Murali Buddha….. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం…. బాబు సోదరుడు వైయస్ వైపు – జగన్ సోదరి బాబు వైపు ——-
తాతా మనవడు సినిమాలోని అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అనే పాట చిన్నప్పుడు రోజూ రేడియోలో వినిపించేది . ఆ వయసులో పాటలోని భావం పెద్దగా తెలియక పోయినా ఆ విషాద గీతం బాగా వెంటాడేది . జీవితాన్ని బాగా మథించిన వారే అలా రాయగలరు . పాట రచయిత ఎవరా ? అని చూస్తే డాక్టర్ సి నారాయణ రెడ్డి అని తెలిసింది .
***
గత కొన్ని రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో కుటుంబ వ్యవస్థకు కాలం చెల్లింది. భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ ఉండదు అని చాలా మంది ఒక వ్యాసాన్ని షేర్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టీడీపీ , జనసేన కూటమి విజయం సాధించింది . విజేతలు చంద్రబాబు తన కుటుంబంతో ఉన్న ఫోటోలు , పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో పాటు చిరంజీవి కుటుంబంతో ఉన్న ఫోటోలు చూపుతూ, జగన్ తన సోదరిని దూరం పెట్టిన విషయాన్నీ ప్రస్తావిస్తూ, కుటుంబం కలిసి ఉంటే విజయం సాధిస్తారు . విడిపోతే జగన్ లా ఓడిపోతారు అంటూ కుటుంబ విలువల వ్యాసాలు బోలెడు వస్తున్నాయి . విజేతలకు ఎందరో తండ్రులు , పరాజితుడు అనాధ అని ఇంగ్లీషులో ఓ మాట బాగా పాపులర్ .
ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? దూరం పెట్టాలా ? మీడియా ఏం చేయమని చెబుతుంది అంటే ? తండ్రి, కొడుకు, గాడిద కథ గుర్తుందా ? కథతో పాటు రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ఉదంతాలు గుర్తుకు వచ్చాయి .
****
1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ వద్ద చంద్రబాబు స్థానాన్ని లక్ష్మీపార్వతి ఆక్రమించారు . బాబు వందశాతం రాజకీయ నాయకుడు ఐతే లక్ష్మీపార్వతికి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు . చంద్రగిరి నుంచి బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు టికెట్ కోసం ప్రయత్నం . బాబు వద్దు అంటుంటే లక్ష్మీపార్వతి బాబుకు వ్యతిరేకంగా రామ్మూర్తి తమ్ముడికి టికెట్ ఇప్పించడానికి ఎన్టీఆర్ వద్ద పలుకుబడి ఉపయోగించారు .
ఐతే బాబే వ్యూహాత్మకంగా తమ్ముడిని లక్ష్మీపార్వతి దగ్గరకు పంపారు అని ఓ ప్రచారం . అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు . శరీరం అంతా ఎన్టీఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వర రావు , ఎన్టీఆర్ వచ్చేంత వరకు మంగళసూత్రం కట్టని రమేష్ రెడ్డిలు ఎన్టీఆర్ ను వీడి బాబు వద్ద ముందు వరుసలో ఉన్నప్పుడు స్వయంగా బాబు తమ్ముడు బాబు వైపు ఎందుకు ఉండరు … లక్ష్మీపార్వతికి రాజకీయాలు తెలియవు . బాబుకు తెలుసు .
బాబు సీఎం అయిన కొత్తలో నారా రామ్మూర్తి నాయుడు కూడా ఓ వెలుగు వెలిగారు . పనుల కోసం మీడియా వాళ్ళు కూడా రామ్మూర్తిని ప్రసన్నం చేసుకొనేవారు . కొంతకాలం ఆ హవా కొనసాగింది . తరువాత బాబు రామ్మూర్తిని దూరం పెట్టడంతో 2004 ఎన్నికలకు ముందు రామ్మూర్తి నాయుడు వై యస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరారు .
ప్రతి రోజూ తన అన్న చంద్రబాబు వ్యవహారాల గురించి రామ్మూర్తి నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడేవారు . చంద్రగిరి కాంగ్రెస్ టికెట్ రామ్మూర్తికి ఖాయం అనుకున్నారు అంతా . తీరా ఎన్నికల సమయంలో రామ్మూర్తికి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు . ఎందుకంటే .. వై యస్ రాజశేఖర్ రెడ్డి కూడా బాబులానే వంద శాతం రాజకీయ నాయకుడు . రేపు ఏదైనా జరిగితే తమ్ముడు మూర్తి ఎటు పోతాడో రాజకీయ అవగాహన ఉన్నవారు … ఏం జరిగిందో తెలియదు కానీ పదేళ్లు దాటిపోయింది రామ్మూర్తి బయటకు రాక .. అనారోగ్య కారణాలు అని ప్రచారం …
***
చంద్రబాబు , జగన్ ఫొటోలతో విస్తృతంగా ప్రచారం . బాబు కుటుంబంతో కలిసి ఉండడం కుటుంబ విజయంగా ఈ ఎన్నికల విజయాన్ని అభివర్ణిస్తున్నారు . జగన్ సోదరి షర్మిలను దూరం పెట్టడం వల్ల ఓడిపోయారు అని ప్రచారం . ప్రజలకు వేరే పని లేదు , సమస్యలు లేవు . తెలుగు సినిమాల్లో చూపించినట్టు మీ కుటుంబం అంతా ఇలా కలిసి ఉండాలి బాబూ, మాకు ఇంకేం సమస్యలు లేవు అని చెబుతున్నారన్న మాట . తమ ఇంట్లో తిండికి ఉందో లేదో తెలియదు కానీ కుటుంబంను చూసి పులకించారు . జగన్ కుటుంబ ఫోటో కాకుండా ఒంటరి ఫోటో చూసి ఓడించారన్న మాట … హహహ
ఇదే ప్రచారం చేసిన వారు కెసిఆర్ కుటుంబం వల్లనే ఓడిపోయారు అని ప్రచారం చేశారు . కులం , మతంతో పాటు అనేక అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయి . ఒక్కో పార్టీకి కొన్ని కులాల అండ ఉంటుంది . కొంచం ఎక్కువ, తక్కువ కానీ దేశమంతా ఇదే . ఉత్తర్ ప్రదేశ్ లో కులాల కాంబినేషన్ వల్ల బీజేపీ ఓడిపోయింది . ఆంధ్రాలో కూటమి గెలిచింది . కులం, మతంతో పాటు అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి . ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? వద్దా ? అంటే గాడిదపై తండ్రి కొడుకు కూర్చొని ప్రయాణిస్తే బాటసారులు ఏం చెప్పారో మీడియా అదే చెబుతుంది . .కుటుంబం ఉంటే వద్దు అంటుంది . కుటుంబం లేకపోతే ఉండాలి అంటుంది .
రాజకీయం ఓ వ్యాపారం . బ్యాంకులో దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ రూపంలో సాధారణ ఆదాయం వస్తుంది . స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువ, ఆదాయం అంతకన్నా ఎక్కువ . రాజకీయ వ్యాపారం చాలా రిస్క్, ఆదాయం కూడా అంతే . స్టాక్ మార్కెట్ లో కరోనా లాంటి ఉపద్రవం వస్తే మార్కెట్ క్రాష్ అవుతుంది . ఐనా ఆరు నెలల్లో కోలుకుంటుంది . రాజకీయ వ్యాపారంలో క్రాష్ వస్తే కోలుకోవడానికి ఐదేళ్లు పడుతుంది . రిస్క్ తో పాటు ఆదాయం అదే స్థాయిలో ఉంటుంది . రిస్క్ హై తో ఇష్క్ హై అని సినిమాలో హర్షద్ మెహతా డైలాగు బాగా పాపులర్ …
**
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత షర్మిల కామెంట్ కోసం ఆసక్తిగా అక్కడక్కడా చెక్ చేసి చూస్తే కనిపించలేదు . ఒకవేళ కామెంట్ చేసి ఉంటే గూగుల్ లో దొరుకుతుంది కదా అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ లో కనిపించింది . తను పాదయాత్ర చేసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా రక్షించింది సుదీర్ఘంగా చెబుతూ పోతున్నారు . ఫలితాల మీద చెప్పడం లేదు . ఇక వినలేక వదిలేశాను . షర్మిల టీడీపీ మీడియాలో రోజూ మొదటి పేజీ ఆక్రమించేవారు . ఫలితాలు వచ్చాయి . టీడీపీ గెలిచింది. అంతే, ఇక… ఆమె కామెంట్ గూగుల్ లో సెర్చ్ చేస్తే తప్ప దొరకడం లేదు .
షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రాలో ఉన్న ఓ మిత్రుడితో చర్చ… ఆమెకు 15 సీట్లు వస్తాయి . కింగ్ మేకర్లే అవుతారు అని అంటే . ఆమె పోటీ చేయరు , చేసినా ఒక్క చోట గట్టి పోటీ ఇస్తారు అన్నాను . ఇదే ఫేస్ బుక్ లో రాస్తే వైయస్ ఆర్ పార్టీ అభిమానులు మాటల దాడి , ఒకరు మెసెంజర్ లో ఫోన్ చేసి దాడి . పాలేరు బిడ్డను అంటూ చివరి నిమిషంలో చేతులు ఎత్తేసి ఆంధ్రాలో తేలి.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తాను అన్నారు . బాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు …
ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు . తెలంగాణలో బి ఆర్ యస్ కు వ్యతిరేకంగా , ఆంధ్రాలో వై యస్ ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా న్యూ సెన్స్ క్రియేట్ చేయడంలో షర్మిల విజయం సాధించారు . కేఏ పాల్ మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి, నాకు నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి అని చెప్పిన మీడియా సమావేశంలో సైతం కనీసం పాతిక మీడియా లోగోలు ఉన్నాయి . నాలుగు ఓట్లు రాకపోయినా పాల్ మాట్లాడితే పాతిక ఛానల్స్ వస్తాయి . రాజకీయాల్లో కొన్ని పాత్రలకు న్యూ సెన్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది . రాజకీయం వ్యాపారం . ఎవరికి లాభసాటి అనుకున్న రీతిలో వాళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తారు . రాజకీయం వ్యాపారం అయితే మీడియా ? పెద్ద పరిశ్రమకు అనుబంధంగా కొన్ని చిన్న పరిశ్రమలు ఉంటాయి .
2004 లో చంద్రబాబు ఓడిపోయాక సత్యం పెద్ద క్యాంపస్ ఒకటి ప్రారంభోత్సవం . టీడీపీలో రాధాకృష్ణ అని కార్యాలయ కార్యదర్శి ఉండేవారు . సత్యం క్యాంపస్ ప్రారంభోత్సవమప్పుడు రాధాకృష్ణ బాధపడుతూ – ఆ క్యాంపస్ కు స్థలం ఇచ్చింది , సౌకర్యాలు కల్పించింది చంద్రబాబు – చూడు మనుషులు ఎలా ఉంటారు .. బాబును కనీసం పిలువలేదు, వై యస్ ఆర్ ను పిలిచారు అని బాధ పడ్డారు . సత్యంకు స్థలం ఇచ్చింది సీఎం , ప్రారంభోత్సవానికి పిలిచింది సీఎంను … దీనికి బాబు, వైయస్ ఆర్ కు సంబంధం లేదు . సీఎం పోస్ట్ తోనే సంబంధం అని చెప్పాను . సత్యం, బాబు , జగన్ రామ్మూర్తి నాయుడు , షర్మిల అనుబంధాలు ఉత్త ట్రాష్ . రాజకీయమే వాస్తవం .
*****
ఉదయం స్టాక్ మార్కెట్ చూస్తే కాస్త ఎరుపులో ఉంది … బాధపడడం ఎందుకు అని సెల్ పక్కన పెట్టి ఇది రాయడం మొదలు పెట్టాను … రాయడం పూర్తయ్యాక చూస్తే ఆకు పచ్చ రంగులో మార్కెట్ వెలిగి పోతోంది .. ఓ మార్కెట్ నిపుణుడు చెప్పినట్టు మనిషి అయినా , మార్కెట్ ఇండెక్స్ అయినా అంతిమంగా పైకి వెళ్లాల్సిందే … బుద్దా మురళి
Share this Article