రోగి:
…అంటే డాక్టరు గారూ! కరోనా రెండో దశ రాకుండానే మూడో దశలోకి వచ్చేశామా?
డాక్టరు:
దశ దిశ మనుషులకే. వైరస్ అన్ని దిశల్లో, అన్ని దశలు దాటి అది కావాలన్న దశకు వెళ్లగలుగుతుంది.
Ads
రో:
అమెరికాలో, యూరోప్ లో వ్యాక్సిన్ గుచ్చుతున్నారు కదా? ఈలోపు వైరస్ కొత్త స్ట్రెయిన్ ఎలా పుట్టుకొచ్చింది?
డా:
రోగులకు జబ్బులు, భయాలే ఉండాలి కానీ, వైద్య శాస్త్ర జ్ఞానం ఉండకూడదు.
రో:
నిజమే డాక్టర్. భయంతో కూడిన ఆందోళన వల్ల పుట్టిన ఆదుర్దా నుండి జనించిన గుండెదడ జబ్బుతోనే అడుగుతున్నాను.
డా:
అయితే ముందు నువ్ ట్రెడ్ మిల్ టెస్ట్ చేయించుకుని రా. నీ గుండె కొట్టుకుంటున్నట్లు అందులో తేలితే నేను చూస్తాను. తేడా ఉంటే లైఫ్ ఐసొలేషన్లో నీకు నీవే ఉండవచ్చు.
రో:
హోమ్ ఐసోలేషన్ గురించి విన్నా. ఈ లైఫ్ ఐసొలేషన్ ఏమిటి డాక్టర్?
డా:
నా పదేళ్ల డాక్టర్ చదువు, ముప్పయ్ ఏళ్ల వైద్య వృత్తిలో ఇలాంటి వైరస్ చూడలేదు. ఇకపై చూస్తానన్న నమ్మకమూ లేదు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా మాస్కు తీయడానికి లేదు. మునుపటిలా కౌగిలింతలు, ముద్దులు, షేక్ హ్యాండ్లు ఉండకూడదు. గట్టిగా తుమ్మకూడదు. బిగ్గరగా దగ్గకూడదు. మొత్తంగా ఇంకొక తరం అంటే పాతిక, ముప్పయ్ ఏళ్లు జాగ్రత్తలు తీసుకుంటే- కరోనా రాకుండా మనల్ను మనం కాపాడుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను లైఫ్ ఐసొలేషన్ అంటారు.
రో:
నేను వైద్యం, వ్యాక్సిన్ గురించి అడిగితే- మీరు వేదాంత పాఠం చెబుతున్నారు?
డా:
అస్తు..అస్తు.. శాస్త్రమెప్పుడూ ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి.
రో:
మీరు మాయాబజార్లో పింగళి డైలాగ్ చెబుతున్నారు.
డా:
పింగళి నిజమే చెప్పారు.
రో:
పోనీ…భారత్ లో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది?
డా:
వ్యాక్సిన్ దాచి, రవాణా చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రో:
నేనడుగుతున్నది వ్యాక్సిన్ గురించి. మీరు రవాణా గురించి మాట్లడతారేమిటి?
డా:
అంటే…వ్యాక్సిన్ తయారు కాకుండానే- వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని నీ అనుమానమా?
రో:
నేనలా అన్నానా?
డా:
రోగులకు హక్కులు ఉండవు.
రో:
మరి?
డా:
రోగులకు రోగాలే ఉంటాయి.
రో:
మీరు వేదాంత వ్యాకరణంలో ఎంఎస్ చేసి, వైరాగ్య వ్యాకరణంలో హౌస్ సర్జన్ చేశారా?
డా:
సకల శాస్త్రాలకు వేదమే మొదలు. వేదాంతమే తుది. మధ్యలో ఉన్నది మిథ్య.
రో:
డాక్టరు గారూ!
మీరు త్వరలో పెట్టబోయే ఆశ్రమంలో మొదటి వరుసలో నాకు శాశ్వత కుటీరం కట్టించి ఇవ్వడానికి ఎంత విరాళం ఇమ్మంటారు?
డా:
???
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article