.
గ్రామీణ జర్నలిజం, పట్టణ జర్నలిజం ఎలా భ్రష్టుపట్టించబడిందో బోలెడు ఉదాహరణలు చూస్తున్నాం… భరిస్తున్నాం… ఫేక్ జర్నలిస్టులు, బ్లాక్‌మెయిలర్లు, యూట్యూబర్లు గట్రా సమాజానికి కొత్త బెడదగా మారారు… మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు తక్కువేమీ కాదు….
వాట్సప్ గ్రూపుల్లో కనిపించిన ఓ తాజా వార్త ఏమిటంటే..? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, తొర్రూరుకు చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రిపోర్టర్లు, సిగ్నేచర్ స్టూడియో యాంకర్లు అక్రమ వసూళ్ల దందాకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు…
Ads
నమస్తే తెలంగాణ రిపోర్టర్ పోల్ రాజు, టీ న్యూస్ రిపోర్టర్ శీలం సుమంత్, సిగ్నేచర్ స్టూడియో యాంకర్ జాటోతు ఉపేందర్ ఈజీ మనీకి అలవాటు పడి దందాలకు తెర తీశారు… పంచాయతీ ఎన్నికలు రావడంతో ఈ ముగ్గురు ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల అవతారం ఎత్తారు…
కారుకు సైరన్ బిగించి ఆయా గ్రామాల్లో అధికారుల పేరిట హల్చల్ చేశారు… ప్రచారం కోసం తిరిగిన పార్టీ కార్యకర్తలకు విందు ఇద్దామని సర్పంచ్ అభ్యర్థులు మద్యం తీసుకు వెళ్తుంటే వారిని వెంబడించి, బెదిరించి పలు గ్రామాల్లో డబ్బులు రాబట్టారు,,. తొర్రూరు, పెద్దవంగర కేంద్రంగా వీరి బెదిరింపులు, దందాలు కొనసాగాయి.,,
గత నెల 11న సాయంత్రం 4.30 గంటలకి ధరావత్ ఆనంద్, ములుగు నివాసి, పోచంపల్లి గ్రామం, పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పాలకేంద్రం దగ్గర ఆగి, అక్కడి వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కొని, తన కారులో వెళ్తుండగా, ఈ ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వారిని వెంబడించి, దారి మధ్యలో అడ్డగించి, వారిని మేము ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులమని, కారును చెక్ చేసి, కారులోని మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని, లక్ష రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని వదులుతామని బెదిరించారు…
ఆ క్రమంలో ధరావత్ ఆనంద్ , డ్రైవర్ కుమార్ ను, అతని కారును నిర్బంధించగా… ఇతను బెదిరిపోయి వాళ్ల బామ్మర్ది దగ్గర అప్పటికప్పుడు ఒక లక్ష రూపాయలను సర్దుబాటు చేసి, వీరికి ఇచ్చి కారును, అతని డ్రైవర్ ను విడిపించుకున్నారు…
ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులలో జాటోతు ఉపేందర్ సివిల్ డ్రెస్ లో ఉండగా పోల్ రాజు, శీలం సుమంత్ అయ్యప్ప స్వామి దుస్తుల్లో ఉన్నారు… జాటోత్ ఉపేందర్ సింగ్ వెలికట్ట శివారు పెద్దమంగ్యా తండా పరిధిలోని కేశ్య తండా కాగా, హైదరాబాదులో సిగ్నేచర్ స్టూడియో యాంకర్ గా పనిచేస్తున్నాడు…
పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన పోల్ రాజు తొర్రూరు బస్టాండులో కార్గో పార్సెల్ సర్వీస్ నడిపిస్తాడు. ఇటీవల తొర్రూరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ గా నియమితుడై పని చేస్తున్నాడు. వెంకటాపురం గ్రామానికి చెందిన శీలం సుమంత్ టీ న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్నాడు.
గత నెల 12న ఉపేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించగా, ఈనెల 16న పోల్ రాజును, పరారీలో ఉన్న సుమంత్ ను ఈనెల 29 న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి, మహబూబాబాద్ సబ్ జైలుకు పంపించారు… ఉపేందర్ నుంచి నేరానికి వాడిన కారును, బాధితుల దగ్గర నుండి వసూలు చేసిన రూపాయలలో ఇతను తీసుకున్న రూపాయలు రూ. 50 వేలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు…
రాజు నుంచి రూ.25 వేలు, సుమంత్ నుంచి రూ.25 వేలు, ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు… జర్నలిస్టు ముసుగులో అక్రమ దందాలకు, బెదిరింపులకు పాల్పడే ఎవరికైనా శిక్షలు తప్పవని ఎస్సై ఉపేందర్ తెలిపారు… హిజ్రాలు ఏవైనా ఫంక్షన్లు ఉంటేనే, వచ్చి మీదపడి, వసూళ్లు చేస్తారు… మరి వీళ్లు..?!
అవునూ, అరెస్టులు కూడా జరిగాయి కదా, వీళ్లను తొలగించారా..? తెలియదు..!!
Share this Article