ప్రభాస్ నటించే భారీ ప్రాజెక్టు సాలార్ మీద తనకే అసంతృప్తిగా ఉందట కదా… నిజానికి అదీ అచ్చంగా కేజీఎఫ్ కోసం రాసుకున్న కథలాగే ఉందట… అవే కోలార్ గోల్డ్ మైన్స్… అదే స్టోరీ లైన్… దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ నడుమ ఈ విషయంలోనే విభేదాలు వస్తున్నట్టుగా చెబుతున్నారు… అదే పంథాలో కథ సాగితే ఎవరు చూస్తారనేది ప్రభాస్ సందేహమట…
అంతేకాదు, దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె మీద ఇలాంటి సందేహాలే వినిపిస్తున్నాయి… నిజానికి నాగ్ అశ్విన్ ఆచితూచి అడుగులు వేసేరకం… అంత తేలికగా తప్పుల్లో కాలేసేరకం కాదు… ఓ దశలో తమ షూటింగు వాహనాలకు సంబంధించి కాస్త టెక్నికల్ సపోర్ట్ కావాలని అశ్విన్ మహేంద్రను అడిగినట్టు కూడా వార్తలు చదివాం కదా… తీరా చూస్తే ఆ స్టోరీ లైన్ రీసెంటుగా శర్వానంద్ హీరోగా వచ్చిన ఒకే ఒక జీవితం తరహాలో ఉంటుందట… పాస్ట్ టైమ్ జోన్‌లోకి ప్రయాణించడం…
ఆ సినిమా సక్సెసే… కానీ అదే స్టోరీ లైన్‌తో ఓ పాన్ ఇండియా సినిమాకు అంత భారీ ఖర్చు అవసరమా అనేది ప్రస్తుతం ఫిలిమ్ ట్రేడ్ సర్కిళ్లలో చర్చ… ఇంకోవైపు ఇదే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రెడీ అవుతోంది… అదీ కార్తికేయ-2, బ్రహ్మాస్త్ర టైపు… రామాయణం స్టోరీ రీటెల్లింగ్… అసలే హిందీ సినిమాలు తన్నేస్తున్నయ్… బాయ్‌కాట్ పిలుపులు భయపెడుతున్నయ్… బ్రహ్మాస్త్ర కలెక్షన్ల ప్రకటనలన్నీ ఫేక్ అంటున్నారు… అదంతా కరణ్ జోహార్ బోగస్ ప్రచారం అనే విమర్శలూ వస్తున్నయ్… కంగనా అయితే బాహటంగానే వెక్కిరించింది…
నిజంగానే బ్రహ్మాస్త్ర అంత పెద్ద సక్సెస్ అయితే అక్కడ కరణ్ జోహార్ మొహంలో గానీ, ఇక్కడ రాజమౌళి మొహంలో గానీ వీసమెత్తు సంతోషపు ఛాయ లేదు… సంబరాల్లేవు… బ్రహ్మాస్త్ర అంత గ్రాండ్ సక్సెస్ అయితే కనీసం నార్త్ ఇండియాలో ఎగ్జిబిటర్లయినా పండుగ చేసుకునేవాళ్లు కదా… సో, ఈ స్థితిలో ఆదిపురుష్ రిలీజ్‌పై డైలమా కొనసాగుతోందట… అసలే సాహో, రాధేశ్యామ్‌తో దెబ్బతిని ఉన్నాడు ప్రభాస్… ఈ పెద్ద ప్రాజెక్టుల స్థితిగతులేమిటో అర్థం గాక సతమతం అయిపోతున్నాడు…
Ads
వేదాళం అనే తమిళ సినిమాను భోళాశంకర్ అని చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు కదా… ఎప్పుడో 2015 నాటి సినిమా… మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి… హిందీ, బీహాారీలో డబ్ చేశారు, బెంగాల్‌లో రీమేక్ చేశారు… మిగతా భాషల రైట్స్ అమ్మేశారు… అదెప్పుడో షూటింగ్ స్టార్ట్ చేశారు తెలుగులో… అదుగో అయిపోయింది, ఇదుగో అయిపోయింది, రేపు ప్రిరిలీజ్, ఎల్లుండి రిలీజ్ అన్నట్టు చెబుతున్నారు గానీ, దాని అసలు పొజిషన్ ఏమిటో ఎవరికీ క్లారిటీ లేదు… ఈలోపు చిరంజీవి గాడ్‌ఫాదర్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు… అదీ లూసిఫర్ అనే సినిమాకు రీమేక్ అని తెలుసు కదా… కానీ ఆచార్య డిజాస్టర్‌తో ఈ రీమేకులు కూడా మేకులుగు దిగుతాయా అనే భయం తెలుగు ఇండస్ట్రీలో వ్యాపించి ఉంది…
ఎందుకంటే… అది లైగర్ దెబ్బ కూడా… మబ్బుల్లో తలెగరేసి నడిచే విజయ్ దేవరకొండను నేల మీదకు దింపింది సినిమా… ఆ దెబ్బకు అదే టీం తలపెట్టిన జనగణమన సినిమా ప్రాజెక్టే ఢమాల్ అయిపోయింది తెలుసు కదా… ఆశలన్నీ ఖుషి సినిమాపై ఉన్నాయి ఇక… కానీ దాని నిర్మాత దిల్ రాజు… రాజుగారి అదృష్టం అసలే ఎదురుతంతోంది ఈమధ్య… సమంత తన శాకుంతలం సినిమా మీద పెట్టుకుంది… గుణశేఖర్ ప్రమాణాల మీద విశ్వాసం ఉన్నా సరే, అదీ దిల్ రాజు సమర్పణే… పైగా దుర్వాస మహర్షిగా మోహన్‌బాబు అట… ఇక హేమిటో మరి… పేరున్న దుష్యంతుడు కూడా లేడు ఇందులో…
మహేశ్ బాబుతో నోరుతిరగని ఓ జానర్ సినిమా తీస్తున్నట్టు రాజమౌళి చెప్పాడు కదా… అదీ ఇప్పుడప్పుడే కాదు… బ్రహ్మాస్త్ర నుంచి కాస్త కోలుకోవాలి… అసలు ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపైనే భిన్నాభిప్రాయాలున్నాయి ఇండస్ట్రీలో… పైగా మహేశ్ త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు, అదేమిటో తేలితే తప్ప రాజమౌళి ప్రాజెక్టు స్టార్ట్ కాదు… ఇప్పుడున్న స్థితిలో త్రివిక్రమ్ సినిమాను భారీ బడ్జెట్‌తో తీయాలా వద్దా అనే డైలమా కొత్తగా కమ్మేసింది… మహేశేమో పెద్దగా పాన్ ఇండియా హీరోగా ప్రొజెక్ట్ కాలేదు ఎప్పుడూ… మరేమి చేయుట అని ఆ-లో-చి-స్తూ ఉన్నారట…
ఈనెలలోనే మణిరత్నం అత్యంత రిస్కీ ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ వస్తోంది… పెద్ద ఇంప్రెసివ్ ట్రెయిలర్లు ఏమీ లేవు… పాటలు సోసో… పైగా అది తమిళులకు తప్ప ఇంకెవరికీ ఎక్కని కథ… అసలు ఇవన్నీ కాదు, అదేసమయంలో అవతార్-2 రాబోతోంది… దాని ముందు ఇక ఏ గ్రాఫిక్ కుప్పిగంతులూ చెల్లవు… అదీ పొన్నియిన్ సెల్వన్‌కు పెద్ద పరీక్ష… దీనికే కాదు, చాన్నాళ్ల తరువాత రాబోయే హృతిక్ రోషన్ సినిమా విక్రమ్ వేదకు కూడా పరీక్షే… అదీ భారీ బడ్జెట్ సినిమాయే… సో, ప్రస్తుతం ఏ పెద్ద సినిమా కూడా ధీమాగా థియేటర్లలోకి రావడం లేదు… బెరుకుబెరుకుగా… కొన్ని ఆగుతూ నడుస్తూ… కొన్ని ఆగిపోతూ… కొన్ని పడిలేస్తూ… నిజమే… ఇది పెద్ద సినిమాలకు సంధిదశ…!!
Share this Article