.
ప్రసిద్ధ జర్నలిస్టులు అనిపించుకుంటున్న వాళ్ల ఆలోచనలు, రాతలు కూడా కొన్నిసార్లు విభ్రమను కలిగిస్తాయి… కరణ్ థాపర్ రాసే వ్యాసాలు కూడా కొన్నిసార్లు తేడా అనిపిస్తాయి… సాక్షిలో ఓ గెస్ట్ కాలమ్ ఇలాంటి ఆశ్చర్యాన్నే కలిగించింది…
అప్పట్లో ముంబై రైలు పేలుళ్లు తెలుసు కదా… ఉగ్రవాద చర్య… అనేక మంది మరణించారు, గాయపడ్డారు, జీవచ్ఛవాలు అయ్యారు… ఆ బాధితుల మీద కించిత్ సానుభూతి లేదు గానీ… ఆ కేసులో నిందితుల మీద మాత్రం ఎనలేని సానుభూతిని ప్రదర్శించడమే కాదు…
Ads
వాళ్లు తమ జీవితాల్ని కోల్పోయారు, క్షమాపణ చెప్పాలి… ప్రాసిక్యూషనా..? న్యాయవ్యవస్థా, ప్రభుత్వమా..? ఎవరైనా సరే… అంతేకాదు, ఆర్థిక పరిహారం కూడా ఇవ్వాలి అంటున్నాడు… ఎందుకయ్యా అంటే..? రీసెంటుగా బాంబై హైకోర్టు వాళ్ల నేరాన్ని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయిందని చెబుతూ వాళ్లను వదిలేసింది…
అదుగో, ఇన్నేళ్లు వాళ్లను అన్యాయంగా జైళ్లలో కుక్కి, వాళ్ల జీవితాల్ని నాశనం చేశారనేది కరణ్ థాపర్ ఆరోపణ… అందుకని జాతి క్షమాపణ చెప్పాలా థాపర్..? ఇది చాన్నాళ్లు ఉండే అపరాధ భావనా..? ఎలా..? మానని గాయమా..? ఎలా..?
20 ఏళ్లు వాళ్లు పిల్లలకు, సమాజానికి, తల్లిదండ్రులకు, మిత్రులకు దూరం చేశాం, ప్రాయశ్చిత్తం ఎలా అంటున్నావు గానీ… మరి ఆ ఉగ్రచర్యలో హతుల కుటుంబాలు, బాధితుల కుటుంబాలు, జీవితాల మాటేమిటి..? వీళ్లకు క్షమాపణ చెబుదాం సరే, మరి వాళ్ల సంగతేమిటి..? అదెందుకు మాట్లాడవు..?
1) అనేక సాక్ష్యాధారాల్ని పరిశీలించి, విచారణ జరిపి, ఇరువైపులా వాదనలు విన్నాక ట్రయల్ కోర్టు వాళ్లను దోషులుగా నిర్దారించింది అనే విషయం గుర్తుందా..?
2) హైకోర్టు కూడా ప్రాసిక్యూషన్ వాళ్ల దోషాన్ని నిరూపణ చేయడంలో విఫలమైంది అని చెప్పింది తప్ప వాళ్లు నిర్దోషులు అనలేదు… తేడా ఉంది…
3) సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది… కాకపోతే వాళ్లెవరినీ మళ్లీ అరెస్టు చేయకూడదని చెప్పింది… హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది… మరి సుప్రీంకోర్టు హైకోర్టు భిన్నంగా తీర్పు చెబితే..?
4) ఇప్పుడే జాతి వాళ్లకు క్షమాపణలు చెబితే, ఆనక సుప్రీం భిన్నమైన తీర్పు వెలువరిస్తే ఏం చేయాలి మిస్టర్ థాపర్..?
… నిజానికి తాము చేసిన నేరాలకు పడే శిక్షలకన్నా ఎక్కువ కాలం జైళ్లలో మగ్గుతున్నవాళ్లు వేలాది మంది… అంతెందుకు..? కోర్టుల్లో చార్జి షీట్లు వేయక, విచారణలకు హాజరు పరచక, లాయర్లను పెట్టుకోలేక… ఏళ్లకేళ్లు జైళ్లలోనే మగ్గి, అనారోగ్యాలపాలై, తరువాత ఏ ముసలి వయస్సులోనే విడుదలైన బాధితుల కథలూ బోలెడు వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి…
వాళ్ల తరఫున ఒక్క మాట ఎప్పుడైనా రాశావా థాపర్..? ఆ లోపాలు, ఆ శాపాలు కదా పరిహరించాల్సింది మన వ్యవస్థ…? మనం సిగ్గుచేటు అని చెప్పుకోవాల్సిన జాబితాలో ఆ బాధితులు లేరా..? ఉండకూడదా..? కోర్టుకోర్టుకూ తీర్పు వేరే ఉండొచ్చు… హైకోర్టు తీర్పే అంతిమం అనే ముద్ర దేనికి..? సుప్రీంలో కేసు ఉన్నప్పుడు, సబ్ జుడిస్‌గా ఓ అభిప్రాయాన్ని ప్రోది చేయడం దేనికి..?!
Share this Article