మెండుగా దేశభక్తి పండు!
————————
ఏ సంస్కృతి అయినా దానికదిగా రాత్రికి రాత్రి పుట్టి స్థిరపడినది కాదు. వందల, వేల ఏళ్ల ప్రయాణంలో ఒక సంస్కృతి ప్రాణం పోసుకుని, పెరిగి, సాగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఏ ఒక్క సంస్కృతి అయినా మరో సంస్కృతితో ఎంతో కొంత ప్రభావితం కాకుండా ఉండలేదు. వేషం, భాష, తిండి, వాడే వస్తువులు…ఇలా అన్నిట్లో పరదేశం పరకాయ ప్రవేశం చేస్తూనే ఉంటుంది. చివరకు అవి విదేశాలనుండి దిగుమతి అయినవి అన్న విషయం కూడా మరుగున పడి మన సొంతమైపోతాయి.
ఇటలీ పిజ్జా ఇండియాలో ప్రతి ఇల్లు నోరంతా తెరిచి తింటోంది. అమెరికా బర్గర్ నోట్లో పట్టకపోయినా కుక్కుతున్నాం. స్విస్, బెల్జియం చాకోలెట్లు తింటేనే గొప్ప. ఇంటికి ఇటాలియన్ మార్బులే వాడాలి. మన రోడ్ల మీద తిరిగే కార్లలో టయోటా, హోండా జపాన్ వి. హ్యుందాయ్ కొరియాది. బెంజ్, బి ఎం డబుల్యు, ఆడి జర్మనీవి. కియా కొరియా. విమానాల్లో ఇంజిన్లు రోల్స్ రాయిస్ వి. వాడే వస్తువుల్లో సోనీ టీ వీ జపాన్. ఎల్ జి కొరియా. ఐ ఫోన్ అమెరికా. ఆసుపత్రుల్లో సర్జరీలకు, పరీక్షలకు ఉపయోగించే అనేక యంత్రాలను తయారు చేసే సీమెన్స్ కంపెనీ యూరోప్ ది.
Ads
తినే తిండిలో ఎన్నెన్నో విదేశీ ఆహారాలు, ఫలహారాలు వచ్చి చేరాయి. చైనా సూప్ మొదట రానిదే ఇప్పుడు మనకు మెతుకు దిగడం లేదు. చైనాలో నూడుల్స్ పుల్లలతో తింటారు. మనం స్పూన్ తో తింటాం. మంగోలియా మీదుగా చైనాకు వెళ్లి ఇండియాకు వచ్చిన మంచూరియా తినకపోతే మనకు పూట గడవదు. పట్టు చీనాంబరాలు అన్న మాటలో చీనీ అన్నది పుట్టిందే చైనా నుండి. పిల్లలు ఆడుకునే అనేక ఆట బొమ్మలు చైనావే. రోడ్ల పక్కన మన జాతీయ జెండా చిహ్నాలు అమ్ముతుంటారు. ఆ త్రివర్ణ ప్రతిమలు తొంభై తొమ్మిది శాతం చైనాలో తయారయినవే.
గుజరాత్ అనాదిగా వ్యాపారానికి పెట్టింది పేరు. అయిదు పైసల పెట్టుబడితో అయిదు వేల కోట్లు ఎలా రాబట్టలో వారికి తెలిసిన విద్య. దానికి మనం అసూయపడి ప్రయోజనం లేదు. చైనాలో ఎక్కువగా పండే డ్రాగన్ ఫ్రూట్ ను గుజరాత్ లో వాణిజ్య పంటగా ఎప్పటి నుండో పండిస్తున్నారు. ఆ మధ్య గ్వాలన్ సరిహద్దులో చైనా- భారత్ గొడవల తరువాత చైనా వస్తువుల వాడకం తగ్గించాలన్న, చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్లు పెరిగాయి. దాంతో డ్రాగన్ ఫ్రూట్ ను కమలా ఫలం అని పేరు మారిస్తే ఎలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
బాపు సినిమాలో- శేష తల్పం మీద విష్ణువు పడుకుని ఉంటే లక్ష్మి దేవి ఆయన కాళ్లు ఒత్తుతూ ఉంటుంది. స్వామి ఎప్పుడూ ఇలాగేనా? ఈ సేవలో మార్పు లేదా? అని లక్ష్మి దేవి బుంగ మూతి పెడుతుంది. సరే అంటాడు విష్ణువు. ఇప్పుడు లక్ష్మి దేవి కాళ్లు విష్ణువు ఒత్తుతాడు అని మనం ఊహిస్తాం. విష్ణువు కాళ్లు అటువైపు నుండి ఇటువైపు, లక్ష్మి దేవి కూర్చున్న చోటు మారతాయి. మిగతాదంతా సేమ్ టు సేమ్. లక్ష్మి నారాయణులు ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ నవ్వులో మన నవ్వులు జత కలుస్తాయి. దటీజ్ బాపు.
గుజరాత్ లో డ్రాగన్ ఫ్రూట్ ప్లేస్ కూడా మారదు. పేరొక్కటే మారుతుంది. అది కూడా కమలం. ఒక దెబ్బకు అనేక పిట్టలు. భవిష్యత్తులో సీతాఫలం, రామాఫలం ఏమవుతాయో? దేశభక్తి, జాతీయత పంట పండే కాలం. ఫల శ్రుతి:- భక్ష్య భోజ్య లేహ్య నానా దేశ ఫలాహార స్వాహా. నానా దేశ ఫల నామ పునర్నామకరణ పుణ్యం సిద్ధిరస్తు…. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article