దాదాపు అన్ని మతాల్లోనూ దేవుడి పేరిట ఉపవాసం చేస్తారు. అయితే, ఈ ఉపవాసాల వెనుక ఉన్న సైన్స్ ని 2016 వరకు ఎవరూ శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. ఉపవాసం యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యతను గుర్తించడం చాలా ఆలస్యంగా జరిగింది.
2016 ముందు వరకు, ఎందుకూ పనికిరాని ఉపవాసాలు ఎందుకు? దేవుడు లేడు, గీవుడు లేడు. ఛస్ ఉపవాసం ఒక చెత్త, పరమ రోత, ఎందుకూ పనికిరాని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. ఉపవాసం ఒక మూర్ఖత్వం, అది ఒక మూఢ నమ్మకం అని కొందరి అభిప్రాయం… నిజానికి గ్రంధాల్లో ఉంది కానీ శాస్త్రీయంగా ఎవరూ నిరూపణ చేయలేదు కాబట్టి ఆ వాదనతో నేనూ ఏకీభవించకపోయినా, పూర్తిగా ఉపవాసాన్ని నేను అంగీకరించను. కారణం, నేను సైన్స్ విద్యార్థిని. చికాగో, అమెరికాలో Ph.D లో జీవక్రియల మీద 4.5 సంవత్సరాలు పరిశోధనలు చేసినవాడిని. నిరూపణ అయిన దానినే నేను అంగీకరిస్తాను, అది నా వృత్తి ధర్మం.
అయితే, 2016లో జపాన్‌కు చెందిన సెల్ బయాలజిస్ట్ యొషినోరి ఒహ్సుమి ఉపవాసం ద్వారా శరీరంలో ఆటోఫాగీ ప్రక్రియ జరుగుతుందని, దాని వల్ల కణాలు తమలోని చెడిపోయిన లేదా అనవసరమైన భాగాలను శుద్ధి చేయడం లేదా నిర్మూలించడం జరుగుతుందని కనిపెట్టారు. ఇందుకు శాస్త్రవేత్త యొషినోరి ఒహ్సుమికి వైద్య విభాగంలో నోబెల్ బహుమతి లభించింది.
Ads
నిజానికి ఈ శతాబ్దంలో గొప్ప ఆవిష్కరణ యాపిల్ ఫోన్ కనిపెట్టడం లేదా కంప్యూటర్ కనిపెట్టడం కాదు. ఆ శతాబ్దం మాత్రమే కాకుండా, భూమి మీద జీవం పుట్టిన దగ్గర నుంచి శాస్త్రవేత్తలు చేసిన అత్యంత గొప్ప ఆవిష్కరణ అంటే, ఉపవాసం వెనక ఉన్న ఆటోఫాగీ ప్రక్రియని కనిపెట్టడం. ఇది శరీర కణాల శుద్ధి మరియు ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన ప్రక్రియ. ఈ ఆవిష్కరణ యొషినోరి ఒహ్సుమి కృషికి కృతజ్ఞతగా నిలుస్తుంది, మరియు శాస్త్రీయ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది.
నాకు తెలిసి, మానవ ఆరోగ్యానికి సంబంధించిన ఆవిష్కరణల్లో దీనికి మించినది ఇప్పటివరకు నేను చూడలేదు. యొషినోరి ఒహ్సుమి చేసిన ఈ ఆవిష్కరణ, ఆటోఫాగీ ప్రక్రియ, మానవ ఆరోగ్యానికి విప్లవాత్మకమైన మార్గం చూపింది. మన శరీరం లోని కణాలు ఆరోగ్యం గా ఉంటే మనం ఆరోగ్యం గా ఉంటాము. అవి సరిగ్గా పనిచేయకపోయినా, కణాల్లో ఏవైనా సమస్యలు ఉన్నా మన ఆరోగ్యం పాడు అవుతుంది. మన కణాలని మన శరీరమే శుద్ది చేసే ప్రక్రియ ఉపవాసం ద్వారా జరుగుతుంది. ఇంకా రాత్రి తొందరగా భోజనం చేస్తే జీర్ణక్రియ ప్రక్రియ త్వరగా జరిగి ఆ తర్వాత మన శరీరం లోని కణాలే మన శరీరం లోపల అంతా శుభ్రం చేస్తాయి, ఇదే ఆటో ఫాగీ.
మన పూర్వికులు, పెద్దలు ఎందుకు ఉపవాసం చేయమన్నారో, వివిధ మతాల్లో ఎందుకు ఉపవాసాన్ని జోడించారో ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతోంది. మతాల్లో ఉన్న అనేక విషయాలు శాస్త్రీయంగా నిరూపించినట్లు అనిపిస్తుంది. అయితే, ఈ నిరూపణ ఎక్కడా మతాలను, మత గ్రంథాలను ప్రస్తావించకుండా, ఉపవాసం వల్ల కలిగే లాభాలను మాత్రమే వెల్లడించింది.
ఈ శాస్త్రీయ ఆధారం ద్వారా మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, ఉపవాసం వంటి వాటికి ఉన్న ఆరోగ్యకారక ప్రయోజనాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఏది ఏమైనా, నా చిన్నప్పుడు నేను ఒక మాట విన్నాను: “రోడ్డు పక్కన గుడిసెల్లో ఉండేవాళ్ళు, ఊరి చివర గుడిసెల్లో ఉండేవాళ్ళు ఏమి పోషక ఆహారం తింటారు? వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు?” ఆ తర్వాత అమెరికాలో ఉన్న 7-8 సంవత్సరాలలో ఇంకో మాట విన్నాను: “ఈ అమెరికా, కెనడా ఇంకా పాశ్చాత్యులు ఎప్పుడూ బీర్, వైన్ లాంటి ఆల్కహాల్ తాగుతారు. ఇంకా ఎక్కువగా మాంసం తింటారు, కానీ వీళ్ళు భారతీయుల కంటే కొంచెం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ కాలం ఎలా బతుకుతున్నారు?” ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉండేటప్పుడు ఇంకో మాట విన్నాను: “ఊర్లల్లో ఉండేవాళ్ళు సిటీ వాళ్ళ కంటే పోషక ఆహారం ఏమీ తినరు, కానీ ఎలా కొంచెం ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు?”
ఈ మూడింటికి సమాధానం: గుడిసెల్లో ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు, మన ఊర్లల్లో ఉండేవాళ్ళు సాయంత్రం 7 లోపే రాత్రి భోజనం తింటారు. ఇదే వాళ్ళ ఆరోగ్య యొక్క ప్రధాన విజయ రహస్యం.
రాత్రి 7 లోపే డిన్నర్ చేయడం వల్ల ఎంజైములు, హార్మోన్లు సక్రమంగా ఉత్పత్తి అవుతూ, ఆ తర్వాత 2-3 గంటలకే జీర్ణక్రియ పూర్తవుతుంది. రాత్రి 9 లేదా 10 కి జీర్ణక్రియ ప్రక్రియ ఆగిపోయి, ఆటోఫాగీ ప్రారంభమవుతుంది. అంటే, మన శరీరంలోని కణాలు లోపల అన్నీ శుభ్రం చేస్తాయి, చెడిపోయిన కణాలను బాగుచేస్తాయి లేదా నిర్మూలిస్తాయి. ఇంకా, కణాలు రీఛార్జ్ అవుతాయి. రాత్రి 9 లేదా 10 కి తింటే, రాత్రి వేళల్లో ఎంజైముల ఉత్పత్తి తక్కువగా ఉండి, జీర్ణక్రియ లేట్‌గా జరిగి తెల్లవారుజామున 3 లేదా 4 వరకు కొనసాగుతుంది. లోపల కణాలు రిపేర్ అవ్వడానికి తక్కువ సమయం ఉంటుంది. అందుకే రోగాలు ఎక్కువ వస్తాయి.
ఉపవాసం ఉన్నప్పుడు, ఈ ఆటోఫాగీ ప్రక్రియ 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా జరిగి ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉపవాసం లేదా తొందరగా డిన్నర్ చేయడం వల్ల మన శరీరంలో జరిగే ఆటోఫాగీ ప్రక్రియను కనిపెట్టడమే ఈ శతాబ్దం మాత్రమే కాదు, భూమి మీద జీవం పుట్టిన దగ్గర నుండి అత్యంత గొప్ప ఆవిష్కరణ అని చెప్పవచ్చు.
మతాల్లోని వివిధ విషయాలను సైన్స్ ద్వారా నిరూపించడం లేదా వివరణ చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఇది ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంలో మరియు వాస్తవాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ విధంగా మతం మరియు సైన్స్ మధ్య సంభాషణ జరుగుతుంది, మరియు కొత్త సమాజంలో ప్రజల అర్థనల్ని విస్తరించడంలో సహాయపడుతుంది.
ఇది ప్రజల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించడానికి మరియు వాస్తవాలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడంలో ఒక మంచి పరిణామం అవుతుంది.
చివరిగా ఒక మాట: సనాతనమైనా చెడు ఉంటే సరిదిద్దుకోవాలి, ఆధునికమైనా మంచి ఉంటే స్వీకరించాలి. ఇంకా, మతాల్లో ఉన్న అనేక విషయాలను సైన్స్ ద్వారా నిరూపించడం అవసరం. సైన్స్ ద్వారా మనం వాస్తవాలను అర్థం చేసుకుని, సమాజంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ఈ విధంగా, సనాతన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞానం సమన్వయం చేసుకోవడం ద్వారా మన అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయి…. [ జగన్నాథ్ గౌడ్ ]
Share this Article