.
( కొంటికర్ల రమణ
) ….. 1970ల చివర్లో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఓ యువకుడు ఓ 3 వేల రూపాయల అప్పు చేసి.. ట్రైనెక్కి ముంబైకి చేరుకున్నాడు. ఆంగ్ల సాహిత్యంలో పట్టా ఉన్న తను ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలని బయల్దేరాడు. వెళ్లగానే, పొట్టగడవాలి కాబట్టి ఓ ఉద్యోగమైతే ఉండాలి.
కాబట్టి, కష్టపడితే నెలకు 350 రూపాయలకు ఓ ఉద్యోగమైతే దొరికింది. కానీ, తాననుకున్న చోట్లకు తిరగాలంటే బస్సునో, ట్రైన్ నో ఆశ్రయించాల్సిందే కాబట్టి.. ఆ వచ్చే 350లో భోజనానికి మిగిలేవి ఓ రూపాయో, రెండు రూపాయలో. మిసల్ పావ్, బటాటా వడలే అప్పుడతడి డెయిలీ ఫుడ్. సిగరెట్ కాలుద్దామన్నా పైసలుండేవి కావు.
Ads
దాంతో ఉన్నదాంట్లో బీడీలతో సరిపెట్టుకునేవాడు. అలా ఉద్యోగం కోసం బతుకుపోరాటం చేసి కనాకష్టంగా సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గిన వ్యక్తి పేరు శామ్ కౌశల్ అయితే… ఇప్పుడు 800 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టిన సినిమాలో హీరో ఆయన కొడుకు విక్కీ కౌశల్.
శామ్ కౌశల్ స్టోరీ మొత్తం పెయిన్ ఫుల్. ఆకలి కేకలతో ముంబై రోడ్లపై గడిపాడు. ఎక్కడికెళ్లినా తిరస్కరించబడ్డాడు. కానీ, పట్టు మాత్రం వదల్లేదు. ఆ తర్వాత ఆయనే బాలీవుడ్ టాప్ మోస్ట్ యాక్షన్ డైరెక్టర్ స్థాయికెదిగాడు. తనకు ఇష్టం లేకుండానే సినీ ఇండస్ట్రీ వైపు రావల్సి వచ్చింది శామ్ కౌశల్ కు.
పంజాబ్ లో మాస్టర్స్ పూర్తి చేసిన శామ్ కౌశల్.. ముందు లెక్చరర్ కావాలని కలలు కన్నాడు. కానీ, కుటుంబం పేదరికమనుభవిస్తోంది. ఏదో ఒక ఉద్యోగం చేయకుంటే వెళ్లే పరిస్థితుల్లేవు. అదిగో అలాంటి సమయంలో ముంబైకి పయనమయ్యాడు.
చెంబూర్ లో సేల్స్ మ్యాన్ గా ఓ ఉద్యోగం లభించింది. 350 రూపాయలు జీతం. కానీ, అది కూడా చేజారిపోయింది. ఒక ఏడాదిపాటు అష్టకష్టాలనుభవించాడు. ఇక ఉద్యోగం చేయొద్దని.. చేస్తేగీస్తే ఏదైనా పెద్దగానే చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ముంబైని వదలొద్దనీ సంకల్పించుకున్నాడు.
శామ్ ను ఒక అవకాశం తలుపు తట్టింది. స్టంట్ మెన్ గా పనిచేస్తున్న కొందరు పంజాబీ దోస్తులు ఆయనకు ముంబైలో తగిలారు. తన బాధ చెప్పుకున్నాడు. తమ యూనియన్ లో చేరమని వారు సలహా ఇచ్చారు. కానీ, ప్రవేశ రుసుం వెయ్యి రూపాయలు. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన శామ్ వద్ద అంత డబ్బు లేదు. దాంతో కొందరు స్నేహితులు కలిసి ఆయనకు సాయం చేశారు. అలా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు శామ్ కౌశల్.
ప్రస్తుత బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగణ్ తండ్రి.. అప్పటి ప్రసిద్ధ యాక్షన్ డైరెక్టరైన వీరు దేవగణ్ ను కలిశాడు శామ్. కౌశల్ వీరు వీరు దేవగణ్ కు నచ్చింది. ఇద్దరూ కనెక్టయ్యారు. అలా వీరు దేవగణ్ వద్ద సహాయకుడిగా స్టంట్ మాస్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు. మొదట్లో ఛాయలు తేవడం, బ్యాగులు మోసుకెళ్లడం నుంచి మొదలై.. పోరాట సన్నివేశాలకు స్టంట్స్ రూపకల్పన చేసే స్థాయికెదిగాడు శామ్.
మొదట్లో వాళ్లు ఏది పెడితే అది తినడం.. పని చేయడం తప్ప జీతమంటూ ఏదీ ఉండకపోయేది. కానీ, అక్కడ నేర్చుకుంటున్న విద్య తనకుపయోగపడుతుందనే ఒక అంచనాలో కష్టపడ్డాడు. ఆ తర్వాత మరో ప్రముఖ యాక్షన్ స్టార్ అయిన పప్పు వర్మ వద్ద కూడా శిక్షణ పొందాడు.
1983లో సన్నీడియోల్ నటించిన బేతాబ్ తో శామ్ కౌశల్ కు ఒక బ్రేక్ దొరికింది. ఆ సినిమాకు తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ కేవలం 500 రూపాయలు మాత్రమే. వేరుశనగలు తినుకుంటూ పొట్టపోసుకునే బతుక్కి.. 500 రూపాయలు రావడమే గొప్పగా ఉండేది. మెల్లిగా తన కెరీర్ ఊపందుకుంది. 1990ల నాటికి శామ్ కౌశల్ బాలీవుడ్ యాక్షన్ విభాగాల్లో ఓ ఇంపార్టెంట్ నేమ్ గా మారిపోయాడు.
కానీ, విధి శామ్ ను ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉంది. లడాఖ్ లో హృతిక్ రోషన్ హీరోగా ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న సినిమా లక్ష్య కోసం పనిచేస్తున్నప్పుడు శామ్ కౌశల్ సడెన్ గా నొప్పితో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలిస్తే తనకు క్యాన్సర్ అని నిర్ధారణైంది.
ఆ విషయం తెలిస్తే తనను బ్లాక్ లిస్టులో పెడతారని క్యాన్సర్ ఉన్న విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. తన కొడుకులను పెంచి పెద్ద చేశాక తనను తీసుకుపొమ్మని ఆ దేవుణ్ని వేడుకున్నాడు. క్యాన్సర్ కు ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు. మొత్తానికి తను బతికి బట్టకట్టాడు.
రెండు దశాబ్దాలు గడిచాయి.. తన కొడుకును తనకున్న పరిచయాలతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అతడే విక్కీ కౌశల్ గా ఇవాళ హిందీ చిత్రసీమలో అగ్రహీరోల్లో ఒకడిగా నిలబడ్డాడు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చావా సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులు బద్ధలుకొట్టి 807 కోట్ల 88 లక్షల రూపాయలను వసూలు చేసింది.
ఒకప్పుడు స్టూడియోల్లో ఊడ్చిన చేదు జ్ఞాపకాలను చూసిన శామ్ కష్టానికి.. తన మార్గదర్శకత్వంలో పెరిగిన కొడుకు విక్కీ కౌశల్.. నాటి వీరు దేవగణ్ కొడుకైన అజయ్ దేవగణ్ వంటివారితో పోటీ పడుతుండటం ఓ తండ్రిగా శామ్ కు ఎంత గర్వాన్నిచ్చేది!
శామ్ ఇద్దరు కొడుకులైన విక్కీ కౌశల్, సన్నీ కౌశల్ ఇద్దరూ కూడా ఇప్పుడు బాలీవుడ్ నటులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. పైగా తన కొడుకు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ను పెళ్లి చేసుకోవడంతో.. ఒకనాడు ఆకలి కేకలు వేసిన రోజుల నుంచి ఒక సెలబ్రిటీ కుటుంబంగా తామెదిగిన తీరు ఓ తండ్రిగా శామ్ వృద్ధ జీవితానికెంతో ఆనందాన్నిచ్చేంది. ఆ ఆనందం మాటలకందని అనుభూతినిచ్చేది. అందుకే, శామ్ కుటుంబ కథే.. ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టోరీస్ ను మించి చెప్పుకుంటున్నారక్కడ.
Share this Article