భయం… ఆ కృష్ణ జింకను తాను వేటాడుతున్నప్పుడు, అది పరుగెడుతున్నప్పుడు దాని కళ్లల్లో తారాడిన ఆ భయమే… ఆ భయమే… ఇప్పుడు దాని వేటగాడు సల్మాన్ ఖాన్ కళ్లల్లోనూ… విధి తరుముతోంది… ఆ కృష్ణ జింక తనను వేటాడుతోంది…
నిజానికి తను బాధితుడు కాదు, నిందితుడు… మన చట్టాలు, మన న్యాయవ్యవస్థల డొల్లతనం, తన డబ్బు, తన స్టార్ హోదా వల్ల మాత్రమే కాపాడబడుతున్నాడు… బిష్ణోయ్ జాతి పూజించే కృష్ణ జింకను వేటాడమే కాదు, సల్మాన్ వ్యక్తిగత వ్యవహారశైలి, తన అఫయిర్స్, తన అలవాట్లు అన్నీ వివాదాస్పదమే…
సల్మాన్ ఖాన్‌ను మన చట్టాలు వదిలేయవచ్చుగాక… కానీ ఆ బిష్ణోయ్ జాతి వదలడం లేదు… తరుముతోంది… ఒకేసారి షూట్ చేయడం కాదు… పరుగులు పెట్టిస్తోంది… (బిష్ణోయ్ గ్యాంగ్ ఇతరత్రా దందాలు వేరు, సల్మాన్‌ఖాన్‌ను వేటాడే కారణం మాత్రం నాటి కృష్ణ జింక వేట మాత్రమే…)
Ads
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మిడ్-డేలో ఓ వార్త… హైదరాబాదులో తన సినిమా సికిందర్ షూట్ జరుగుతోంది… రష్మిక మంధాన హీరోయిన్… రెండు సాంగ్స్, ఇంకొన్ని సీన్లు ఇక్కడ షూట్ చేయాలిట… ప్యాలెస్ హోటల్ బుక్ చేశారు… ఆ హోటల్‌ను ఇప్పుడు ఓ దుర్భేద్యమైన కోటగా మార్చారు… ఒకటి కాదు, రెండు కాదు… నాలుగు లేయర్ల భద్రతా వ్యవస్థ తనను కాపుకాస్తోంది…
కనీసం 50 నుంచి 70 మంది నిరంతరం తనను కాపలా కాస్తున్నారు… అందులో ఎన్ఎస్‌జీ కమాండోలు కూడా ఉన్నారనే సమాచారం విభ్రాంతిని కలిగిస్తోంది… బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల తరువాత తనకు వై కేటగిరీ భద్రత కలిగించింది ప్రభుత్వం… ముంబై పోలీసులు ప్లస్ ఇక్కడి హైదరాబాద్ పోలీసులు ఎలాగూ ప్రయాస పడుతూనే ఉన్నారు…
దీనికితోడు తన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది… అందరూ మాజీ పారామిలిటరీ సిబ్బంది అట… సల్మాన్ ఖాన్ సుదీర్ఘ బాడీ గార్డ్ షెరా వాళ్లను ఎంపిక చేశాడు… (అసలు వై కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తుల రక్షణకు ఎన్‌ఎస్‌జీ కమాండోలను నియమిస్తారా అనేది ఓ సందేహం…)
ఆ హోటల్ బుక్ చేసుకునే వాళ్లు కూడా ఈ సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ సిబ్బంది చెకింగులు పాస్ కావాల్సిందే… హోటల్ సెక్యూరిటీ మాత్రమే కాదు, సల్మాన్ ప్రైవేటు సెక్యూరిటీ ఆర్మీ క్లియరెన్స్ ఇస్తేనే లోపలకు ఎంట్రీ… వచ్చీపోయే హోటల్ గెస్టుల ఐడీ తనఖీలు మాత్రమే కాదు, వాళ్ల వివరాలు మొత్తం తెలుసుకుని మరీ లోపలకు అనుమతిస్తున్నారు…
ఒక పోర్షన్‌లోనే షూటింగ్… ఐతేనేం, ఆ హోటల్, పరిసరాలు మొత్తం ఓ పటిష్టమైన భద్రతావలయంలోకి చేరిపోయాయి… ఆ హోటల్ సిబ్బందికి కూడా తనిఖీలు, పరీక్షలు తప్పనిసరి… ఎస్, భయం… భయం నీడలో సల్మాన్ ఖాన్… ముందే అనుకున్నాం కదా… తాను వేటాడుతున్నప్పుడు ఆ జింక కళ్లల్లోని భయమే… ఇప్పుడు సల్మాన్ బతుకులో… అది వేటాడుతోంది… ఆ నేరం తరుముతోంది… ఇప్పుడు సల్మాన్ పరుగు పెడుతున్నాడు…! అసాధారణమైన నాలుగంచెల భద్రత నడుమ… తుపాకుల రక్షణ నడుమ… భయం… భయం…!!
Share this Article