ఆమీర్ ఖాన్ బయటపడి చెప్పాడు… కోట్ల మంది తల్లిదండ్రులు చెప్పుకోవడం లేదు, అంతే తేడా… అదే ఇప్పటి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఓ వింత స్థితి… తను చెప్పింది నిజమే… చాలావరకూ… ఈమధ్య ఎక్కడో కపిల్ శర్మతో ఓ చిట్‌చాట్‌లో నిజాయితీగానే కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు తను… కన్నీటిపర్యంతమయ్యాడు…
‘‘నా నుంచి పాఠాలు నేర్చుకోవడానికి చాలామంది వస్తుంటారు, నా అనుభవాల నుంచి టిప్స్ అడుగుతారు… నన్ను పర్‌ఫెక్ట్ అని భావిస్తారు… కానీ నిజం కాదు, నేను పర్‌ఫెక్ట్ కాదు… ఇద్దరు భార్యలు, విడాకులు, ముగ్గురు పిల్లలు… ఏముంది..? ఇప్పుడు నేను ఒంటరివాడిని…
నా అనుభవం, నా జ్ఙానం వాళ్లకు అక్కర్లేదు, ఛాందసం అనుకుంటారు… తేలికగా కొట్టిపడేస్తారు… నిజానికి మా జనరేషన్ స్టక్ అయిపోయింది… మా తల్లిదండ్రుల నుంచి తిట్లు తిన్నాం, ఇప్పుడు మా తరువాత తరం నుంచీ తిట్లు తింటున్నాం..’’ ఇలా సాగింది తన చిట్‌చాట్ సారాంశం…
Ads
నిజం… ఓ చిత్రమైన జనరేషన్ గ్యాప్ కనిపిస్తోంది… మునుపటి తరం తండ్రులు కొన్ని అంశాల్లో కొట్టేవాళ్లు, తిట్టేవాళ్లు… చెప్పింది విను, బాగుపడు అనేవాళ్లు… ప్రేమ లేక కాదు, సరైన బాటలో పెట్టేందుకు… తండ్రులతో తిట్లు, దెబ్బలు తిననివాళ్లు అరుదు… విన్నామా, బాగుపడ్డామా అనేది వేరే సంగతి… కానీ ఆ పేరెంటింగ్ స్టయిల్ వేరు…
మరి ఇప్పుడు..? ఇప్పుడూ తిట్లు తింటున్నాం, మాటలు పడుతున్నాం, మాట్లాడితే నీదంతా ఛాందసం నాన్నా అనే మాటలూ వింటున్నాం… ఎవరి బతుకులు వాళ్లవి, ఎవరి లైఫ్ ప్లానింగ్ వాళ్లది… తండ్రీకొడుకుల మధ్య కూడా ఈగోస్… మాటపట్టింపులు… గట్టిగా ఒక మాట అంటే మళ్లీ కనిపించరు…
వృద్ధాప్యంలో తమను చూసుకుంటారు అనే ఆశలేవీ లేకుండా పోయిన తల్లిదండ్రుల తరం ఇది… ఇదో సంధిదశా..? కాదు, ప్రతి జనరేషన్‌కూ పేరెంటింగ్ తీరు మారుతుంది, కానీ మరీ ఇప్పటిలా ఎప్పుడూ లేదు… ఆమీర్‌ఖాన్ చెప్పినట్టు మన తండ్రులు, మన పిల్లల నడుమ స్టక్ అయిపోయాం…
ఉపాధి, చదువు, పెళ్లి, పిల్లలు, ప్రాపర్టీ ప్లానింగ్, ఏ విషయమైనా తీసుకొండి… పేరెంట్స్ ఆలోచనలను, ఆశలకూ, పిల్లల అడుగులకూ లంకె కుదరదు… మరీ గట్టిగా మాట్లాడితే, కన్నారు, ఓ బాధ్యతగా పెంచారు, చదివించారు, అంతేకదా అని మాట పడాలి… మౌనంగా ఉంటే గౌరవం…
ప్రత్యేకించి చెప్పాల్సింది రీసెంటు ఇయర్స్‌లో కులాంతరాలు, ఖండాంతర, మతాంతర వివాహాలు నిజంగానే గణనీయంగా పెరిగాయి… ఒక కోణంలో అది సొసైటీకి మంచి సంకేతం… ఎవరి ఇష్టాలు, అవసరాలు, అంచనాల మేరకు వాళ్లు జీవన భాగస్వాములను ఎంచుకుంటున్నారు… వాళ్ల ఉద్యోగాలు వాళ్లవి, కాదంటే వెళ్లిపోయి వాళ్లే పెళ్లిళ్లు చేసుకుంటారు, అనివార్యంగా ఆమోదించాల్సిందే…
హార్డ్ కోర్ ట్రెడిషనల్ ఫ్యామిలీల్లో కూడా ఈ మార్పు వేగంగా కనిపిస్తోంది… ఏ అమెరికన్ సమాజంలోనే పేరెంటింగ్ వేరు… ఓ వయస్సు వచ్చేవరకే తండ్రీ కొడుకు బంధం… తరువాత ఎవరి బతుకు వాళ్లదే… వ్యక్తులే ప్రధానం, బంధాలు- త్యాగాలు- పెద్దరికాలు- గైడెన్స్ వంటివన్నీ ఓ భ్రమ… ఆమీర్ ఖాన్ చెబుతున్నట్టు మనమూ అటువైపే వేగంగా వెళ్తున్నామా..? నిజానికి ఇదంతా పెద్ద సబ్జెక్టు… ఇదంతా పెరిఫెరల్ టచ్ మాత్రమే…
ప్రత్యేకించి సెలబ్రిటీలు, ధనిక కుటుంబాలు, పెద్ద హోదాలు, కొలువుల్లో ఉన్నవాళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లు, విడాకులు గట్రా చూస్తుంటే… తరాలు, బంధాలు, ఉద్వేగాలు, త్యాగాలు, ఆస్తులు వంటి విషయాల్లో మార్పు చాలా వేగంగా కనిపిస్తోంది… ఇది మంచో చెడో కాలమే చెబుతుంది… అనివార్యంగా తలూపుతున్నా, తలొగ్గుతున్నా సరే… కోల్పోతున్న కొన్ని సున్నితమైన ఉద్వేగాలు ప్రజెంట్ తరం పేరెంట్లను కలుక్కుమనిపిస్తూనే ఉంటాయి…!!
Share this Article