Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

It can be a web series!… ఒక నవల ఆత్మను పట్టుకునే సమీక్ష అంటే ఇదీ..!!

July 22, 2021 by M S R

……… By…. Taadi Prakash……………..   అట్టాడ అప్పల్నాయుడు మాస్టర్ పీస్ – ‘బహుళ’

Peoples ‘war and peace’ of srikakulam
———————————————————————–

చుక్కల ఆకాశాన్ని చూస్తూ… ఒక పిల్ల – “డబ్బీ పగలగొట్టలేము, డబ్బులు లెక్కెట్టలేము… ఏటో? సెప్పుకోండి”…? అనడిగింది.
“ఆ…! డబ్బీ – ఆకాశం, డబ్బులేమో చుక్కలు” అని పొడుపు కతను విప్పిందో పిల్ల.
పిల్లపాపలు, నడివీధిలోని వాండ్రంగి సత్యం ఇంటి అరుగు మీద కూకొని ఊసులాడుకుంటన్నారు. వెన్నెల కూడా నడివీధిని చేరుకుంది…

ఇలా ఒక పులకింతతో మొదలవుతుంది నవల… అలనాటి స్వచ్ఛమైన జానపద గీతాలు వినిపించే కరెంటు లేని చీకటి పల్లెల కూడళ్ళలోకి పాఠకుల్ని నడిపిస్తుంది ‘బహుళ’.

ప్రాణాధారమైన భూమి, తిండిగింజలిచ్చే వ్యవసాయం, చెమటనెత్తురు ధారవోసినా తీరని అప్పులు, చాలని ఫలసాయం – బిడ్డల ఆకలి, రైతుల నిరాశ – ఒక తిరుగుబాటుగా, యుద్ధంగా మారడానికి ముందు ఉత్తరాంధ్ర గ్రామీణ జీవన దృశ్యాన్ని నాగావళీ, వంశధార నీటి కెరటాలు మాట్లాడుతున్నంత సహజంగా అట్టాడ అప్పలనాయుడు మన కళ్ళముందు పరుస్తాడు.
దిక్కుతోచని రైతులు, బియ్యం కూడా దొరకని రోజులు… బిడ్డలకి సోళ్లూ, గంటెలూ వండి పెడుతున్న తల్లులు! గాలికి వూగుతున్న పెద్దపెద్ద పచ్చని చెట్ల కింద మోడువారుతున్న సంసారాలు. రైతులూ, వ్యవసాయ కూలీల బతుకులపై ఆకలి చీకటి తెర దిగుతున్నప్పటి ఇనప గజ్జెల విషాద సంగీతాన్ని విని తట్టుకోలేం!

అప్పల్నాయుడు, భావుకత గట్లు వొరుసుకుని ప్రవహించే నది లాంటి కవి.
మారుతున్న సమాజ స్వభావాన్ని నిర్వికారంగా నలుపు తెలుపులో సజీవమైన అక్షరాలుగా మార్చగల ఆధునిక రచయిత.
సున్నితమైన మానవ భావోద్వేగాలను పట్టుకుని, అందమైన వాక్యాలుగా సరళసుందరమైన భాషతో హృదయతంత్రుల్ని మీటే అరుదైన ఆర్టిస్టు.
కన్నీరొలికే సన్నివేశమైనా, కత్తితో నరికే రక్తసిక్తమైన క్షణాలనయినా పొందికైన మాటలతో హత్తుకునేలా చెప్పగల పరిణితి సాధించిన మనకాలపు మొనగాడు.

భూస్వామ్యం ఇనప పాదాల కింద నలుగుతున్న వ్యవసాయం, రైతులూ, కూలీల గ్రామీణ జీవితాల్లోకి చాప కింద విషంలా పెట్టుబడిదారీ విధానం వ్యాపించిన తీరుని కన్నీటికావ్యంగా మలిచిన నైపుణ్యం…
ఒకదాని వెంట ఒకటిగా దూసుకొచ్చిన సంఘటనల్ని ఒక వరసలో పరిచిన చాకచక్యం, శిథిలం అయిపోతున్న బతుకు గుమ్మం మీద నిస్సహాయంగా నిలబడిపోయిన రైతుల మానసిక వేదనని పాఠకుని రక్తనాళాల్లో పలికించే ఒడుపు తెలిసిన సృజనాత్మక కళాకారుడు అట్టాడ అప్పలనాయుడు.

*** *** ***
bahula

అష్టకష్టాల్లో వున్న రైతుల గురించి చెబుతూ ఒకచోట, “వాళ్ళు సృష్టికర్తలు కదా మరి” అంటాడు రచయిత.

‘బహుళ’ నుంచి కొన్ని మంచి మాటలు :
వాతావరణం దుఃఖశ్వాస తీసింది.
నాగావళి నీటి మీద కిరణాలని పొద్దు తడిపేవేళ…
వర్షపు చినుకులతో ఆకాశం నుంచి రాలిపడిన ఇంద్రధనుసు ముక్కలా కనిపించింది – సుభద్ర మొహం! ఆమె కుంకుమ రంగు జాకెట్టు మీదుగా పొద్దు మలుగుతోంది.
సూర్యుడు… ప్రతిరోజూ లాగే తూరుపు వాకిటి పీటచెక్క ఎక్కి కూచున్నాడు.

భూమి కంపించేట్టు ఆడీ, పాడే గొల్లభామల కలాపం సుతిమెత్తని శృంగార నృత్యంగా, భామాకలాపంగా మారిపోయి అగ్రవర్ణాల కళారూపమైంది. జానపద కళాకారుల – చెంచుల పాట, బోనెల పాట, తోలుబొమ్మలాట, తప్పెటగుళ్ళు వంటి కళారూపాలకు బియ్యపు గింజల బిచ్చం. అదే హరికథ, భామాకలాపం, వీణావాయిద్యం, పద్య నాటకం కళారూపాలకు ఈనాంలూ, బిరుదులూ, బహుమానాలూ, సత్కారాలూ! ఎవరి కళలు వారివే!

అందుకే ఒక రైతు, ఓసారి ఉరజాడ హరిదాసు గారితో తో – మావి మడిలో (పొలంలో) రాగాలు, మీవి గుడిలో రాగాలన్నాడు.

*** *** ***

కాపు నారాయుణ్ణి పెళ్లి చేసుకుని, ఒక బిడ్డని కన్న తక్కువకులం (గొల్ల) బంగారమ్మ ఒకరోజు ఇంటి నుంచి హఠాత్తుగా వెళిపోతుంది. ఈ సన్నివేశాన్ని అప్పల్నాయుడు రాసిన తీరు గుండెని ముక్కలు చేసేస్తుంది. “దీపాలు వెలిగించిన వేళ దాటిపోయింది, బంగారమ్మ రాలేదు. వంటల వేళయ్యింది, రాలేదు బంగారమ్మ. నిద్ర వేళయ్యింది, రాలేదు… రాలేదు బంగారమ్మ. చుక్కలు ఆకాశాన పొడిచాయి, బంగారమ్మ రానే…లేదు” – ఇలా వాక్యం వెంట వాక్యం, మనకి తెలీకుండానే మనం బంగారమ్మని వెతుక్కుంటాం! ‘బహుళ’లోని షాక్ చేసే కొన్ని సన్నివేశాల్లో ఇదొకటి. ఇక్కడ మీకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గుర్తొస్తే ఆ తప్పు గురజాడది. అప్పల్నాయుడిది కానేకాదు!

“కొందరు బంగారమ్మ కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టి బుగ్గలు గిల్లగా పిల్లడు ఏడుపు యెత్తుకున్నాడు.
ఓసిదేటోలమ్మ సున్నితాల మొగుడు, వెన్నపూస రాస్తే కందిపోనాడట… అని యిగటమాడిందొకామె” అని రాస్తాడు. ఆ మారుమూల చీకటి పల్లెల్లో అక్షరం ముక్కరాని, జాకెట్లు వేసుకునే అలవాటు లేని వ్యవసాయ పనులు చేసుకునే ఆడవాళ్ళు, కష్టజీవులైన మగాళ్ళు, కూలీల చతుర సంభాషణ, హాస్యదృష్టి, ఇన్ స్టెంట్ రిపార్టీని రచయిత అంతే అందంగా మనకి పట్టియిస్తాడు.

ఏ ప్రాంతం యాసలోనైనా ఒక విరుపు, ఒక తూగు, ఒక సొగసు వుంటాయి. శ్రీకాకుళం, ఉత్తరాంధ్రకి చెందిన తూర్పోళ్ల అచ్చ తెలుగు యాసని అంతే లాఘవంగా రాయడమే కాకుండా, ఆ మాటల వెన్నంటి వుండే మధురమైన మట్టి సంగీతాన్ని అలవోకగా వినిపించగలిగాడు అప్పల్నాయుడు. గొల్లలు, వెలమలు, మాల మాదిగలు, కాపులు, రెల్లివాళ్ళు, చాకలి, మంగలి, మేదరి, బ్రాహ్మల మాటల్లోనిన్ సొగసుని సాధికారికంగా రికార్డు చేసిన కళింగాంధ్ర కావ్యం ‘బహుళ’!

*** *** ***

నూరేళ్ల ఉత్తరాంధ్ర చరిత్ర… నేలతో, వానతో, విత్తనాలతో పెనవేసుకుపోయిన మూడు తరాల జీవన్మరణ వేదన… శ్రీకాకుళం కొండల్లో ఎగిరిన రైతాంగ సాయుధ పోరాట జెండా, నక్సలైట్ల దాడులకు భయంతో కంపించిపోయిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు! తలలు తెగనరికిన విప్లవోద్యమం… సిక్కోలు కొండకోనల లోపలికి ఎక్కడికో తల వంచుకుని వెళ్లి అదృశ్యం అయిపోవడం, తెలుగు భాష కూడా రాని నాలుగోతరం మునిమనవళ్ళు నగరాల నుంచి కార్లు, విమానాల్లో రావడం… కాయకష్టం చేసే మట్టికాళ్ళ మనుషులు కనుమరుగై, హృదయం లేని దళారులు, రాజకీయ నాయకులూ డబ్బుతో, ఎన్నికల్తో దున్నపోతుల్లా గ్రామాల మీద పడడం… ఇదీ 430 పేజీల ‘బహుళ’. ఇది తెలుగులో వచ్చిన Epic Novel అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

కాలం చేసిన ఈ లాంగ్ మార్చ్ లో గ్రామీణ భూస్వామ్య వ్యవసాయ వ్యవస్థ కళ్ళ ముందే కూలిపోవడం… చల్లారిన సంసారాలు, తెల్లారిన బతుకులు… వీటన్నిటి గురించి అప్పలనాయుడు మరో 400 పేజీలు తేలిగ్గా రాయగలడు. అలా కాకుండా విషయాన్ని సూటిగా, క్లుప్తంగా, శక్తిమంతంగా చెప్పడమే రచయిత సాధించిన విజయం. చాలాచోట్ల నాకు, అరే.. ఇక్కడ యింకో నాలుగైదు వాక్యాలు రాస్తే బావుండేది కదా అన్పించింది. అలాంటి temptation ని resist చేసుకోగలిగాడు రచయిత. సంయమనం అవసరం. అయితే ఇలాంటి అలవిమాలిన సంయమనం పాటించగలగడం అరుదుగా జరుగుతుంది. ఏది ఎంత చెప్పాలో అంతే చెప్పి వూరుకోగల నిర్దయుడైన రచయితని అప్పల్నాయుడులో చూడగలం.
ఎందుకంటే, అట్టాడ అప్పలనాయుడు విప్లవ కార్యకర్త. ఉద్యమంతో మమేకం అయినవాడు. నీరుగారిన ఉద్యమాన్ని చూసి మనందరిలాగే నిరాశోపహతునిగా మిగిలిపోయినవాడు. ఐనా ఆశ చావని మానవుడు. ఈ నేపథ్యం వున్నా, నవలలో ఎక్కడా ఎర్రజెండాలు ఎగరేయలేదు. ఉపన్యాసాలు దంచలేదు. నినాదాలతో హోరెత్తించలేదు.

శ్రీకాకుళం లోంచి ఉద్యమాన్ని తీసిపారేయలేం గనక, చరిత్రని చెరిపేయడం కుదరదు గనక, ఈ నవల్లో సుబ్బారావు పాణిగ్రాహి పాట ఎక్కడో కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. చరిత్రాత్మకమైన వెంపటాపు సత్యం త్యాగాన్నీ, ఆదిభట్ల కైలాసం ఆదర్శాన్నీ… అరుపులూ, కేకలూ, ఊరేగింపులూ లేకుండా సున్నితంగా, సందర్భోచితంగా ప్రస్తావించిన తీరు గుండెని గాయపరుస్తుంది. ఒక ఉద్యమకాలానికి, కొన్ని ఉద్రిక్త సంఘటనలకీ సాహిత్య గౌరవం ఇచ్చిన తీరులోని ఔచిత్యం నాకెంతో నచ్చింది.

*** *** ***

స్పెయిన్ అంతర్యుద్ధ కాలంలో, నియంత జనరల్ ఫ్రాంకో, ఉత్తర స్పెయిన్ లోని Basque నగరంపై బాంబుదాడి చేశాడు. ఆ విధ్వంసాన్నీ, మానవ మహా విషాదాన్నీ 1937లో ఒక పెద్ద పెయింటింగ్ వేశాడు పాబ్లో పికాసో. దాని పేరు guerica (గెర్నికా). 20వ శతాబ్దపు మహత్తరమైన పెయింటింగ్ పేరుగాంచిన గెర్నికా International symbol of genocide గా నిలిచిపోయింది. అచ్చూ అలాగే… శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని పంట భూముల విధ్వంసాన్నీ, తరతరాల గ్రామీణ రైతుల, వ్యవసాయ కుటుంబాల, రోజుకూలీల నిత్యజీవన విషాదాన్ని ‘బహుళ’ గెర్నికా అనే బృహత్తరమైన పెయింటింగ్ వేసి, కానుకగా యిచ్చినవాడు అప్పల్నాయుడు.

కొన్ని ఫ్లాష్ బ్యాక్ లతో చెప్పిన నాన్ లీనియర్ టెక్నిక్ ‘బహుళ’ కథకి ఒక ఊపునీ, కొత్త శక్తినీ యిచ్చాయి. కొన్ని చోట్లయినా గాబ్రియేల్ గార్షియా మార్క్వేజ్ పాఠకుడి స్మృతిపథంలో మెదులుతాడు. అనేకానేక పాత్రలూ, మనస్తత్వాలూ, కొన్ని డజన్ల కుటుంబాలు, విభేదాలు, ఘర్షణలూ, హత్యలూ, కుట్రలూ, భేషజాలూ, వేదనా, కన్నీళ్లూ నదిలా కలిసి ప్రవహించే యీ narrative లోని విస్తృతీ, గాఢతా, వైవిధ్యం ఒక సంపూర్ణ జీవితానుభవంగా మనలోకి ఇంకుతున్నపుడు టాల్ స్టాయ్ గుర్తుకి రాకమానడు. ‘war and peace’ కళ్ళముందు కదలాడుతుంది.

*** *** ***

అప్పల్నాయుడి నవలకి రాసిన ముందుమాటలో కవి కె.శివారెడ్డి, epic novel ‘బహుళ’ మార్క్వెజ్ one hundred years of solitude ని గుర్తుచేస్తుంది అన్నారు.

“కళింగయుద్ధ క్షతగాత్రుడని నేను ఇష్టంగా గుండెకు హత్తుకునే రచయిత అప్పల్నాయుడు. ‘బహుళ’ని రూపంలో లో టాల్ స్టాయ్ ‘యుద్ధమూ శాంతి’ నవలతో పోల్చవచ్చు” అని మరో ముందుమాటలో ప్రసిద్ధ విమర్శకులు ఎ కె ప్రభాకర్ అన్నారు.

“నవలా రచయిత అంటే, సొంత ఇంటిని కూల్చుకుని ఆ ఇటుకలతో తన నవల అనే సౌధాన్ని పునర్నిర్మించేవాడు” అన్న మిలన్ కుందేరా మాటల్ని కోట్ చేస్తూ, ఈ మాటకి ‘బహుళ’ నవల సరైన ఉదాహరణ అని రచయిత గంట్యాడ గౌరునాయుడు అన్నారు.

*** *** ***

నవలలో తొలితరం పెద నారాయుడు, మనవడు నారాయుడు, అతని కొడుకు రాధేయ, బలరాం, సంధ్య, జానేష్, సత్యకాలం, బంగారమ్మ, అన్నపూర్ణ, కనకం నాయుడు, జగన్నాథ దాసు… ఇలా ప్రతిఒక్కరూ చీమూ నెత్తురూ వున్న సజీవమైన పాత్రలు. ఉద్యమంలో ఉండి, పోరాడి, చివరికి వెనక్కితగ్గిన ప్రధానపాత్ర రాధేయ, రచయిత అట్టాడ అప్పలనాయుడే అని తెలుసుకోవడం ఎంతో బావుంటుంది. నవలలోని అనేక సంఘటనలు వాస్తవంగా జరిగినవే. చాలమంది అప్పల్నాయుడికి తెలిసిన వాళ్లే. సహచరులే! కనక యీ బృహన్నవల యీ రచయిత జ్ఞాపకాల జలపాతం!

అప్పల్నాయుడు నిజాయితీగా, నిక్కచ్చిగా, నిష్కర్షగా గతకాలపు గాయాలనీ, తిరుగుబాటునీ, ఉద్యమ వైఫల్యాన్నీ, రాజకీయ కపటత్వాన్నీ, వంచననీ, జనశ్రేణుల నిస్సహాయతనీ ఒక క్రమంలో కళాత్మకంగా, వివరణాత్మకంగా చెప్పిన తీరు వల్ల ఈ నవల ఒక historic document గా రూపుదిద్దుకుంది.

*** *** ***

… అనేకానేకులు చాన్నాళ్లుగా నా లోలోపల గూడుకట్టుకుని మాగురిండి రాయవేట్రా? అని గుణిసేవారు.
నడుముకి నాగులగావంచా, భుజాన నాగలీ, పతాకలా ఎగిరే తలపాగాతో నల్లగా, బలిష్టంగా, జబరగా తాత ముత్తాతలూ, యెడమ పయ్యాడ గోరంచు కోకతో, కాళ్ళ కడియాలతో, చేతుల మట్టిగాజులతో, కొనకమ్ములూ, ముక్కుపుడకల మొహాలతో, వారమెట్టలతో, పొట్టీ, పొడుగూ అమ్మమ్మ, అమ్మమ్మల అమ్మలూ నవలలోకి చొరబడసాగేరు. రాస్తుంటే… అనేకానేకాంశాలు మనసులో కదులుతుంటే, కళ్ళ ముందు మెదులుతుంటే… తీవ్ర జ్వరపీడనగా వుండీది… అన్నాడు అప్పలనాయుడు.

It can be a web series!
ఒక పెద్ద సినిమా తీయడానికి సరిపడినన్ని ఉద్విగ్న సన్నివేశాలూ, నెత్తురు మరిగించే సంఘటనలూ, ఉత్కంఠ రేపే flash back లూ, నాటకీయమైన మలుపులూ ‘బహుళ’లో దండిగా వున్నాయి. సగం కథ మారుమూల గ్రామాల్లో, కొండల్లో, గిరిజన సంతల్లో… మరో సగం నగరాల్లో ఏసీ గదుల్లో modern life style తో…

అప్పల్నాయుడి gripping narrative పాఠకుణ్ణి లాక్కుపోతుంది. ఒక దాడినో, హత్యనో, అర్ధరాత్రి కిడ్నాప్ నో అచ్చూ స్క్రీన్ ప్లే లాగే రాశారు. అతీ, అతిశయోక్తి, over dramatization లేకుండా సహజసుందరంగా అప్పల్నాయుడు రాసిన తీరు సినిమాకి బాగా నప్పుతుంది. వందేళ్ల చరిత్ర, 430 పేజీల నవల గనక వెబ్ సిరీస్ కి అయితే మరీ బాగుండొచ్చు. విజువల్ గా చూస్తే శ్రీకాకుళం పర్వత సానువుల్లో, నాగావళి, వంశధార నదీ తీరప్రాంతాల్లో మబ్బుల్ని తాకే పచ్చని వృక్షాల నీడల్లో వ్యవసాయం… కూలీలు… రైతన్నలు! ఎడ్లూ, గేదెలూ, గొర్రెలూ, మేకలూ… పాతకాలం గ్రామాలూ, జానపద బాణీలూ, కొండల వెనుక ఉద్యమం, సాయుధ పోరాటం… కొందరు ఉద్యమకారులు నగరాలకు వెళిపోయి కుటుంబాలతో సాధారణ జీవితం గడపడం… ఆవిరైపోతున్న ఆదర్శం, చెదిరిపోయిన కల తిరిగి వస్తాయనే చిగురుటాశ… ఇంకేం కావాలి?

సినిమావాళ్ళకి కావల్సిన కమర్షియల్, మాస్ మసాలా అంతా ‘బహుళ’ లో ఎంతో సహజంగా అమిరి ఉన్నాయి. శ్రద్ధతో, చిత్తశుద్ధితో గనక ఈ నవలని తెరకెక్కించగలిగితే It can be a sensational blockbuster.

బండి నారాయణస్వామి రాయలసీమ చారిత్రక నవల ‘శప్తభూమి’నీ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవలనీ సినిమాలు తీసే ప్రయత్నం జరుగుతోంది. అప్పల్నాయుడి ‘బహుళ’కీ ఆ potencial వుంది.

TAADI PRAKASH 97045 41559

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions