వాట్సపులోనో, ఫేస్‌బుకులోనో కనిపించింది ఓ రివ్యూ… రివ్యూయర్ పేరు కనిపించలేదు… ప్రవాస్ అనే ఓ మరాఠీ చిత్ర సమీక్ష అది… నిజమే, మనం ఈమధ్య తమిళ, మళయాళ సినిమాల్ని ఆహా ఓహో అనేస్తున్నాం… చప్పట్లు కొడుతున్నాం… మన తెలుగు వదిలేయండి, మిగతా భాషల్లో కూడా మంచి సినిమాలు వస్తున్నయ్… ఓటీటీల్లో కనిపిస్తున్నయ్… ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండే మరాఠీ, తుళు వంటి భాషాచిత్రాలు కూడా ఈమధ్య కొన్ని బాగుంటున్నయ్… వాటి బడ్జెట్ తక్కువ, చాలాచోట్ల రాజీపడుతూ ఉంటారు… కానీ కథలు, నటీనటుల ఎంపిక దగ్గర నో కాంప్రమైజ్… వాటికి హీరోయిజం బెడద లేదు, నటన బేసిక్స్ తెలియని చెక్కమొహాలు కూడా సినిమాను డిక్టేట్ చేసే అగత్యం లేదు వాటికి… దిక్కుమాలిన ఫ్యాన్స్ కోసం సినిమాను భ్రష్టుపట్టించే దరిద్రం అంతకన్నా లేదు… ప్రధానంగా రంగస్థలం నుంచి వచ్చిన నటుల్నే ఎక్కువగా తీసుకుంటారు… ఈమధ్య మరాఠీలో ఓ సినిమా వచ్చింది, పేరు ప్రవాస్…
“నేను చచ్చిపోతే నా అంత్యక్రియలకు ఎనిమిది, పదిమందికంటే ఎక్కువ వస్తారంటావా…” కారు నడుపుతూనే నిర్వేదంతో అన్నాడు అభిజిత్ ఇనాందార్, భార్య లత ఇనాందార్ తో… వారు తమ దగ్గర బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్నారు… “ఎందుకు అలా అంటావ్” చిరాగ్గా అంది భార్య… ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆ సంభాషణను కొనసాగిస్తూ “నాలో ఏం ప్రత్యేకత ఉందని అందరూ గుర్తుంచుకోవడానికి..? నావల్ల కుటుంబానికి గానీ, సమాజానికే గానీ ఏం ఒరిగిందని…”అన్నాడు సోఫాలో కూలబడుతూ… “ఇల్లు కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, కొడుకుని విదేశాలు పంపించాం. ఇవన్నీ నువ్వు కష్టపడి ఉద్యోగం చేయబట్టే కదా సమకూరాయి..? ఇంకా యేమి కావాలి..? అనునయంగా అంది లత… “నేను కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. మంచి నటున్ని కావాలనుకున్నాను. ఇంకా ఏమేమో చేయాలి, ఎంతో సాధించాలి, పదిమందిలో గుర్తింపు పొందాలి అనుకున్నాను. చివరికి యేమీ సాధించలేకపోయాను. ఇంత వయసు వచ్చినా సగటు మనిషిగా మిగిలిపోయాను” బాధగా కళ్ళు మూసుకున్నాడు అభిజిత్.
——
అభిజిత్ కు అరవై ఏడేళ్లు… మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు… భార్య లత, ఆమెకు చిత్రకళ అంటే అభిమానం… తీరిక సమయాల్లో కాన్వాస్ పై రంగుల చిత్రాలు వేసి ఆనందిస్తుంటుంది… ముంబైలో ఇల్లు కట్టుకున్నారు… కొడుకు దిలీప్ ను విదేశాల్లో చదివించారు… అతడు అమెరికాలో ఉద్యోగంలో స్తిరపడ్డాడు… ఆర్థికంగా లోటు లేదు… అభిజిత్ కు నటుడు దిలీప్ కుమార్ అంటే వల్లమాలిన అభిమానం… అతని సినిమా టీవీలో వస్తే తప్పకుండా ఆసాంతం చూస్తాడు… ఆ అభిమానంతోనే కొడుకుకు దిలీప్ అని పేరుపెట్టుకున్నాడు… ప్రస్తుతం అభిజిత్ ఆరోగ్యం బాగా దెబ్బతింది. రెండు కిడ్నీలూ పాడయ్యాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్ తప్పనిసరి… బీపీ, సుగర్ సరిగా అదుపులో పెట్టుకోవడం లేదని రిపోర్ట్ లు చూసినప్పుడల్లా డాక్టర్ హెచ్చరిస్తూ ఉంటాడు… దేశంలో యూరియా ఎరువు దొరకడం లేదని రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, నా వంట్లో అది ఎక్కువ తయారవుతుంది అని తన మీద తానే జోకులు వేసుకుంటాడు అభిజిత్…
—–
ఒకరోజు భార్య ప్రోద్బలంపై పండిత్ రమాకాంత్ జోషి సంగీత కార్యక్రమానికి వెళతారుఆయన ఆలపించిన సంగీతానికి ప్రేక్షకులు మైమరిచిపోయి కరతాళ ధ్వనులు చేస్తారు… అభిజిత్ కు కూడా నచ్చుతుంది… రమాకాంత్ ను కలుసుకుని మాట్లాడుతాడు… వృద్ధుడైన జోషి తనకు కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, మందులు వేసుకుని, కార్యక్రమాలు చేస్తూ ఉంటానని చెబుతాడు. సంభాషణాల్లో పండిత్ జోషి ఒక మాటంటాడు “మన జీవితంలో రెండే రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. ఒకటి మనం ఈ భూమ్మీద పడిన రోజు, రెండవది – నేనెందుకు జీవిస్తున్నాను అనే ఆలోచన వచ్చినరోజు“… ఈ మాటలు అభిజిత్ పై బాగా ప్రభావం చూపిస్తాయి. ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆలోచిస్తుంటాడు. మరో రోజు పండిత్ జోషితో “ఈ వయసులో, ఈ రోగంతో నేను ఎవరికి ఏ విధంగా సహాయ పడగలను, నలుగురిలో గుర్తింపు ఎలా పొందగలను” ఆవేదనగా అడిగాడు.
“ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్తితి ఎలా ఉన్నా…. చనిపోయేంతవరకూ నువ్వు బతకక తప్పదు… ఈ గమ్యం ఎంతకాలం అనే ఆలోచనను పక్కన పెట్టి, నువ్వు ఏమి చేయగలవో నిజాయితీతో ఆలోచించు… ఏదో మార్గం దొరకక పోదు… చెప్పాడు ధృఢంగా… ఇవే మాటలు మననం చేసుకుంటూ ఇంటికి చేరిన అభిజిత్ తాను చెయ్యాల్సిన పనులేవో అస్పష్టంగా తన కళ్ల ముందు కదలాడుతున్న భావన కలిగింది… కుటుంబ పోషణ కోసం ఓపిక లేకపోయినా చెమటోడ్చి కష్ట పడుతున్నవారు, తాను చూసిన వృద్ధుల అలసిపోయిన మొహాలు కళ్ల ముందు కదలాడాయి. వారు ఆ వయసులో కూడా అంతలా కష్ట పడుతుంటే, నేనేమీ చేయలేనా అన్న ఆలోచనలో పడ్డాడు…
——
Ads
బీహార్ లోని ఓ మారుమూల పల్లెలో ఒక తండ్రి, చావుబ్రతుకుల మధ్య అల్లాడుతున్న తన ఆరేళ్ళ కూతురికి సత్వర వైద్య సాయం కోసం చేతులపై ఎత్తుకుని పద్నాలుగు కిలోమీటర్లు పరుగెత్తినా, చివరికి ఆమె ప్రాణాలు కాపాడలేకపోయిన వార్తను టీవీ వార్తల్లో చూసిన అభిజిత్ చలించిపోతాడు. ఆంబులెన్స్ అందుబాటులో ఉండి ఉంటే ఆ పాప ప్రాణాలు నిలిచేవి కదా… అని బాధపడతాడు. ఒకసారి అర్థరాత్రి తనకు ఎగశ్వాసగా ఉంటే జోరున పడుతున్న వానలో అంబులెన్స్ కోసం తన భార్య పడ్డ ఆరాటం, చివరికి ఆటోలో కష్టపడి ఆసుపత్రికి వెళ్ళిన సంఘటన గుర్తుకు వచ్చి ఆవేదన కలిగింది. ఆ బాధ, ఆవేదనలోంచి అతనికి ఒక ఆలోచన తళుక్కుమని మెరుస్తుంది.
తన స్వంత కారును ఆంబులెన్స్ గా మార్చి, అవసరమైన వారికి ఉచితంగా సేవ చేయాలని నిర్ణయానికి వచ్చాడు. భార్య తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా వినలేదు. కావలసిన అనుమతులు పొందాడు. కారుకు ఆంబులెన్స్ కు అవసరమైన అన్ని హంగులూ అమర్చాడు. తన ఫోన్ నంబర్ తో కరపత్రాలు ముద్రించి, దినపత్రికలు పంచేవారి ద్వారా ఇంటింటికి అవి అందేటట్లు చూశాడు.
మొదటిసారిగా ఒక గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. సమయానికి ఒక ప్రాణం కాపాడగలిగాననే ఆనందం అతని మొహంలో స్పష్టం గా కనిపించింది. ఒకరోజు అభిజిత్ మంచి నిద్రలో ఉండగా ఫోన్ వస్తుంది. భార్య లత తటపటాయిస్తూ ఫోన్ తీస్తుంది. ఆంబులెన్స్ కోసం ఆ ఫోన్. అవతలి వాళ్ళు అడ్రెస్ చెప్పారు. అతన్ని అయిష్టంగా నిద్ర లేపుతుంది.
అభిజిత్ హడావుడిగా తయారవుతుంటే…. “ఒక డ్రైవరును పెట్టుకుంటే మీకు ఈ శ్రమ తగ్గుతుందిగా” ప్రేమతో కూడిన సలహా చెప్పింది లత.
“లేదు లతా… నేను స్వయంగా నడుపుకుంటూవెళ్ళి చేసే సాయంతోనే నాకు సంతృప్తి. సహాయం పొందినవారి కృతజ్ఞతా దృక్కులు మనమీద పడుతుంటే… ఆ ఆనందం ఎక్కడా దొరకదు. ఇప్పుడు నాతో రా అది నువ్వు కూడా స్వయంగా చూద్దువుగాని” ఇద్దరూ బయలుదేరారు. ఇంట్లో వంటరిగా ఉండి ప్రసవ వేదనతో బాధపడుతున్న యువతి ఫోన్ అది…. ఆగమేఘాల మీద ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆలస్యంగా వచ్చిన ఆ యువతి భర్త అభిజిత్ చేసిన సాయానికి కన్నీళ్ళ పర్యంతమౌతాడు. అతనొక సినిమా ప్రొడక్షన్ లో పనిచేస్తాడు. వేళా పాళా లేని ఉద్యోగం.
——-
ఒకరోజు అభిజిత్ ఆసుపత్రిలో తన రిపోర్టులు తెచ్చుకుందామని కారులో బయలుదేరుతాడు. ఒకచోట గుంపుగా జనం గుమికూడి ఉంటే కారు పక్కగా ఆపి ఏం జరిగిందని అడుగుతాడు. కారు ప్రమాదంలో తల్లీ, తండ్రీ మరణించారని, ఐదేళ్ల కూతురు కొనఊపిరిలో ఉందని, ఆంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్నారని ఒక వ్యక్తి చెబుతాడు. అభిజిత్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ పాపను పోలీసుల సాయంతో తన కారులో ఆసుపత్రికి తీసుకు వెళతాడు. డాక్టర్లు పాప ప్రాణాలు కాపాడుతారు. కానీ, షాక్ వల్ల ఆమె నిశ్చలంగా ఉంటుంది. ఎటువంటి స్పందనా ఉండదు. ఆ అమ్మాయి పేరు దిశ.
ఒకరోజు దిశ చిన్నాన్న, ఆమెకు ప్రముఖ నటుడు శ్రేయాస్ తల్పడే (మరాఠీ, హింది చిత్రాల నటుడు) అంటే చాలా ఇష్టం అనీ, ఆయనను తీసుకువచ్చి మాట్లాడిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమోనని అంటాడు. అభిజిత్ కు సినిమా ప్రొడక్షన్లో పనిచేసే యువకుడు గుర్తుకు వస్తాడు. అతని సాయంతో శ్రేయాస్ తల్పడేను ఆసుపత్రికి తీసువస్తారు, తన అభిమాన నటుడి మాటలకు దిశలో క్రమంగా మార్పు వస్తుంది. కోలుకుంటుంది. శ్రేయాస్ కు అభిజిత్ కు మధ్య పరిచయం పెరుగుతుంది. అభిజిత్ చేస్తున్న ఆంబులెన్స్ సేవలకు అతడు ముగ్ధుడవుతాడు.
ఒకరోజు మాటల మధ్యలో “మిమ్మలను చూస్తుంటే, మీలో ఒక నటుడు దాగి ఉన్నాడనిపిస్తుంది, సినిమాలో వేషం వేస్తారా, ప్రస్తుతం నేను నటిస్తున్న చిత్రంలో ఒక వేషం ఉంది, డైరెక్టర్ మంచి ఫ్రెండ్, నేను చెబితే కాదనడు” శ్రేయస్ తల్పడే మాటలకు అభిజిత్ ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఒప్పుకుంటాడు. కొడుకు దిలీప్ కు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు.
కార్గిల్ యుద్ధంలో తన కుమారుడు వీర మరణం పొందిన విషయాన్ని భార్యకు చెప్పలేక తనలో తను కుమిలి పోయే ఒక వృద్ధుడి వేషం ఇస్తారు. అభిజిత్ చక్కగా నటిస్తాడు. మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆ సినిమా ప్రివ్యూ సమయంలో ఇతని నటనకు ముగ్ధుడైన మరో దర్శకుడు తన చిత్రంలో పెద్ద వేషం ఇవ్వజూపుతాడు. కానీ, అభిజిత్ తన అనారోగ్య కారణాలు చూపి, ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. తన ఆరోగ్యం ఎంత వొడిదుడుకులకు లోనైనా అభిజిత్ మాత్రం ఆంబులెన్స్ సేవలు మాత్రం ఆపడు. క్రమంగా ‘కార్ ఆంబులెన్స్’ మనిషిగా గుర్తింపు పొందుతాడు. పేపర్లలో అభిజిత్ పై ఆర్టికల్స్ ప్రచురిస్తారు. వివిధ స్వచ్చంద సంస్థలు ఆయన సేవలను గుర్తించి అవార్డులతో సత్కరిస్తాయి. అభిజిత్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అతని మొహంలో విచారచారలు కనిపించడం లేదు. ఒకసారి ఆసుపత్రిలో రిపోర్ట్ లు చూసిన డాక్టర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల కనిపిస్తుంది. భర్తలో వచ్చిన మార్పుకు లత చాలా సంతోషిస్తుంది. తన హాబీ అయిన చిత్రలేఖనాన్ని కొనసాగిస్తుంది.
——
ఒకరోజు లత చిన్ననాటి మిత్రురాలు విద్య తన భర్త తో కలసి చాలా కాలం తరువాత ఇంటికి వస్తుంది. వారు ఎప్పుడో విదేశాల్లో స్థిరపడ్డారు. తాము సంవత్సరానికి కనీసం ఇరవై రోజులైనా యాత్రలకు వెళ్తామని, ప్రపంచం అంతా చుట్టేశామని, ఈసారి ఇండియాలో చూడని ప్రదేశాలు చూద్దామని వచ్చామని చెబుతారు. వారు వెళ్ళిపోయిన తరువాత, అభిజిత్ చాలా సేపు ఆలోచిస్తాడు. జీవితంలో తామిద్దరమూ కలిసి ఎక్కడికీ వెళ్లలేదు. తన లత కూడా ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఎక్కడికైనా వెళ్ళి ఆమెతో కొన్ని రోజులు సరదాగా గడిపి రావాలని నిశ్చయించుకుంటాడు. తమ పెళ్లి రోజైన ఫిబ్రవరి 14వ తారీఖు నాటికి మనాలిలో ఉండేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేస్తాడు. కొడుకుకు కూడా చెబుతాడు. మంచి ఆలోచన అనీ తప్పకుండా వెళ్ళి రమ్మని చెబుతాడు కొడుకు.
లత, అభిజిత్ మనాలిలో చాలా ఆనందంగా గడుపుతారు. మంచులో చిన్న పిల్లల్లా ఆడుకుంటారు. ఆ రోజు ఫిబ్రవరి 14, ఇద్దరూ హోటల్ గదిలో కూర్చుని, తాము కొని తెచ్చుకున్న కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని ఆనందపడతారు. డోర్ బెల్ మోగుతుంది. బయట హోటల్ మేనేజర్ నిలబడి ఉన్నాడు… “అన్నీ సిద్ధం చేశారు. మిమ్ములను రమ్మంటున్నారు” చెప్పి వెళ్ళిపోతాడు. దంపతులిద్దరూ అయోమయంగా చూసుకుని, హోటల్ లాంజ్ లోకి వెళతారు. అక్కడ ఎదురుగా కొడుకు దిలీప్ వీరినే ప్రేమగా చూస్తూ నిలబడి ఉంటాడు… వారి ఆనందానికి హద్దులు ఉండవు. కొడుకును గుండెలకు హత్తుకుంటారు. ఇంతలో మరో వైపు నుంచి లాంజ్ లోకి వస్తున్న వ్యక్తులను చూసి దంపతులిద్దరూ ఉబ్బితబ్బిబ్బు అవుతారు. నటుడు శ్రేయాస్ తల్పడే, దిశ, అంతేకాకుండా తాను ఆంబులెన్స్ సేవలు అందించిన మరికొంత మంది చేతిలో పుష్ప గుచ్చాలు పట్టుకుని నిలబడ్డారు. ఒక్కసారిగా అందరూ “హాపీ మేరేజ్ డే” అని అరుస్తూ చప్పట్లు చరుస్తారు. ఇదంతా తమ కొడుకు తమను ఆశ్చర్యానికి గురిచేయడానికి చేసిన యేర్పాట్లని తెలుసుకుని మురిసిపోతారు. అందరి మొహాల్లోనూ ఆనందం వెళ్ళి విరుస్తుంది. దిలీప్ తన తండ్రి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. దంపతులిద్దరూ అతడి మాటలకు ఆనందం పట్టలేక పోతారు. ఇంతలో హఠాత్తుగా అభిజిత్ మెల్లగా తన వెనక ఉన్న సోఫాలోకి జారి పోతాడు. అప్పటివరకూ ఆనందం వెళ్లివిరిసిన ఆ ప్రదేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. నిర్జీవమైన అభిజిత్ దేహం కూలిన వృక్షంలా ఒరిగిపోయి ఉంది…. సెలవు… (ఈ స్టోరీ ఏదైనా సైటులోనో, పత్రికలోనో వచ్చి ఉంటే, ఏదైనా సోషల్ గ్రూపులో వచ్చి ఉంటే, తెలియజేయండి… వద్దంటే ఈ రివ్యూ డిలిట్ చేయడానికి రెడీ… మరో పదిమందీ చదువుతారు కదా అనుకుంటే ఇలాగే ఉంచేయడానికీ రెడీ…)
Share this Article