నిజానికి ఇది రాయడానికి విశేష సందర్భం ఏమీలేదు, పనికట్టుకుని రాసిందీ కాదు… ఒకప్పటి నిర్మాత కాట్రగడ్డ మురారి రాసుకున్న బయోగ్రఫీ ‘నవ్విపోదురుగాక’ పుస్తకం మరోసారి తిరగేస్తుంటే… ఈ ఎపిసోడ్ దగ్గర చాలాసేపు మనం ఆగిపోతాం… మథనంలో పడిపోతాం… మనం చదువుకున్న చరిత్ర మీద మనమే సందేహంలో ఇరుక్కుపోతాం… ఇది గాంధీ కొడుకు కథ… గాంధీ కథతో పోలిస్తే నిజానికి తన కొడుకుది కథే కాదు… పైగా భ్రష్ట జీవితం… అయితే అలా మారడానికి తండ్రే కారణమా..? జాతికే పితగా కీర్తించబడిన ఓ వ్యక్తి ఓ ‘మంచి పిత’ కాలేకపోయాడా..? అదీ ఆశ్చర్యమేసేది… నో డౌట్, గాంధీ చాలా విషయాల్లో గొప్పోడు… కానీ మరీ ఎక్కువ గొప్పదనం ఆపాదించబడిన వ్యక్తా..? చిన్నప్పటి నుంచీ చదివించబడుతున్న ఆయన కథలో మరీ అతిశయోక్తులు అల్లబడ్డాయా..? సొంత కొడుక్కే న్యాయం చేయలేనివాడు తనెలా గొప్పవాడు అనాలా..? లక్ష్యసాధన దిశలో కుటుంబాన్ని కూడా పట్టించుకోని గొప్పవాడు అనాలా..?
అసలు ఈ మథనం కాదు… ఇతర దేశాల్లో తాము జాతిఘనులుగా కీర్తించే నాయకుల చీకటి పార్శ్యాలను కూడా చర్చించుకుంటారు… పుస్తకాలు వేస్తారు… సినిమాలు తీస్తారు… మిరుమిట్లు గొలిపే ఒక గొప్ప జీవితం వెనుక కనిపించిన చీకటి చారికలు ఉండకూడదని ఏముంది..? ఈరోజు కీర్తించబడిన హీరోలు రేప్పొద్దున అలాగే జాతిహీరోలుగా ఉంటారనే నమ్మకం ఏమీ లేదు… అంతటి రష్యాలో లెనిన్ విగ్రహ విధ్వంసాల విషాదాలు చదివాం కదా… నవ్వొచ్చేది ఏమిటంటే..? ఈరోజు సొంత మీడియా ఉండి, పుష్కలంగా డబ్బు ఉండి, అధికారం ఉండి భారీ డప్పులు కొట్టించుకుంటున్న నాయకులు, హీరోలు, స్వాములు, ధనిక వ్యాపారుల అసలు తత్వాలు, చీకటి పొరలు ఎప్పుడో ఓసారి, వాళ్ల మరణానంతరమైనా బయటికి రావా..? సమాజం చర్చించుకోదా..? పథకాలకు సొంత పేర్లు, రోజూ టీవీ తెరలపై భజనలు, పత్రికల్లో కీర్తనలు, సోషల్ గ్రూపులతో సమారాధనలు నిజంగా నాయకుల్నినిజ హీరోల్ని చేయగలవా..? అలాగే ఉంచగలవా..? అంతటి గాంధీ చరిత్ర పుస్తకంలోనే మకిలిపట్టిన పేజీలు కనిపిస్తుంటే… ఇక ఇప్పటి చిల్లరదేవుళ్లు ఎంత..?
Ads
గాంధీ కొడుకు విషయానికి వస్తే… పేరు హరిలాల్… తండ్రి బారిష్టర్ చదువు కోసం లండన్ వెళ్లొచ్చాక తనూ వెళ్లాలనుకుంటాడు హరి… గాంధీ వద్దంటాడు… హరిలాల్ కూడా స్వాతంత్ర్య సమరయోధుడే… ఏడెనిమిదిసార్లు జైలుకు వెళ్లాడు… తెలివైనవాడు… లండన్ ప్రయాణం వద్దనడంతో ఇద్దరి నడుమ దూరం స్టార్టవుతుంది… కుటుంబానికి దూరం అయిపోతుంటాడు… ఐదుగురు పిల్లలు, చిన్న వయస్సులోనే భార్య మరణిస్తే, తన మరదలైన బాలవితంతువును పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు, అదీ వీలు కాదు… తాగుడుకు అలవాటవుతాడు… వ్యభిచారులు, ఎటెటో తిరుగుతుంటాడు… గాంధీ వారసత్వపు ఆస్తిని తన కొడుకులకు గాకుండా ఇంకెవరికో రాసిస్తాడు… పూర్వీకుల ఆస్తిపై తన హక్కు కోసం హరిలాల్ కోర్టులో కేసు వేయాలని అనుకుంటాడు… కానీ తండ్రి పేరు చెడగొట్టలేక, అలాగని ఊరుకోలేక సతమతం అవుతాడు, టీబీ బారిన పడతాడు… తండ్రి మరణించాక ఆరు నెలలకు తనూ మరణిస్తాడు… ఇక్కడే కొన్ని ఎపిసోడ్లు మనల్ని కదిలిస్తాయి…
తండ్రి అంత్యక్రియలకు హాజరవుతాడు, నిజానికి తనే పెద్ద కొడుకుగా కొరివి పెట్టాలి… ఓ పూలమాల తీసుకుని, అంత్యక్రియల దగ్గరకు వెళ్లి దూరంగా నిలుచుంటాడు… కానీ ‘‘పెద్ద పెద్ద నాయకుల ముందు ఈ తాగుబోతు కనిపిస్తే మర్యాదగా ఉండదు’’ అంటూ తనను చితి వద్దకు కూడా రానివ్వరు… చితి కాలిపోయాక వెతికితే తను కనిపించడు… అంతకుముందే తను ఓసారి ఇస్లాంలోకి మారి అబ్దుల్లా గాంధీ అని పేరు మార్చుకుంటాడు… తరువాత తల్లి కోరిక మేరకు ఘర్ వాపసీ అయిపోయి హీరాలాల్ అని పేరు పెట్టుకుంటాడు… తన మరణం కూడా ఓ విషాదమే… ఎక్కడో వేశ్యావాటిక దగ్గర పడిపోతాడు… ఎవరో హాస్పిటల్‌లో చేరుస్తారు… తను గాంధీ కొడుకని ఎవరికీ తెలియదు… ఒక వేశ్య సమాచారం అందిస్తే ఇద్దరు ముగ్గురు బంధువులు హాస్పిటల్‌కు వెళ్తారు…
రిపోర్టులో పేషెంట్ పేరు హరిలాల్ అనీ, తండ్రి పేరు దగ్గర ఎం.గాంధీ అని రాసి ఉంటుంది… నలుగురైదుగురు బంధువులు తీసుకెళ్లి దహనం చేస్తారు… అనామకుడిగా, రహస్యంగా ఈ లోకం నుంచి పంపించేస్తారు… తండ్రి మరణిస్తే లక్షల మంది… కొడుకు మరణిస్తే ఓ అనాథశవదహనం… ఎంత కంట్రాస్టు..? జాతి మొత్తం ప్రేమించిన గాంధీని సొంత కొడుకు జీవితాంతం ద్వేషించాడు… మాట్లాడలేదు… ఎవరిది తప్పు..? అసలు మనిషి లైఫ్‌ను మించిన మెలోడ్రామా కల్పనాత్మక సాహిత్యంలో సాధ్యమా..? ఇప్పటితరంలో ఎందరికి తెలుసు ఈ నిజాలు…? ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఏముంది..? ఫాయిదా ఏముంది అంటారా..? వెలుగునీడలు సమగ్రంగా ఆవిష్కరింపబడితేనే, బయటపడితేనే కదా అసలు చరిత్ర..!!
Share this Article