సార్, ఐడెంటీ కార్డు చూపించండి అని ఆ కుర్రాడు వినయంగా అడిగేసరికి నవ్వుతూ అతని ముందే భారీ బహిరంగ సభకు హాజరైన వారిని లెక్కించాను . నేనూ , మరో జర్నలిస్ట్ , ఆ కుర్రాడి లాంటి మరో పది మంది వాలంటీర్లు , హాజరైన అశేష ప్రజానీకం అంతా కలిసి 50 మంది దాటడం లేదు . ఆ కుర్ర వాలంటీర్ బహుశా 8 లేక తొమ్మిదో తరగతి చదువుతున్నాడు కావచ్చు . కార్డు చూపిస్తాను కానీ మనందరినీ కలిపినా 50 మందే ఉన్నాం కదా ? ఇలా ఆపి కార్డు చెక్ చేయడం నీకు ఎలా ఉంది అని అడిగాను .
ఏమో సార్, నాకీ పని చెప్పారు అంతే అన్నాడు . తన ఉద్యమం ద్వారా దేశాన్ని ఒక ఊపు ఊపి , ఢిల్లీ రాష్ట్రంలో , కేంద్రంలో యుపిఏ ఓడిపోయి బిజెపి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన అన్నా హజారే సికింద్రాబాద్ ఆనంద్ టాకీస్ ఎదురుగా ఉన్న కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ . రాష్ట్రంలో ఆయన తొలి సభ కాబట్టి భారీగా ఉంటుంది అనుకొని వెళితే పట్టుమని వందమంది రాలేదు . అన్నా హజారే పాత్రను ఎందుకు పుట్టించారు , ఎవరి కోసం ఆకాశానికి ఎత్తారు ? మీడియానే కాదు ప్రజలు కూడా మాస్ హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయారు .
ఇతనే నిజమైన మహాత్మా గాంధీ , భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేసిన దేశం తరువాత అతన్ని ఎందుకు పట్టించుకోలేదు ? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ? ఏమిటీ లీల అని ప్రశ్నించుకుంటే రాజకీయం అర్థం అవుతుంది . మీడియా అవసరాలు , రాజకీయ అవసరాల కోసం కొన్ని పాత్రలు ఇలా రాజకీయ తెర మీద పుట్టుకు వస్తాయి . రాజకీయంలో వారి పాత్ర ముగియగానే స్టోర్ రూమ్ లో పడేస్తారు . ఢిల్లీలోనే కాదు ఇక్కడ కూడా అలాంటి బోలెడు పాత్రలను ఇలా పుట్టించారు …
Ads
****
తెలంగాణ ఉద్యమ కాలంలో పలు తెలుగు ఛానల్స్ ఇలాంటి అరడజను పాత్రలను పుట్టించాయి . వాళ్ళు ప్రతి రోజు టీవీల్లో గంటల తరబడి కనిపించే వారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించేవారు . ముఖ్యమంత్రి , మంత్రులు , ప్రతిపక్ష నాయకుడి కన్నా టీవీల్లో ఈ పాత్రలే ఎక్కువ సమయం కనిపించేవి . ఈ పాత్రల సృష్టి వెనుక ఆ ఛానల్స్ కు నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది . వరదలో కొట్టుకు పోతున్నప్పుడు గడ్డి పోచనైనా పట్టుకొని కాపాడుకోవాలనే ప్రయత్నం మీడియా ఈ పాత్రలను సృష్టించడంలో కనిపిస్తుంది .
నేను తెలంగాణ వాడినే కానీ తెలంగాణ వద్దు , తెలంగాణ ఏర్పడితే తెలంగాణకు చాలా నష్టం అని నల్లమోతు చిరంజీవి కావచ్చు ( తక్షణ అవసరం కోసం సృష్టించిన పాత్ర కాబట్టి పేరు గుర్తుండడం కష్టమే ) టీవీల్లో తెగ వాదించేవారు . టివి 9 లాంటి నంబర్ వన్ ఛానల్ లో అంతేసి సమయం కేటాయిస్తే ప్రముఖ నాయకుడు అన్నట్టే కదా ? తెలంగాణ ఏర్పడిన తరువాత మళ్ళీ అతన్ని ఒక్క నిమిషం అయినా ఎందుకు చూపలేదు …?
ఎందుకంటే… తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదు అనే అభిప్రాయం ఏర్పడేట్టు చేసేందుకు పుట్టించిన పాత్ర అది . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇక ఆ పాత్ర అవసరం ఏముంది ? నర్రా విజయ లక్ష్మి అని ఒక మహిళా నాయకురాలు ఉండేవారు . బతుకమ్మ తెలంగాణ పండుగ కాదు విజయవాడలో కూడా జరుపుకుంటారు అని ఓ వాదన . లగడపాటి రాజ్ గోపాల్ పిలుపు మేరకు నర్రా విజయలక్ష్మి విజయవాడ వెళ్లి లగడపాటి అన్నయ్య పిలిచాడు అని ఆమె విజయవాడలో బతుకమ్మ ఆడేవారు .
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి బతుకమ్మ ఆడడం వరకు ప్రముఖ ఛానల్స్ లైవ్ చూపేవారు . ఇక విభజన తరువాత టివి 9 పుట్టించిన పెద్ద పాత్ర శివాజీ … దేశంలో అన్నా హజారే పాత్రకు ఎంత ప్రాముఖ్యత లభించిందో రాష్ట్రంలో టివి 9 ఆవిష్కరించిన శివాజీ పాత్రకు రాష్ట్ర స్థాయిలో అంత పాపులారిటీ లభించింది . సినిమా అవకాశాలు లేని శివాజీ అనే ఒక నటుడిని టివి 9 స్టూడియోలో కూర్చుండబెట్టి రోజుల తరబడి , కొన్ని గంటల పాటు ఆపరేషన్ గరుడ పేరుతో డ్రామా ఆడించారు .
ఉద్యమ కాలంలో కెసిఆర్ పుట్టించిన పాత్ర జేఏసీ కోదండరాం . తెలంగాణ ఉద్యమంలో తెరాసదే కీలక పాత్ర , పెద్దన్న పాత్ర అన్ని పార్టీలను కలిపి ఉద్యమం చేయాలని అప్పటికప్పుడు తయారు చేసిన పాత్ర కోదండరాం . తెలంగాణ సాకారం కాగానే తన పాత్ర ముగిసింది అని గ్రహించకుండా అన్ని పార్టీలకు తానే నాయకుడిని అనే భ్రమల్లో ఉండి కోదండరాం దెబ్బ తిన్నారు . సొంత పార్టీ పెట్టారు . కాంగ్రెస్ , టీడీపీలతో చేతులు కలిపారు, కాలం కలిసి రాలేదు . టెన్త్ మొదటి సారే పాసై ఇంటర్ లో డుమ్కి కొట్టిన కొందరు కోదండరాం ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చింది తెలుసా అని వాదిస్తుంటే , పిల్లలతో ఏం వాదిస్తాంలే అని మౌనంగా ఉండిపోతా .
*****
జన్ లోక్ పాల్ అంటూ దేశవ్యాప్త ఉద్యమం చేసిన అన్నా హజారే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే … యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమించడానికి హజారే అవసరం అయ్యారు . ఆ పాత్ర అవసరం తీరిపోయింది . రాజకీయ పక్షాలు , వాటి అనుబంధ సంఘాలు , మీడియా అప్పటి అవసరం కోసం ఆయన్ని ఆకాశానికి ఎత్తింది . ఇప్పుడు వీరికి ఆయన అవసరం లేదు . వీరి ప్రత్యర్థి గ్రూప్ అంత బలమైనది కాదు , వారికి మీడియా లేదు . ఒక పాత్రను ఒకేసారి ప్రయోగిస్తారు . రెండో సారి అది పని చేయదు .
****
టివి 9 లో అన్వేషణ అని పాతకాలం నటీనటులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని చూపిస్తారు . ఓసారి ఈ పాత్రలను కూడా అన్వేషించవచ్చు కదా ? ఏదో సందర్భంలో కెసిఆర్ ఓ విషయం చెప్పారు . పిల్లాడిని తండ్రి తన భుజంపై ఎక్కించుకుంటే తాను తండ్రి కన్నా ఎత్తులో ఉన్నాను అనుకుంటాడు . భుజం నుంచి దించేశాక అసలు ఎత్తు తెలుస్తుంది అని … టివి ఛానల్స్ అంతే ఆయా కాలాల్లోని అవసరాల మేరకు భుజంపై ఎక్కించుకొని స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు .. అది తాత్కాలికం అని గ్రహించకుండా నిజం అనుకుంటే రాంగోపాల్ వర్మ సినిమాలా జీవితం అట్టర్ ప్లాప్ అవుతుంది …. – బుద్దా మురళి
Share this Article