.
భర్తల్ని భార్యలు రపరప్ఫాడించే సీజన్ కదా ఇది… అక్రమ సంబంధాలే ప్రధాన కారణం కదా… ప్రియులతో కలిసి మొగుళ్లను కసకసా కోసేసే పెళ్లాల కథలూ చదువుతున్నాం కదా… చివరకు పిల్లల ఉసురు కూడా తీస్తున్నారు కదా…
నిన్న ఒకతి భర్తను చంపి హోమ్ డెలివరీ చేసిందట… సరే, రోజుకు మూణ్నాలుగు మన పత్రికల్లోనే కనిపిస్తున్నాయి… ఇంకెన్నో… భార్యల మొహాలు చూస్తేనే భర్తలు గజ్జున వణికే రోజులివి… చివరకు ఎలా తయారైందంటే..? ఓ పిల్ల భర్తను సెల్ఫీ దిగుదాం అని పైపైకి తీసుకుపోయి గుట్ట మీద నుంచి నెట్టేసే హత్యాప్రయత్నం చేసింది కదాాా… పోలీసులు మైనర్ పిల్లను పెళ్లిచేసుకుంటావా అని ఉల్టా పోక్సో కేసు పెట్టారట… ఓ భర్త ఎక్కువ మాట్లాడుతున్నాడని భార్య వాడి నాలుకను కొరికేసి మింగేసిందట…
Ads
ప్రాణాలతో వదిలేస్తే అది పదివేలు అని మొగుళ్లు మొక్కుకుంటుంటే, ఆమె ఎవరో 18 నెలల్లోనే విడాకులకు అప్లయ్ చేసి, ఓ ఫ్లాట్, కోటి రూపాయల భరణం కావాలని డిమాండ్ పెట్టిందట… బీఎండబ్ల్యూ కారు వద్దా ఇంకా, చదువుకున్నావు కదా, నీ తిండి నువ్వు సంపాదించుకోలేవా అని సుప్రీంకోర్టే హాశ్చర్యపోయి వాతలు పెట్టింది…
మొన్న యూపీలో ఓ నలుగురు పిల్లల తల్లి మేనల్లుడితో లేచిపోయింది, తిరిగి వస్తే భర్త క్షమించి ఇంట్లోకి రానిచ్చాడు, నాలుగు రోజులకే మళ్లీ జంప్… ఒకామె సొంత కూతురి మామతోనే లేచిపోయింది… ప్చ్, కాని రోజులొచ్చాయి మగవాడికి… ఇన్నేళ్ల ‘మగ రోజుల’కు అంతకంతా తీర్చుకుంటున్నట్టున్నారు ఆడాళ్లు…
మరీ కసకసా టైపు భార్యలకన్నా కాస్త మెత్తనైనవాళ్లు గృహహింస కేసులు, కట్నం కేసులు, వీలైతే అత్యాచారం కేసులు, పోక్సో కేసులు పెట్టేస్తున్నారు.,. ఏళ్ల తరబడి సహజీవనం చేసీ, పెళ్లి పేరుతో మభ్యపెట్టి నాపై లైంగిక దాడి చేశాడనీ కేసులు పెడుతున్నారు… పెళ్లంటేనే మగాడికి వణుకు ఇప్పుడు..? ఈ మొత్తం ఉపోద్ఘాతానికి ప్రధానంగా కనిపిస్తున్న సూత్రం ఏమిటి..? అక్రమ సంబంధాలు…!
ఇవి ఎప్పుడూ ఉంటాయి, ప్రతి సమాజంలోనూ ఉంటాయి… కానీ గుట్టుగా ఉండేవి, సాగేవి… ఇప్పుడు బహిరంగం, అడ్డుపడితే కసకసా… అదీ మార్పు… అన్నట్టు ఓ వార్త కనిపించింది నిన్న… అదేమిటంటే..?
‘‘తమిళనాడులోని కాంచీపురం నగరం వివాహేతర సంబంధాలకు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది… ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాలను వెనక్కి నెట్టి, ఆష్లే మాడిసన్ (Ashley Madison) అనే అంతర్జాతీయ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన జూన్ 2025 వినియోగదారుల డేటా ఈ విషయాన్ని వెల్లడించింది…
ఈ నివేదిక ప్రకారం, కాంచీపురం కేవలం ఒక సంవత్సరంలోనే 2024లో 17వ స్థానం నుండి మొదటి స్థానానికి దూసుకువచ్చింది… ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్లాట్‌ఫారమ్ నిర్దిష్ట కారణాన్ని చెప్పనప్పటికీ, టైర్-2, టైర్-3 నగరాల్లో యాప్ వినియోగం పెరుగుతున్న విస్తృత ధోరణికి ఇది నిదర్శనమని న్యూస్ 18 అంటోంది…
ఢిల్లీ- NCR ప్రాంతం ఆష్లే మాడిసన్ సైన్‌అప్‌లలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. టాప్ 20లో తొమ్మిది ప్రాంతాలు ఈ ప్రాంతం నుంచే ఉన్నాయి… వీటిలో సెంట్రల్ ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది… ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీతో పాటు గుర్గావ్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) వంటి పొరుగు నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి…
ముంబై టాప్ 20 జాబితాలో లేకపోవడం గమనార్హం… అయితే, జైపూర్, రాయ్‌గఢ్, కామరూప్, చండీగఢ్ వంటి నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి… ఈ ర్యాంకింగ్‌లు కొత్త వినియోగదారుల సైన్‌అప్‌ల ద్వారా మాత్రమే కాకుండా, కార్యకలాపాల తీవ్రత, ఎంగేజ్‌మెంట్ డేటా ద్వారా నిర్ణయించబడతాయని ప్లాట్‌ఫారమ్ స్పష్టం చేసింది… ఇవి వివాహేతర సంబంధాలు, బహుభార్యత్వం/ బహుభర్తత్వం (non-monogamy) ధోరణులను సూచిస్తాయి…
వెరసి మన వైవాహిక వ్యవస్థే కుదుపులకు గురవుతోంది… సహజీవనం చాలు, పెళ్లి చేసుకున్నా పిల్లలు వద్దు, ఓన్లీ ఇద్దరమే, ఎవరి ప్రైవసీ వాళ్లది లేదా అసలు ఒంటరిగానే బతికేద్దాం అనే ధోరణులు బాగా పెరుగుతున్నాయి… అసలే కెరీర్ ఒత్తిళ్లతో 30, 40 దాకా పెళ్లిళ్లు కావడం లేదు, పైగా ఈ విపరీత ధోరణి…!!
Share this Article