ఒక వార్త… కరోనా పేషెంట్లకు వాడే రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల ధరలకు అత్యంత దయతో ఫార్మా కంపెనీలు గణనీయంగా తగ్గించాయి… గుడ్ న్యూస్… ఆహా ఓహో… ఇలా మోడీ అడిగాడు… వెంటనే ఫార్మా కంపెనీలు ధరలు తగ్గించేశాయి… అద్భుతమైన వార్త……. ఇలా బోలెడు సైట్లలో, టీవీల్లో కనిపించిన వార్తల సారాంశం ఇదే… ఈ మోడీ ప్రభుత్వం ఏ పని సరైన దిశలో చేస్తుందో, ఏ పని అపసవ్యంగా చేస్తుందో తెలియని అయోమయం కదా… అందుకని ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాలా..? ప్రభుత్వ అసమర్థతను, నిర్వాకాన్ని, దిక్కుమాలిన పనితీరును తిట్టిపోయాలా..? అర్థం కాదు… ఎందుకంటే..? ఇంజక్షన్ల ధరలు భారీగా తగ్గాయి, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇది శుభవార్తే… ఇక్కడివరకూ అంగీకరిద్దాం… కానీ ఇంకాస్త లోతుకు వెళ్దాం… మన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఔషధ నియంత్రణ విభాగాలు పూర్తిగా ఫార్మా మాఫియా గుప్పిట్లో ఇరుక్కుని ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయనేదే మన ఆందోళన… ఇంకాస్త వివరాల్లో వెళ్దాం…
- ఇప్పుడు ధరలు తగ్గించారు సరే… కానీ ఇన్ని నెలలు కృత్రిమ కొరత సృష్టిస్తూ… అడ్డగోలు ధరలతో పేషెంట్లను దోచుకున్నది ఎవరు..? ఈ ఫార్మా మాఫియా కాదా..?
- ప్రైవేటు డాక్టర్లు, మెడికల్ ఏజెన్సీలు, డ్రగ్ కంట్రోల్ అధికారులు డబ్బులు జలగల్లా పీల్చింది నిజం కాదా..?
- అసలు రెమ్‌డెసివర్ మరీ సీరియస్ కండిషన్లో మాత్రమే వాడాల్సి ఉండగా, దాని ఫలితంపై ఇప్పటికీ సందేహాలున్నా సరే… ఎడాపెడా ఈ ఇంజక్షన్లను ఎందుకు వాడుతున్నారు..? అడిగేవాడు ఎవడు..? చూసేవాడు ఎవడు..?
- కాడిలా కంపెనీకి చెందిన రెమ్‌డెసివర్ ఇంజక్షన్ గరిష్ఠ చిల్లర ధర 2800… మార్కెట్లో, కాదు, కాదు, బ్లాక్ మార్కెట్లో వేలకువేలు… కొన్నిసార్లు 40 వేల దాకా ధరల్ని పిండుకున్నది నిజం కాదా..? కాడిలా అనేది ఉదాహరణ… ఇక ఇతర బ్రాండ్లు అయితే ఇంకా ఘోరం… వాటి గరిష్ఠ చిల్లర ధరలు కూడా ఎక్కువే…
- ఔషధాల ధరల ఖరారు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదే కదా… చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ ధర కూడా అదే ఖరారు చేస్తుంది కదా… నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అని ఓ ప్రభుత్వ విభాగం ఏడ్చింది కదా… మరి ఏం చూసి ఇన్ని నెలలపాటు రెమ్‌డెసివర్‌కు అంత అడ్డగోలు ధరల్ని వసూలు చేయనిచ్చింది ఈ ప్రభుత్వ సంస్థ… అసలు ఈ ధరల్ని ఎవరు ఖరారు చేశారు..? ఏ ప్రాతిపదిక..? ఒకేసారి మూడోవంతుకు, సగానికి ధరల్ని తగ్గించాయి అంటే, ఇన్నినెలలు అవి ఎంత భారీగా దోపిడీ చేసినట్టు..?
- ఇంతటి అంతర్జాతీయ విపత్తు నేపథ్యంలో… కరోనా కీలకమైన మందుల మీద ప్రభుత్వ నియంత్రణ ఎందుకు లేదు..? ఉత్పత్తి, ధరలు, పంపిణీ, నిల్వలపై ప్రభుత్వం కదా ఆజమాయిషీ ఉండాల్సింది… ఆ సోయి ఎందుకు లోపించింది..?
Ads
- ఎస్, వేక్సిన్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది… ఫ్రంట్ వారియర్స్‌కు ప్రభుత్వ ఖర్చుతోనే ఉచిత వేక్సిన్ వేయిస్తోంది… ముందుగా వృద్ధులకు, ఇప్పుడు 45 ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా వేయిస్తోంది ప్లస్ ప్రైవేటులో కూడా ధరను తనే నిర్ణయించింది… ప్రతి టీకా సీసాకూ లెక్కుంది… అనేక దేశాలకు మందును పంపించింది… స్థూలంగా వేక్సిన్ విషయంలో ఇంత పకడ్బందీగా వ్యవహరించిన ప్రభుత్వానికి ఈ రెమ్‌డెసివర్ విషయంలో నియంత్రణ ఎందుకు లేకుండా పోయింది..? ఎవరు బ్లాక్ షీప్..?
- ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉదారంగా వ్యహరించాయి అనేది సత్యదూరం కాదా..? ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో గత 6 నెలల కాలంలో 11 లక్షల ఇంజక్షన్లను విదేశాలకు అమ్మేసుకున్నయ్… దేశంలో కొరతకు అది కూడా కారణమే కదా… మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..?
- ఈరోజు కూడా ఫార్మా కంపెనీలు స్వచ్చందంగా ఈ వాయల్స్ ధరల్ని తగ్గించాయి అని ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం… అంటే ఫార్మా కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలేసినట్టేనా కరోనా పేషెంట్స్‌ను..? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ చేస్తున్న ప్రజాద్రోహం అంతా ఇంతా కాదు… పాలన సరిగ్గా తెలియని ఈ ప్రభుత్వానికి కనీసం విపత్తు వేళల్లో ఎలా వ్యవహరించాలో కూడా సోయి లేదు… లేదు…!!
Share this Article