అక్షరాలా నిజం… ఈ దేశంలో అన్నదాత ప్రాణాలకు విలువ లేదు, తన కష్టానికి గిట్టుబాటు లేదు… తన బతుకంటే ఎవడికీ గుర్తింపు లేదు… పోరాడాల్సిందే… కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం నిజంగా మొన్నటి చట్టాలపైనేనా..? లేక స్థూలంగా రైతు సమస్యలపైనా..? అలాగైతే సమాజంలోని అన్ని సెక్సన్లూ మద్దతు పలకాల్సిందే… కానీ నాణేనికి మరోవైపు చూడలేకపోతున్నామా..? అవును, కేవలం రైతు సమస్యల మీద కాదు… అది రాజకీయాలు మిళితమై సాగుతున్నట్టుగా ఉంది ఆందోళన… తన పంటను రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే కొత్త వ్యవసాయ చట్టాల్లోని అంశం రైతులకు మేలు చేసేదే… పైగా కనీస మద్దతు ధర గానీ, వ్యవసాయ మార్కెట్ల ఎత్తివేత గానీ ఆ చట్టాల్లో లేవు… సరే, ఇప్పుడు ఆ చర్చలోకి వద్దు గానీ… క్రమేపీ ఢిల్లీ చుట్టూ మొహరించిన రైతు శ్రేణుల పోరాటం ఎటువైపు వెళ్తోంది..? ఎవరు ఈ ఆందోళనల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు..? అదీ ఆలోచించాల్సిన పాయింట్…
ఎందుకంటే… అక్కడక్కడా ఖలిస్థాన్ బ్యానర్లు, యాంటీ పౌరసత్వచట్టం ప్లకార్డులు కనిపిస్తూ…, అవే నినాదాలు వినిపిస్తూ… ఆర్టికల్ 370 ఎత్తివేత, ఇమ్రాన్ హమారా దోస్త్ వంటి కేకలు… మరీ కొన్నిచోట్ల ‘ఇందిరకే పాఠం చెప్పాం, మోడీకి చెప్పలేమా’ అనే స్లోగన్స్ వినిపిస్తూ… కాస్త అదుపు తప్పుతున్నట్టే కనిపిస్తోంది… పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదే ఉంది… అక్కడ రాజకీయాల్లో సెగ మొదలైంది… ఆల్రెడీ అంతకుముందు రాజకీయంగా చేదు అనుభవాలు మూటగట్టుకున్న అకాలీదళ్ ఇదే అదునుగా మోడీని, అనగా ఎన్డీయేను విడిచిపెట్టేసి, రైతు పోరాటాల్లో దిగింది…
Ads
రైతుల పోరాటం మెల్లిమెల్లిగా కాస్తా సిక్కుల జాతి పోరాటంగా మారుతోందా..? పోనీ, కొన్ని శక్తులు అలా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా..? ఇదే అదునుగా యాంటీ -మోడీ పార్టీలు, భక్తులు సంఘీభావం తెలిపి, ఈ పోరాటాల్లో కలిసిపోయారా..? అచ్చం, ఆమధ్య ఢిల్లీలో రోజుల తరబడీ సాగిన పౌరసత్వ చట్ట వ్యతిరేక పోరాటం యాంటీ -మోడీ పోరాటంగా ఎలా మార్చారో చూశాం కదా… ఎక్కడ చాన్స్ దొరికితే చాలు, దొరక్కపోయినా దొరికించుకుని మరీ… యాంటీ- బీజేపీ ఉద్యమాల్ని నిర్మించడానికి ఢిల్లీ ఓ వేదికగా మారింది… ఇవన్నీ నిర్హేతుకమైన సందేహాలు ఏమీ కావు… యాంటీ-బీజేపీ రాజకీయ శక్తుల సమీకరణ కూడా తప్పుకాదు… రాజకీయాల్లో ఇవన్నీ పరిపాటే… కానీ…
ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు సాగుతుంటే… టర్కీలు, పాకిస్థాన్లు, మలేషియాలు మద్దతు ప్రకటిస్తాయి… ఇప్పుడు రైతుల పోరాటానికి కెనడా ప్రధాని ట్రూడా, బ్రిటిష్ ఎంపీలు మద్దతు ప్రకటిస్తారు… ఎందుకంటే, అక్కడ సిక్కుల జనాభా ఎక్కువ కాబట్టి, ట్రూడా కేబినెట్లో కూడా సిక్కు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి…! పాత ఖలిస్థాన్ మద్దతుదార్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నారు కాబట్టి… యాంటీ-మోడీ, యాంటీ-బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని కాస్త సిక్కుల జాతి ఉద్యమంగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయా…? టీవీ డిబేట్లలోనూ ఈ ప్రస్తావనలు వస్తున్నయ్…
అవార్డుల వాపసీ, ప్రభుత్వ ఉపేక్ష- జాతి సమగ్రతకే ప్రమాదకరం అనే పిలుపులు… ఇవన్నీ ఏదో తేడా కొడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి… ఢిల్లీకి పాలు, కూరగాయలు, ధాన్యాలు, సరుకులు అన్నీ వచ్చేవి పంజాబ్, హర్యానాల నుంచే… చివరకు ఢిల్లీ పరిసరాల్లో పంటల అవశేషాలు కాలబెడితే ఆ కాలుష్యంతో తల్లడిల్లేది కూడా ఢిల్లీయే… అసలు ఢిల్లీ అంటేనే పంజాబ్, హర్యానావాసులు… కల్చర్, వ్యాపారాలు, ఇండస్ట్రీలు ఎక్కువగా వాళ్లే… అందుకే రైతు ముట్టడి ఉధృతి కనిపిస్తోంది… లక్షల మందిని సమీకరించడం అక్కడ సుసాధ్యమైంది… వేరే రాష్ట్రాల్లో ఇవే చట్టాల మీద చడీచప్పుడూ లేదు… మొన్నటి కేంద్ర చట్టాల మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఈ పోరాటాలు లేవు… రైతులు బజారుకెక్కడం లేదు…
ఎలాగూ యాంటీ-బీజేపీ కాబట్టి కేజ్రీవాల్ వాళ్లకే మద్దతు… పైగా శాంతి భద్రతలు తన ప్రభుత్వం పని కాదు కదా… అది కేంద్రం పరిధిలోనిది… ఈ పోరాటంలో ఎవరిది పైచేయో నిరూపించుకునే ఎత్తుగడల్లో రాజకీయ పార్టీలు… సో, దీంతో సమస్య జటిలమైపోతోంది… కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్థమవుతోంది కానీ… సామ, దాన, భేద, దండోపాయాల్లో దేన్నీ సమర్థంగా ప్రయోగించలేని పరిస్థితి… ఎందుకంటే..? రైతుల పేరిట సాగుతున్న ఉద్యమం కాబట్టి…! చివరకు ఇది ఏ టర్న్ తీసుకోనుందనేది అసలైన ఆందోళన కలిగించే అంశం…
Share this Article