల్చరల్ పేజీలో పెట్టిద్దాం… కొత్తతరహా కల్చర్ కదా ఇదంతా…!!
Share this Article