ఒకప్పుడు పెళ్లి సంబంధాలు అంటే… కేవలం అదే పనిగా తిరిగే పెళ్లిళ్ల పేరయ్యలు ఉండేవాళ్లు… వధూవరుల పూర్తి వివరాలను వీళ్లే ఓసారి చెక్ చేసి, జాతకాలు కలుస్తాయో లేదో గుణించి… కులాలు, ఆర్థిక స్థోమతలూ పరిగణించి… కుదిరే సంబంధం అనుకుంటేనే ఒకరి వివరాల్ని మరొకరికి ఇచ్చేవాళ్లు… దగ్గరుండి మరీ పెళ్లి చూపులు కార్యక్రమాన్ని పర్యవేక్షించేవాళ్లు…
నిజానికి బంధువులు, స్నేహితుల సర్కిళ్ల ద్వారా వచ్చే పెళ్లి సంబంధాలే అధికం… వధూవరుల ఇష్టాయిష్టాలకు, కోరికలకు మరీ అంత ప్రాధాన్యం ఉండేది కాదు… దగ్గరి బంధువులు కొన్నాళ్లలో పెళ్లి ఇళ్లల్లోనే ఉండి పెళ్లిపనులకు సాయంగా నిలబడేవాళ్లు… ఇంటి ముందే పెళ్లి… భోజనాలు… సీన్ కట్ చేస్తే…
వధూవరులకు పెళ్లిసంబంధాలు సజెస్ట్ చేసే బంధువులు, స్నేహితులు తగ్గిపోయారు… ఎవరి బతుకులు వాళ్లవి… బిజీ… వధూవరుల కోరికల్లో తేడా వచ్చేసింది… ఎవరిని చూపిస్తే వారిని పెళ్లి చేసుకునే ఆ రోజులు పోయాయి… కులాంతరాలు కూడా ఎక్కువయ్యాయి… సేమ్ ప్రొఫెషన్‌కు ప్రయారిటీ పెరిగింది… పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాళ్లు… మ్యారేజీ బ్యూరోల డిమాండ్ పెరిగింది… గోత్రాలు, గణాల లెక్కింపు కూడా పెరిగింది… జాతకాల పొంతన కూడా చూడటం ఎక్కువైంది…
Ads
ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు పెరిగాయి… నగరాల్లో, పట్టణాల్లో ఇరుకిరుకు ఇళ్లు పెళ్లి సందళ్లకు సరిపోవు… పైగా నాలుగురోజులు పెళ్లి ఇంట్లోనే ఉండి పనులు చక్కబెట్టే బంధువులూ లేరు… టైమ్‌కు వచ్చి నాలుగు అక్షితలు చల్లి వాపస్ వెళ్లిపోయే బంధుగణమే అధికం… క్యూలో నిలబడి మరీ వధూవరులతో ఫోటో దిగామా, పళ్లెం పట్టుకుని అయిదారు కౌంటర్లు తిరిగి, ఫుడ్ అడుక్కుని, పెట్టించుకుని, నాలుగు మెతుకుల్ని గతికామా, బయటపడ్డామా… అంతే… పొద్దున పెళ్లయితే రాత్రికి అందరూ గాయబ్…
మరి ఇప్పుడు… మ్యారేజీ బ్రోకర్లను నమ్మడం గణనీయంగా తగ్గిపోయింది… చాలామంది బ్రోకర్లు ముందే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసుకుని, తమ దగ్గర ఉన్న నాలుగు సంబంధాలను చూపించి, తరువాత తూటాకు కూడా దొరకరు… కొందరు బ్రోకర్లు వేరే ప్రాంతాల బ్రోకర్లతో టైఅప్ చేసుకుని, వధూవరుల వివరాలను షేర్ చేసుకుని, షేరింగ్ పద్ధతిలో కమీషన్లు పంచుకోవడం కూడా… పత్రికల్లో పెళ్లి సంబంధాల ప్రకటనలు మరీ 10 శాతానికి పడిపోయింది… కొంతలోకొంత మేట్రిమోనీ సైట్స్ నడుస్తున్నయ్, అదీ ఓ పెద్ద దందా…
ఉదాహరణకు ఈనాటి ఈనాడు పత్రిక చూడండి… మరీ పావుపేజీకి తక్కువ… ఒకప్పుడు అయిదారు పేజీల మేరకు నిండేవి… మధ్యలో పెళ్లి ఆర్టికల్స్ కూడా రాసేవాళ్లు… ఇప్పుడు ఏదో మొక్కుబడిగా ఆ యాడ్స్ వేస్తున్నారు… (యాడ్స్ స్పేస్‌కన్నా డిస్‌క్లెయిమర్స్ స్పేసే ఎక్కువ…) ఈరోజు ఈనాడులో వధువు కావలెను అని ఆరు… వరుడు కావలెను అని తొమ్మిది… అంతే… మిగతావి వివిధ మ్యారేజీ బ్యూరోల యాడ్స్… పత్రికల ద్వారా కుదిరే పెళ్లి సంబంధాల సంఖ్య దాదాపు జీరో… ఇప్పుడంతా వాట్సప్ పెళ్లిళ్లు… అంటే అనేకానేక మంది లాభం కోసం గాకుండా సర్వీస్ మోటోతో ఈ గ్రూపులు మెయింటెయిన్ చేస్తుంటారు…
అందులోనూ ఏరియా వారీగా, స్టేటస్ వారీగా వేర్వేరు గ్రూపులు… కులాలు పెళ్లివేదికలు ఏర్పాటు చేస్తుంటాయి… వధువు ఎక్కడో, వరుడు ఎక్కడో… ముందుగా విద్య, ఉద్యోగాలు, ఫైనాన్షియల్ స్టేటస్ గట్రా నచ్చితే వీడియో కాల్స్… తరువాత ముఖాముఖి… శృతి కలుస్తుందా లేదా వధూవరులే నిర్ణయించేస్తారు… కులాంతరాలు కూడా బాగా పెరిగాయి… తప్పనిసరై ఆమోదించాల్సి వస్తున్న పెద్దలు… పొద్దున ఫంక్షన్ హాల్‌కు వెళ్తే సాయంత్రానికి ఎవరిళ్లకు వాళ్లు… అన్నింటికీ మించి డెస్టినేషన్ వెడింగ్స్ పెరిగాయి… కొన్ని పెళ్లిళ్లు అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోనే జరిపించేస్తున్నారు… పెద్దగా కట్నాలు, పెట్టిపోతలు, కానుకలు వివాదాలుగా మారడం లేదు, వాటికి పెద్ద డిమాండూ లేదు…
రిసార్ట్స్ తరహాలో ఉండే వేదికల్లో మొత్తం మ్యారేజీని ఓ ఈవెంటుగా నడిపించే ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి… నో పెళ్లి పత్రికలు, నో వ్యక్తిగత ఆహ్వానాలు… అధికశాతం వాట్సప్ పెళ్లిపిలుపులే… యూట్యూబ్ లైవ్ లింకులు… హేమిటో… ఈనాడులో పావుపేజీ పెళ్లిపందిరి చూశాక ఇవన్నీ గుర్తొస్తున్నాయి… పెద్ద చదువులు, పెద్ద హోదాలు, పెద్ద సంపాదనలు… మనం అభ్యుదయం, ఆధునికం వైపు వేగంగా వెళ్తున్నాం అనుకోవడమే గానీ… స్టేజీ మ్యారేజీలు, రిజిష్టర్ మ్యారేజీలు, నిరాడంబర పెళ్లిళ్లు మాత్రం పెరగడం లేదు… నిజానికి తగ్గాల్సింది పెళ్లి ఖర్చు… ఈవెంట్లు, ప్రివెడింగ్ షూట్స్ ఎట్సెట్రా తడిసి మోపెడవుతోంది…!!
Share this Article