.
సరదాగా జీతెలుగు వాడి భాషలోనే చెప్పుకుందాం… ఇద్దరు ముదురు బెండకాయలతో ఓ సంక్రాంతి స్పెషల్ పండుగ షో నడిపించింది జీతెలుగు… రాత్రి 6 గంటల నుంచి 10 గంటల దాకా… 4 గంటలపాటు మారథాన్ షో…
చివరి 20 నిమిషాలు ఇంకా ఏం నింపాలో అర్థం గాక, యాడ్స్‌తో చంపేసినా సరే… స్థూలంగా షో బాగుంది… ఎటొచ్చీ… ఇంత ముందుగా పండుగ స్పెషల్ షో ఎందుకు ప్రసారం చేశారో వాళ్లకే తెలియాలి… ఇంకా పండుగ జనం రోడ్ల మీద, జర్నీల్లో అవస్థలు పడుతున్నారురా స్వామీ.,.
Ads
స్టార్ మా 14న పన్నెండు గంటలకు ‘మా సంక్రాంతి వేడుక’ అనే స్పెషల్ షో ప్రసారం చేయబోతోంది… ఎప్పటిలాగే బిగ్‌బాస్ ఫేమ్ ఆర్టిస్టులతో స్టార్ మా పరివారం స్టయిల్‌లో అది ఉండబోతోంది, ప్రోమో చూస్తే..! సహజంగానే తనూజకు ఈ షోలో ప్రయారిటీ ఉంటుంది… ఫ్యాన్స్ హడావుడి, నా లైఫులోకి వచ్చినందుకు థాంక్స్ అనే పడాల కల్యాణ్ మాటలు హైలెట్…
ఈటీవీలో సంక్రాంతికి రఫ్పాడిస్తాం అనే షో 15న ప్రసారం కాబోతోంది… ఎప్పటిలాగే అదే సుమ, అదే హైపర్ ఆది, అదే నాగబాబు… ఎప్పటిలాగే పవన్ కల్యాణ్ కీర్తన తప్పదు… మన శివశంకర వరప్రసాద్, మాస్ జాతర సినిమా ప్రమోషన్ల కోసం అనిల్ రావిపూడి, రవితేజ ఎంట్రీ… మరి పోటీచానెళ్లు 14, 15 తేదీల్లో పక్కా పండుగ స్పెషల్ షోలు వేస్తుంటే జీతెలుగువాడు తొందరపడి ముందే ఎందుకు కూశాడో తెలియదు…

ఈ షో స్పెషల్ ఏమిటంటే..? ముదురు బ్రహ్మచారులు… అదే సుడిగాలి సుధీర్, మాచిరాజు ప్రదీప్… ఈటీవీలో బందీ అయిపోయాడు గానీ హైపర్ ఆది కూడా జతకలిసి ఉంటే కథ మరింత రక్తికట్టేది… ముగ్గురూ ముగ్గురే కదా బ్రహ్మచర్యంలో…,! దీనికితోడు పెళ్లయిన బ్రహ్మచారి ప్రధాని, శాశ్వత బ్రహ్మచారి సల్మాన్ ఖాన్, పాన్ ఇండియా బ్రహ్మచారి ప్రభాస్ వాయిస్‌లను కూడా ఎఐ సాయంతో వినిపించారు… ప్రధానిని ఇందులో చూపించకుండా ఉంటే బాగుండేది…
తన సినిమా ప్రమోషన్ కోసం రవితేజ వచ్చాడు… అంధ బాలగాయని వరుణవితో ఎపిసోడ్ బాగుంది… మల్టీస్టారర్ సినిమాలో ఏ హీరోకు ఒక్క డైలాగ్, ఒక్క సీన్ కూడా తేడా రావద్దు అన్నట్టుగా ప్రదీప్, సుధీర్‌లకు సమ ప్రాధాన్యం కోసం జీతెలుగు క్రియేటివ్ టీమ్ నానా కుస్తీపట్లు పట్టాల్సి వచ్చినట్టుంది… వాళ్లకు పాటలతో సహా..!
గతంలో ఈటీవీ- వైసీపీ పరస్పర రాజకీయ ధ్రువాలే అయినా రోజా ఈటీవీని, జబర్దస్త్‌ను తెగ ప్రేమించేది… ఇప్పుడు ఏదో తత్వం బోధపడినట్టుంది… శేఖర్ మాస్టర్‌తో కలిసి జీతెలుగు స్పెషల్ షోలో స్కిట్లు, పాటలు, డాన్సులు గట్రా చేసింది… పర్లేదు… ఏదో సగటు రొటీన్ టీవీ కమర్షియల్ రియాలిటీ షోలాగా నడిపించారు గానీ... ఎక్కడా సంక్రాంతి అనే ఛాయలు, వాసనలు లేకుండా అతి జాగ్రత్తగా రూపొందించారు ఈ షోను... ఏం తెలివిర భయ్ మీది..!!
Share this Article