ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్…… ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని ఏమీ లేదు…! కేసీయార్ అహానికీ, ఈటలకూ నడుమ జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు తెలంగాణ రాజకీయాల్లో ఓ మలుపు అవుతుందనే భావన రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిన నేపథ్యంలో… ఆ ఎన్నిక ఫలితం ఏమిటనేది అందరిలో ఆసక్తినీ, ఉత్కంఠనూ రేపుతోంది… బహుశా దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నిక ఇదేనేమో… డబ్బు, అధికారం, ప్రలోభాలు, బెదిరింపులు… వాట్ నాట్..? ఈటల మీద కేసీయార్ ప్రయోగించని అస్త్రం లేదు… చివరకు వోట్ల లబ్ధి కోసం నేరుగా జనం ఖాతాల్లోకి 10 లక్షల డబ్బు వేసే కొత్త పథకాల్ని రచించి, ఆ హుజూరాబాద్‌లో ప్రవేశపెట్టడం కూడా ఈ ఉపఎన్నిక కోసమే… సరే, ఆ విశ్లేషణలు, కారణాలు గట్రా మనం తాపీగా ఫలితం వచ్చాక చెప్పుకోవచ్చు… కానీ ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నయ్..? ఈటలదే గెలుపు అంటున్నయ్… కేసీయార్ అహం, వ్యూహం పనిచేయలేదు అంటున్నయ్… నిజమా..? ఏమో… పెట్టెలు విప్పితే తెలుస్తుంది… అనేకానేక ఫేక్ పోస్టుల ప్రచారం, విపరీతమైన అధికార దుర్వినియోగం గట్రా నిజంగా కేసీయార్‌ను నేలమీదకు దింపుతాయా..?
ఈ సర్వే సంస్థల్లో కూడా ఫేక్ ఉన్నయ్… నిజాయితీగా సర్వే చేసినవీ ఉన్నయ్… ఒకటీరెండు టీఆర్ఎస్ అనుకూల చిన్నపత్రికలు కూడా ఈటల గెలవబోతున్నాడని చెప్పడం ఒక విశేషం… ఆ ఏముందిలే, గెలిస్తే కేసీయార్ గెలుపు, ఓడితే హరీష్ ఓటమి అనే వ్యంగ్య వ్యాఖ్యలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి… (ఈ సందర్భంలో తమ ప్రధాన, ప్రబల ప్రత్యర్థి కేసీయారే కాబట్టి, తను ఓడిపోవాలనే బలమైన కాంక్షను కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అమలు చేసింది… అది వేరే కథ…) మిషన్ చాణక్య, పొలిటికల్ లేబరేటరీతోపాటు హెచ్ఎంఆర్ రిసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, కౌటిల్యా సొల్యూషన్స్, ఆత్మసాక్షి, జనం సాక్షి తదితర ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈటలదే గెలుపు అంటున్నయ్… (ఈ ఫలితాలన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నయ్, మళ్లీ వివరంగా చెప్పలేదు ఇక్కడ…)
Ads
వాటి లెక్కల్లో కాస్త తేడాలున్నా సరే, మొత్తానికి టీఆర్ఎస్ ఓటమిని చెబుతున్నయ్… ఒక్క నాగన్న సర్వే తప్ప (ఈ పేరెప్పుడూ వినలేదు… బహుశా పాత పీకే టీం వర్కులో ఈ సర్వే సంస్థ కూడా ఒకటేమో…)… భూమ్యాకాశాల్ని ఏకం చేశాడు కేసీఆర్ ఈ ఉపఎన్నిక కోసం… ఈ రేంజ్ ప్రయాస గతంలో ఎన్నడూ కనిపించలేదు టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి… ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు సేఫ్‌గా ఉండాలట, కానీ ఈటల మాత్రం రాజీనామా చేయాలట, పోటీ చేసి జనాదరణ ప్రూవ్ చేసుకోవాలట, పార్టీ నుంచి విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు, కేసులు, వేధింపులు… ఈటలను ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డాడు… కానీ ఫలితం..? నిజంగా కేసీయార్ ఓడించలేనంత బలమైన కేరక్టరా..? ప్రతిపక్షం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఎక్కడికక్కడ కట్టడి చేయగల మామూలు పార్టీయేనా..? జనంలో విపరీతమైన వ్యతిరేకత ప్రబలుతోందా..? ఏమో… రానివ్వండి ఫలితం… చెప్పుకుందాం…!! చివరి రెండు గంటల్లో జరిగిన 16 శాతం పోలింగు ఈటలకు చేదు ఫలితాన్ని ఇవ్వబోతోందా..? దీన్ని ఎగ్జిట్ పోల్స్ పట్టుకోగలిగాయా..?
Share this Article