Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Re-Inventing the Wheel… కొత్త శోధనలకు ఇండియన్ ఎక్స్‌పర్ట్స్ మొరాయింపు…

February 19, 2023 by M S R

Yanamadala Murali Krishna……    ((పెద్ద పోస్ట్… ఓపికగా చదవండి… ఎక్స్పర్ట్ ఒపీనియనూ… భారతీయ శాస్త్రనిపుణులూ…)) ఒక అంశంలో అత్యున్నత విద్యను అభ్యసించిన వారికి… ఆ విషయాన్ని గురించి లోతైన అవగాహనతో పాటు, అంతకుముందు తెలియని కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు దానిని ఏ విధంగా పరిష్కరించాలనే మేధ ఉండాలి. శాస్త్ర విజ్ఞాన రంగాలలో భారతీయులకు ఇటువంటి సామర్థ్యం బొత్తిగా ఉండదు. అందుకే మన సాంకేతిక – సేవల రంగాల నిపుణులు… ప్రపంచంలోనే కొన్ని దిగ్గజ సంస్థలకు సారథ్యం వహిస్తున్నప్పటికీ… శాస్త్ర విజ్ఞాన రంగాలలో మన జీవితాలలో భాగం కాగల ఆవిష్కరణలు ఏవీ పెద్దగా కనపడవు.

శాస్త్ర విజ్ఞాన రంగాలలో కొత్త ఆలోచనలు ఆవిష్కరణల కొరకు గాను… నిరంతర అధ్యయనంతో ఒక రంగంలో జరుగుతున్న కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధి గురించి తెలుసుకోవడంతో పాటు… ఊహా శక్తితో మేధోమధనం నిత్యం జరుగుతూ ఉండాలి. విచారకరంగా, మన వారిలో ఇవి చాలా అరుదు. అత్యధిక మందిలో విషయపరమైన జ్ఞానమే సంపూర్ణంగా ఉండదు. మన పరిశోధనలు చచ్చిన పామును చంపినట్టే ఉంటూ ఉంటాయి. అనగా ఇప్పటికే అనేకసార్లు రుజువైన అంశాలను మనవాళ్లు మళ్లీ నిరూపిస్తూ ఉంటారు. దీనినే ‘రీఇన్వెంటింగ్ ద వీల్’ అంటారు. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా ఆలోచించి, కొత్త అంశాలను కనుగొనే అవకాశం దాదాపుగా ఉండదు. అయితే నా పరిధిలో నేను స్వతంత్రంగా వ్యవహరించి నాదైన చేర్పును వైద్య విజ్ఞానానికి ఇచ్చాను.

ఎండి చదువులో భాగంగా డిజర్టేషన్ (సిద్ధాంత ప్రతిపాదన)కు నేను ఫస్ట్ ఇయర్ నుండి చేస్తున్న ‘గర్భిణులలో హెచ్ఐవి వ్యాప్తి’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని రాయమని మా ప్రొఫెసర్ చెప్పారు. కేవలం లెక్కలు చెప్పి దానికి సంబంధించి వివరణ ఇస్తూ దాన్నే సిద్ధాంత ప్రతిపాదన అనుకోవడం నా మేధస్సుకు సరిపోలేదు. అప్పటికే ప్రపంచంలో హెచ్ఐవి – ఎయిడ్స్ జబ్బు వ్యాపిస్తున్న తీరు తెన్నుల గురించి కొంత అధ్యయనం చేసి ఉన్నాను. హెచ్ఐవి జబ్బులో క్షయ వ్యాధి మూలంగానే అత్యధిక రోగులు ప్రాణాలు కోల్పోతారని తెలుసుకున్నాను.

Ads

ఇంకా చెప్పాలంటే హెచ్ఐవి అనేది దానంతట అదే ప్రాణం తీయదు… హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మూలంగా జబ్బులను ప్రతిఘటించే శక్తిని కోల్పోయిన వ్యాధిగ్రస్తుని శరీరం… వివిధానేక సాంక్రమిక వ్యాధుల బారిన పడి ప్రాణాపాయానికి గురవుతాడు. అందుకే హెచ్ఐవి పేషెంట్లలో క్షయ వ్యాధి వ్యాప్తి అనే అంశం మీద పని చేయదలుచుకున్నానని ప్రొఫెసర్ కి చెప్పాను. క్షయ వ్యాధి వార్డులో ఉన్న అందరు రోగులకూ హెచ్ఐవి పరీక్ష చేశాను. గర్భిణులలో కన్నా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులలో క్షయ జబ్బు వ్యాప్తి చాలా ఎక్కువగా వున్న విషయం గమనించాను. ఇప్పుడు క్షయ జబ్బుని నిర్ధారించిన వ్యాధిగ్రస్తులందరికీ హెచ్ఐవి పరీక్షను తప్పనిసరిగా చేస్తున్నారు.అప్పట్లో, 1997 – 2000 కాలంలో ఈ మార్గదర్శకం లేదు. క్షయ వ్యాధి గురించి లోతుగా అధ్యయనం చేసే సందర్భంలో హెచ్ఐవి – క్షయ రెండు జబ్బులూ ఉన్న వ్యాధిగ్రస్తులలో ‘మాంటూ’ పరీక్ష గురించి అధ్యయనం చేసి, ‘అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు’కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తొలి శాస్త్రీయ పరిశోధనా పత్రాన్ని నివేదించిన విషయం గతంలో చెప్పుకున్నాం.

1998 సెప్టెంబర్ లో మా డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేథాలజిస్ట్స్ & మైక్రో బయాలజిస్ట్స్ సదస్సు నిర్వహించింది. ఆ సదస్సుకి నేను ‘క్షయ వ్యాధిగ్రస్తులలో హెచ్ఐవి వ్యాధి’ అనే అంశం మీద పరిశోధన పత్రం సమర్పించాను. దానికోసం ఎంతో శ్రమపడి, డబ్బు ఖర్చు చేసి ఆధునిక వైద్య సాహిత్యాన్ని అధ్యయనం చేసి, చక్కని స్లైడ్స్ రూపొందించి కాన్ఫరెన్స్ లో ప్రజెంట్ చేశాను. నా పేపరు సెషన్ కి హైదరాబాద్ నిమ్స్ నుండి వచ్చిన ప్రొఫెసర్ & హెడ్ అధ్యక్షులుగా వున్నారు. నేను హెచ్ఐవి – టీబీ కలిసి నడుస్తాయి (హెచ్ఐవి అండ్ టిబి గో హ్యాండిన్ హ్యాండ్) అనే స్లైడ్ ని ప్రదర్శించాను. నిమ్స్ ప్రొఫెసర్ గారు వెంటనే ఆపమన్నారు. అది తప్పు అని చెప్పారు.

ఆవిడ ఇంకా 1981లో ఎయిడ్స్ జబ్బును ‘న్యూమోసిస్టిస్ న్యుమోనియా’ జబ్బు వలన గుర్తించారు అనే చోటనే ఆగిపోయారు. నేను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ పోరాట సంస్థ యుఎన్ ఎయిడ్స్ చెప్పిన విషయాలను స్లైడ్ మీదనే వుటంకించినప్పటికీ… ఆ ప్రొఫెసర్ తన అజ్ఞాన కాంక్షను బయట పెట్టుకున్నారు. అర నిమిషం వాదించి ముందుకు సాగిపోయాను. అప్పటివరకు మా ప్రొఫెసర్ కే పరిమిత జ్ఞానం అనుకున్నాను… అంత పెద్ద సంస్థ హెచ్వోడికి కూడా కొత్త విషయాలు ఏమీ తెలీదు అని అర్థమైంది. జ్ఞానం పరిమితం, అజ్ఞానం మేరలేనిది అనేది అనుభవంలోకి వచ్చింది.

కొత్తగా తలెత్తి, విజృంభించే జబ్బు (ఎమర్జింగ్ డిసీజెస్) లలో సంచిత జ్ఞానము, అనుభవము తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రంగాలలో విస్తృతంగా పనిచేస్తున్న నిపుణుల అభిప్రాయాలకు గొప్ప విలువ ఉంటుంది. అటువంటి నిపుణులు చెప్పే చికిత్స నిర్దేశాలను క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా రూపొందించే మార్గదర్శకాలతో పాటు పాటించదగినవిగా ఒకచోట చేరుస్తుంటారు. ఇవి ఆయా స్పెషాలిటీస్ కి సంబంధించిన ప్రామాణిక టెక్స్ట్ పుస్తకాలలో కూడా ఉండవు. చాలా కొద్దిమంది చదివే ఆ మార్గదర్శకాల పూర్తిపాఠం పుస్తకాలలో ఉంటాయి. నాకు సంబంధించిన రంగంలో అటువంటి పుస్తకాలను చదవడం నాకు అలవాటు. నా వరకూ నేను కూడా అనేక సందర్భాలలో చికిత్స విధానాల విషయంలో కొత్త దారిలో వెళ్తాను. ఎస్, నా ఎక్స్పర్ట్ ఒపీనియన్ పేషెంట్లకు స్వస్థత చేకూరుస్తూ ఉంటుంది.

2022 ఏప్రిల్ లో రాజస్థాన్లోని జైపూర్ లో జరిగిన ఫిజీషియన్స్ జాతీయ సదస్సుకు తేలికపాటి కోవిడ్ జబ్బుకు నేను రూపొందించిన ‘ఏస్పిరిన్ – ప్రెడ్నిసొలోన్ – అజిత్రోమైసిన్’ చికిత్స విధానానికి సంబంధించి పరిశోధన సారాంశాన్ని సమర్పించాను. నిజానికి, అంగీకరించబడ్డ అబష్ట్రాక్ట్స్ అన్నిటిని సోవనీర్ లో ప్రచురించడం సాధారణంగా జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో అలా చేయలేదు. నా పరిశోధన సారాంశాన్ని మదింపు చేయడానికి వచ్చిన ప్రొఫెసర్, అసలు నేను ఏమి చేశాను అన్న విషయం గమనించకుండా… కేవలం ఆర్టిపిసిఆర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ చికిత్స ఇవ్వడం సరి కాదు అంటూ మొదలుపెట్టాడు.

నా పరిశోధనలో తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే ఆ మందులు ఇచ్చి ఫలితాలను క్రోడీకరించాను. మొత్తంగా ఏ లక్షణాలూ లేని వారికి వైద్యం చేయలేదు. అంతటి మౌలిక అంశాన్ని కూడా గమనించకుండా తన మౌడ్యాన్ని, అభిజాత్యాన్ని బయట పెట్టుకున్నాడు. మూర్ఖుని రంజింప చేయడం అసాధ్యం కదా అనే విషయం వయసుతో పాటు బాగా తెలిసి రావడంతో నేను నా ధోరణిలో విషయం చెప్పుకుపోయాను….

hiv aids

చిత్రం: ఎయిడ్స్ వ్యాధికి చికిత్స మార్గదర్శకాలను రూపొందించే అమెరికా ప్రభుత్వపు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్సకు సంబంధించి చాలా విలువైన ప్రచురణలను నాకు పంపారు. అందులో ఇది ఒక కంపాక్ట్ డిస్క్… – డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ 19 ఫిబ్రవరి 2023

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions