నీరజ్ చోప్రా… ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతున్నది కదా… మరి ఒక్క ఒలింపిక్ స్వర్ణపతకం కోసం ఎంతో కరువులో ఉన్నాం కదా ఏళ్లుగా..?! ఆ ఆకలి తీర్చాడు… అవునూ, ఆకలి అంటే గుర్తొచ్చింది… నీరజ్ మొదట్లో వెజిటేరియనే… జావెలిన్ ప్రాక్టీస్ చేస్తున్న తొలిరోజుల్లో కూడా చపాతీలు, కాయగూరలు… అంతే… కానీ స్టామినా కావాలంటే నాన్ వెజ్ తప్పదు, యూరప్ వంటి దేశాలు వెళ్తే మరీ తప్పదు అని ఎవరో చెబితే చికెన్ తినడం స్టార్ట్ చేశాడు… ఒబెసిటీ కారణంగా తనకు ఇష్టమైన స్వీట్లను దాదాపు వదిలేశాడు… ఈ ఈవెంట్ అయిపోగానే ఏ పరిమితులూ లేకుండా ఓపూట ఆనందంగా హర్యానీ భోజనం కుమ్మేయాలని ఉంది అన్నాడు నవ్వుతూ… అంతేకాదు, చపాతీ చుర్మా కూడా కడుపు నిండా పట్టించాలి అట… సద్దుల బతుకమ్మకు వరిపిండి రొట్టెను ముక్కలు చేసి, చక్కెర కలిపి చిన్న చిన్న ముద్దలు చేస్తాం కదా, మల్లీద ముద్దలు… సేమ్, వాళ్లు చపాతీల్ని ముక్కలు చేసి, దండిగా నెయ్యి వేసి, చక్కెర కలిపి అలాగే పొడిగా గానీ, సున్నుండల తరహాలో ముద్దలు గానీ చేస్తారు… అదే చపాతీ చుర్మా…
అసలు ఇప్పుడు బాలీవుడ్ హీరోలాగా ఉన్నాడు గానీ చిన్నప్పుడు బొద్దు పిల్లగాడే… అల్లరి కూడా… ఎవరూ చూడకుండా బర్రెల తోకల్ని ముడివేయడం, పెద్దవాళ్ల వెనుక క్రాకర్స్ కాల్చి భయపెట్టడం వంటి చిలిపి పనులు బోలెడు… ఒక దశలో 11 ఏళ్లకే 80 కిలోలకు బరువు పెరిగిపోయాడు… సన్నబడటం కోసం తమ ఊరు ఖాంద్రా నుంచి పానిపట్ లోని, శివాజీ స్టేడియంలోని జిమ్‌కు వెళ్లేవాడు… 20, 30 రూపాయల పాకెట్ మనీ ఎటూ సరిపోదు… పోయేటప్పుడు బస్సులో వెళ్లి, వచ్చేటప్పుడు పానిపట్‌లో పనిచేసే తన అంకుల్‌తో తిరిగి వచ్చేవాడు, టికెట్ డబ్బులు మిగలాలి కదా…! జిమ్‌లో ఏవో తోచిన ఎక్సర్‌సైజులు చేసేవాడు… 17 మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబంలో తన కోసం ప్రత్యేకంగా డైట్ సాధ్యం కాదు… పెద్ద డబ్బున్న కుటుంబం కూడా కాదు… తండ్రి రైతు… ఆ స్టేడియంలో జావెలిన్ ప్రాక్టీసు చూస్తూ ఉండేవాడు నీరజ్ అప్పుడప్పుడూ… అనుకోకుండా సీనియర్ జైవీర్‌తో పరిచయం… సరదాగా జైవీర్ జావెలిన్‌ను నీరజ్ విసిరాడు… తనలో జావెలిన్ ఆటకు సరిపడా హైట్, ఒడుపు ఉన్నాయని మొదట గుర్తించింది ఆ సీనియరే… నేర్పించడం మొదలు పెట్టాడు…
Ads
- అప్పట్లో పానిపట్ యుద్ధం కోసం నీరజ్ పూర్వీకులు ఎక్కడి నుంచో వలస వచ్చారట… అప్పుడంతా కత్తులు, బల్లేలతోనే కదా ఫైట్… ఈ బల్లెం వారసత్వంగా వచ్చినట్టుంది తనకు…
- గుంటూరులో జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగినప్పుడు నీరజ్ పాల్గొన్నాడు, సిల్వర్ గెలిచాడు… బహుశా 2019లో కావచ్చు…
- మొదట్లో బరువైన, రఫ్ జావెలిన్… మట్టి ట్రాక్… దానిపైనే ప్రాక్టీస్ చేసేవాడు… అక్కడి నుంచి పంచకూల (శాయ్) స్పోర్ట్స్ అకాడమీలో చేరాక సింథటిక్ ట్రాక్, లైట్ వెయిట్ జావెలిన్ దొరికాయి… వాటితో తను విసిరే దూరం బాగా పెరిగింది… ఇంకాస్త పట్టు దొరికింది…
- 14 ఏళ్లకే పంచకూల అకాడమీలో చేరిపోయాడు కదా… 9వ తరగతికే బడికి దూరం… తరువాత కరెస్పాండెన్స్ కోర్సులో డిగ్రీ మమ అనిపించేశాడు… ఆర్మీలో సుబేదార్‌గా కూడా చేరాడు…
- 2016లో… పోలెండ్‌లో… అండర్-20 కేటగిరీలో వరల్డ్ రికార్డ్ సాధించాడు… అప్పుడే అందరి కన్నూ తనపై పడింది… ఫేస్‌బుక్ జుకర్ బర్గ్, తారలు శిల్పాశెట్టి, కత్రినా కైఫ్ దగ్గర్నుంచి సాక్షాత్తూ ప్రధాని దాకా అభినందనల వర్షం కురిసింది…
- మొదటిసారి 2012లో లక్నోలో జాతీయ రికార్డు బ్రేక్ చేసి తిరిగివచ్చాక ఫ్రెండ్స్‌తో బాస్కెట్ బాల్ ఆడుతూ మణికట్టు విరగ్గొట్టుకున్నాడు… తరువాత ఆరు నెలలు నో ప్రాక్టీస్… తన కెరీర్ అయిపోయినట్టే అనుకున్నాడు… మణికట్టు ఎముకలు ఒకసారి డిస్టర్బ్ అయితే సెట్ కావడం కష్టం అనుకుని సొంతూరికి వెళ్లిపోయాడు… ఫిజికల్ ఎక్సర్‌సైజ్ లేదు కదా, బాగా ఒబేసిటీ ప్రోన్ బాడీ… 93 కిలోలకు చేరుకున్నాడు… తర్వాత తగ్గడానికి నానా కష్టాలు పడ్డాడు…
- 2015, కేరళ నేషనల్ గేమ్స్‌కు సెలెక్టయ్యాక గానీ తనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జావెలిన్ ఇవ్వలేదు…
- జావెలిన్ అంత ఈజీ గేమ్ కాదు… మెల్లిమెల్లిగా పరుగు స్పీడ్ పెంచాలి, అదే స్పీడ్‌లో ఉన్నప్పుడు లైన్ రెండు మీటర్లు ఉందనగా అకస్మాత్తుగా వేగం తగ్గించాలి, స్పీడ్‌గా వెళ్లే కారుకు సడెన్ బ్రేక్స్ వేసినట్టుగా… రిస్కీ… అంటాడు తను…
- టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే దశలో ఓ ఏడాదిపాటు తన ఫోన్ స్విచాఫ్ చేశాడని నీరజ్ వాళ్ల అంకుల్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు…
- 2016 రియో ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మరో గాయం… చిన్నదే గానీ హర్యానా రోడ్లపై, ఆర్టీసీ బస్సులో రావడం వల్ల తీవ్రమైందట… ఫిజియోథెరపీ చేయించుకుని, జర్మనీలో మరో పోటీ కోసం వెళ్లాడు… దానితో రియో ఒలింపిక్స్ మిస్… అర్హత పోటీలకే పోలేదు…
- 2016లోనే హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాట… ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో నా పేరిట ఒక పతకం ఖాయం, రాసి పెట్టుకొండి…’’ అదే చేసి చూపించాడు…
- 2019లో నీరజ్‌కు పెద్ద పరీక్ష… అంతకుముందే ఓసారి మణికట్టు గాయం, తరువాత మరో గాయం… ఆర్మీలో చేరాక రొటీన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎల్బో గాయం… సర్జరీ చేశారు… ఆరు నెలలు కోలుకోవడానికి… జావెలిన్ త్రో చేసే బలం సమకూరడానికి మరో ఆరు నెలలు… అసలు కుడిచేయి, మణికట్టు బలంగా లేకపోతే జావెలిన్ విసరడం కుదరదు కదా… కానీ తన అదృష్టం కొద్దీ అవి రెండు సెట్ అయ్యాయి… అదే చేతితో జావెలిన్ విసిరాడు… ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందుకున్నాడు…
- ఒబేసిటీ నుంచి విముక్తుడై, తన బాడీ తన చెప్పుచేతల్లోకి వచ్చాక… అసలే ఛేఫీట్ హైట్ కదా… లుక్కు కూడా బాగానే ఉంటుంది… దాంతో చాలామంది యాడ్స్ చేయమని అడిగారు… కొన్ని చేశాడు కూడా… పైన కనిపిస్తున్న యాడ్ అందులో ఒకటి…
- ధోనీలాగే నీరజ్‌కు కూడా బైక్ అంటే ఇష్టం… తనకు హార్లే డేవిడ్‌సన్ బైక్ ఉంది… దాన్ని తీసుకుని ఝామ్మని తిరుగుతూ ఉంటాడు…
- जब सफलता की ख्वाईश आपको सोने ना दे
जब मेहनत के अलावा और कुछ अच्छा न लगे
जग लगातार काम करनेके बाद थकावट ना हो
समजा लेना सफलता का नया इतिहास रचनेवाला है….. 2017లో తను రాసుకున్నాడు ఇలా… ట్వీట్ చేశాడు… రఫ్ అనువాదం… విజయకాంక్ష నీకు నిద్రపట్టనివ్వనప్పుడు… ఆ సాధన తప్ప ఇంకేమీ నీకు నచ్చనప్పుడు… కఠోర శ్రమ తరువాత కూడా అలసట రానప్పుడు… ఓ కొత్త చరిత్ర రాయబడుతోందని అర్థం… ఆ జావెలిన్ అంత దూరం ఎలా వెళ్లిపడిందో… ఓ స్వర్ణాన్ని ఎలా మెడలో వేసుకుందో అర్థమైంది కదా…!!
Share this Article