‘మిట్టూరోడి కతల’ నామిని 2015లో ఒక కథ రాశారు. ‘రాతిమిద్దాయన చిన్న కుమార్తె’. ఆస్తి వ్యవహారాల్లో అక్కతో తగువొచ్చినందుకు నాగేశ్వరి మనసు కిందామీదా అవుతోంది. ఎలాగైనా ఈ పరిస్థితి గట్టెక్కాలని తెగ ఆలోచిస్తా ఉంది. అలా ఆలోచిస్తా దేవుళ్ల పటాల ముందు నిలబడింది. టక్కున యేసు ప్రభువు గుర్తుకొచ్చాడు. నామిని ఆ సన్నివేశం ఎలా రాశారో చూడండి.
‘… దేవుళ్ల పటాల ముందు నుంచి పక్కకొచ్చేస్తా వుంటే కతక్కన యేసు ప్రబువు గమనానికొచ్చినాడు నాగేస్పరికి. ఆయన అందరాల దేముడు గాదంట. సత్యమంతమైన దేముడంట. పెదరోగం వచ్చినోళ్లనే చేతల్తో ముట్టి బాగు చేసిన దేముడంట. యిట్టా అనుకున్నందుకు మన దేముళ్లకు కోపమొస్తాదేమో అని చెప్పి మళ్లా పటాలకల్లా తిరిగి చెంపలేసుకొనింది.’
నాగేశ్వరి దేవుళ్ళ పటాల ముందు నిలబడినప్పుడు యేసుక్రీస్తు గుర్తుకు రానూ వచ్చు, అలా వచ్చినందుకు హిందూ దేవుళ్ళకు కోపం వస్తుందేమోనని చెంపలేసుకోవడమూ జరగొచ్చు. అదేమీ పెద్ద సంగతి కాదు. అది రాయకపోతే కథ ఏమైనా తేడా కొడుతుందా? కథ ముందుకు సాగదా? నామిని కతల మొనగాడు. కథ రాయడం ఉత్తుత్తిగా కాక, నిజంగా తెలుసును ఆయనకి. ‘మన దేముళ్లకు కోపమొస్తాదేమో అని చెప్పి మళ్లా పటాలకల్లా తిరిగి చెంపలేసుకొనింది’ అని రాయడంలో నాగేశ్వరి తాలూకు మనఃస్థితినంతా మన ముందు కుప్పబోశారు. అతి సూక్ష్మమైన అట్లాంటి సంగతుల చెప్పడం ఓ కళ. నామిని నికార్సయిన కళాకారుడు.
Ads
సినిమాల్లోకి వద్దాం!1999లో కె.ఎస్.రవికుమార్ గారి దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తమిళంలో ‘పడయప్ప’ సినిమా వచ్చింది. అదే తెలుగులో ‘నరసింహ’గానూ వచ్చింది. నీలాంబరి పాత్రని ఎన్నేళ్లయినా మర్చిపోగలరా? తనకు దక్కని నరసింహ కోసం 18 ఏళ్లపాటు ఒకే గదిలో ఉన్న నీలాంబరి ఒకరోజు మెట్లు దిగి కిందకొచ్చి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి అందంగా తయారవుతుంది. అన్న, అతని కొడుకుతో కలిసి బయటికి వెళ్తుంది. ఆ క్షణాన నేరుగా కార్ మీద షాట్ తీయొచ్చు. కానీ రవికుమార్ అలా చేయలేదు. తలుపు తీయగానే నీలాంబరి మొహానికి ఎండ తగులుతుంది. ఒక్క క్షణం కళ్లు మూసుకుంటుంది. ఆ తర్వాత అన్న పెట్టుకున్న కళ్లజోడు తీసి తను పెట్టుకుంటుంది. Claps to that Shot. అది లేకపోతే సినిమా ఆడదా? ఆడుతుంది. కానీ 18 ఏళ్లు బయటి ప్రపంచం చూడని నీలాంబరి పాత్రని తొలి సన్నివేశంలోనే బలంగా జనానికి ఎక్కించే ఏ సూక్ష్మమైన అంశాన్నీ దర్శకుడు వదులుకోలేదు. ఈ ఒక్క షాట్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు.
తెలుగు సినిమా దగ్గరికి వద్దాం! 1993లో విడుదలైన ‘మిష్టర్ పెళ్లాం’ సినిమా చూశారా? ‘మగవాళ్లు ఆఫీసుల్లో పనిచేస్తూ కష్టపడతారు. ఆడవాళ్లు ఇళ్లలోనే ఉంటూ హాయిగా సుఖపడతారు’ అని తెగ నీలిగే మగవాళ్ల ఈగో మీద బాపు రమణలు కలిసి వేసిన బాణం ఆ సినిమా. దాదాపు 30 ఏళ్ల క్రితమే వచ్చిన అచ్చతెలుగు Feministic Film. అందులో ఆమని తెలుగింటి ఇల్లాలు. పొద్దున్న ఐదింటికి మొదలైన పనులు మధ్యాహ్నం దాకా సాగుతూనే ఉంటాయి. ఊడవడం, తుడవడం, వంట, ఇస్త్రీ, పిల్లలు, పోషణ.. అన్నీ ఆమె చేయాల్సిందే! భర్త చేత అతని బ్రష్ మీద పేస్ట్ వేయించి, టిఫిన్ కూడా అతని నోటిదాకా అందించే సగటు భార్య. భర్త ఆఫీసుకు వెళ్లాక, ఇక మిగిలిన పనులు చేసుకోవచ్చు అనుకుంటుండగా పక్కింటి వారు దిగబడతారు. రావడం రావడమే ‘అమ్మాయ్! మేం వచ్చేశాం’ అనే పిలుపు. ఒక క్షణకాలం విసుగుతో కూడిన ముఖం పెడతారు ఆమని. ఆ వెంటనే సర్దుకుని, చిరునవ్వు నవ్వి ‘రండి.. రండి’ అంటారు. Kudos to that Expression. ఆ ఒక్క షాట్ అలా తీయమని ఎవరు చెప్పారు బాపు గారికి? అది లేకపోతే మాత్రం ఏమిట్ట? ఆయనకు తెలుసు, ఆ ఒక్క షాట్ కూడా ఆ పాత్రని బలంగా నిలబెట్టేందుకు తోడ్పడుతుందని.
భారీ డైలాగులు, గుండెలు పిండేసే నటన, నేపథ్యంలో బీభత్సమైన సంగీతం.. ఇవన్నీ అవసరమే! కానీ ఒక్కోసారి అతి చిన్న ఆలోచన, అతి సహజమైన ఎక్స్‌ప్రెషన్ ఆ మొత్తం సన్నివేశాన్ని నిలబెడుతుంది. అవసరమైనంత ఆ Minuet Detailsని కూడా వదిలిపెట్టక, బాగా రాయడం గొప్ప. తీయడం ఇంకా గొప్ప. రచయితలకు ఆ సూక్ష్మం తెలియాలి. అది తెలియాలంటే బాగా చదవాలి. బాగా చూడాలి. బాగా ఆలోచించాలి. ‘ఆయన భోజనం చేశాడు’ అని అందరూ రాస్తారు, ‘ఆ ఇంటాయన పెరుగన్నంలో ఆవకాయ్ బద్ద కలుపుకు తింటుంటే, పళ్ల సందుల్లో మామిడి ముక్క ఇరుక్కుపోయింది. దాన్ని నాలికతో లాగడానికి ఆపసోపాలు పడుతున్నాడు’ అని రాయడంలో జిలుగూ, వెలుగూ ఉంది. చాలా చిన్నదే, కానీ బలమైనది.
By… Sai Vamshi
Share this Article