Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆరోగ్యంపై కొన్ని అపోహలు, ప్రచారాలు… ఇవీ అసలు వాస్తవాలు…

April 25, 2024 by M S R

ఆరోగ్య అంశాలపై అపోహలు నమ్మలేని పుకార్లతో సమానం… ఇవన్నీ అనవసర ఆందోళనలకు, గందరగోళానికి దారితీసి, వ్యాప్తి చెంది మరింత నష్టాన్ని కలుగజేస్తాయి… తామరతంపరగా పుట్టుకొచ్చిన అనేక యూట్యూబ్ చానెళ్లు, హెల్త్ సైట్లు ఇష్టారాజ్యంగా ఇలాంటివి వ్యాప్తి చేస్తున్నారు… మరీ ప్రత్యేకించి ఓ చెత్తా చానెల్ తెలుగునాట మూఢనమ్మకాలు, అనారోగ్యాంశాల మీద సమాజానికి చేస్తున్న చెడు అంతా ఇంతా కాదు… మన దరిద్రం కొద్దీ మన ప్రభుత్వాలకు ఇవేమీ పట్టవు…

రాత్రిపూట ఫలానా చెట్టు కింద పడుకోకండిరా అని మన పెద్దలు చెప్పేవాళ్లు, భయం ఉండటానికి దెయ్యాలుంటాయని, పట్టుకుంటాయని చెప్పేవాళ్లు… మనమూ నమ్మేవాళ్లం… సీన్ కట్ చేస్తే, సైన్స్ కోణంలో చూస్తే రాత్రివేళ చెట్లు సల్ఫర్ డయాక్సైడ్ వంటి విష వాయువులను విడుదల చేస్తాయనీ, అవి మనిషికి అనారోగ్యకారకాలను తెలుస్తుంది… సో, కల్పన వేరు, నిర్ధారణ వేరు… ఆరోగ్య అంశాల్లో ఇది మరీ ప్రధానం…

సరే, మనలో చాలామంది నమ్మే కొన్ని ఆరోగ్య అపోహల్ని చూద్దాం…

Ads

1) అపోహ … రాత్రిళ్లు లేటుగా తింటే అది బరువు పెరగడానికి కారణం అవుతుంది…

నిజం… బరువు పెరగడం అనేది మనం తీసుకునే కేలరీలను బట్టి, మన దైహిక శ్రమను బట్టి ఆధారపడి ఉంటుంది… అంతేతప్ప భోజనం వేళలు బరువును శాసించవు… (థైరాయిడ్ వంటి సమస్యలు వేరు)… కాకపోతే బెడ్ టైమ్‌లో ఎక్కువ తిండి తీసుకుంటే అది అజీర్ణానికి, అనిద్రకు హేతువు అవుతుంది… సో, నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు డిన్నర్ ముగిస్తే బెటర్…

2) అపోహ… రోజుకు తప్పకుండా ప్రతి ఒక్కరూ 8 గ్లాసుల నీళ్లు తాగాలి…

నిజం… గ్లాసు సైజు ఎంత..? నంబర్ ఎంత..? ఇవి కాదు ముఖ్యం… ఎవరెంత నీళ్లు తాగాలో చెప్పడానికి చాలా అంశాలు పరిగణనలోకి వస్తాయి… వెదర్, చెమట, మనిషి శరీర స్వభావం, గర్భం, బ్రెస్ట్ ఫీడింగ్, ఓవరాల్ హెల్త్ వంటివి చూడాలి… The US National Academies of Sciences, Engineering, and Medicine ఏమంటుందంటే..? సగటు మనిషి సాధారణ వాతావరణ స్థితిలో రెండు మూడు లీటర్ల నీళ్లు తాగితే సరి… డీహైడ్రేషన్‌కు గురిగాకుండా, దప్పిక గాకుండా, ఇతర పానీయాలూ తీసుకుంటుంటాం కదా…

3) అపోహ… డిమ్ లైట్‌లో చదివితే కళ్లకు డేంజర్… చూపు పోయే ప్రమాదముంది…

నిజం… నష్టం మాట నిజమే, కానీ మరీ చూపు మొత్తం కోల్పోయేంత తీవ్రత మాత్రం ఉండదు… కళ్ల మీద స్ట్రెయిన్ పెరుగుతుంది… కళ్లు ఎర్రబడటం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఉంటాయి… సరైన వెలుతురులో చదవడమే మేలు…

4) అపోహ… నలుపు రంగు చర్మమున్నవాళ్లకు స్కిన్ కేన్సర్ రాదు…

నిజం… అధిక మెలనిన్ కారణంగా చర్మానికి వచ్చే నలుపు రంగు  సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రా వయలెట్ కిరణాల నుంచి కొంత రక్షణను ఇస్తుంది తప్ప మొత్తంగా చర్మ కేన్సర్ నిరోధించలేదు… చర్మ కేన్సర్‌కూ చర్మం రంగుకూ ఎలాంటి డైరెక్ట్ లింక్ లేదు… కాకపోతే ముదురు రంగు చర్మమున్న వాళ్లలో ఈ కేన్సర్ కేసులు కొంత తక్కువ…

5) సబ్బులపై ఉండే బ్యాక్టీరియా చర్మానికి ప్రమాదకరం, ఇతరులకు వ్యాపిస్తాయి…

నిజం… ఆమధ్య ఓ యాడ్ చూశాం కదా, బంటీ నీ సబ్బు స్లోయా ఏంటి..? వేగంగా శుభ్రపరచడం అనేది ఎవరూ నిర్ధారించలేరు గానీ సబ్బులపై చేరే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందనేది అబద్ధం… ఎవరైనా సబ్బు వాడాక స్టెఫాలోకాకస్, ఈకోలి వంటి బ్యాక్టీరియా  పెద్ద ఎత్తున చేరినా సరే, తరువాత ఆ సబ్బు వాడేవారికి అవి అంటవు…

6) అపోహ… అపానవాయువు (పిత్తు)ను నిగ్రహించడం, వదిలేయకుండా బిగబట్టి ఉంచడం వల్ల పేగులు, జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతింటుంది…

నిజం… పిత్తులు ఆపుకుంటే ఆ వాయువు ఒత్తిడితో కడుపు ఉబ్బరం, వికారం, నొప్పి, కడుపులో ఇబ్బంది ఉంటాయి తప్ప జీర్ణ వ్యవస్థపై అంత దీర్ఘకాలిక ప్రమాదం, నష్టాలు ఏమీ ఉండవు… ఎంత నిగ్రహించుకున్నా కాసేపయ్యాక వదలక తప్పదు…

7) అపోహ… డిటాక్స్ డైట్స్ (ఇదొక ఫుడ్ ప్లాన్) శరీరంలోని అన్ని మలినాలనూ బయటికి పంపించేస్తాయి.,.

నిజం… మానవ శరీరం తనలో చేరే మలినాలను బయటికి పంపించుకునే వ్యవస్థను సహజంగానే కలిగి ఉంటుంది… కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ, చర్మం, ఊపిరితిత్తులు చేసే పనులే ఇవి… ఉదాహరణకు హానికర పదార్థాలను కాలేయం, మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి కదా… చర్మం కూడా చెమట రూపంలో విసర్జిస్తుంది… కాకపోతే ఒకటి నిజం, ఈ డైట్ ప్లాన్‌లో ఆల్కహాల్ నిషేధం, ప్రాసెస్డ్ ఫుడ్ నిషేధం పరోక్షంగా మనిషి శరీరానికి మంచిదే…

8) అపోహ… చక్కెరను అధికంగా తింటే అది మధుమేహానికి (డయాబెటిస్, సుగర్) దారితీస్తుంది…

నిజం… ఇది సంక్లిష్టమైన అంశం… మనం తీసుకునే సుగర్‌కూ డయాబెటిస్ రావడానికీ నేరుగా లింక్ లేదు… డయాబెటిస్ రావడానికి మన లైఫ్ స్టయిల్, డైట్ వంటి అనేక కారణాలుంటాయి, కేవలం సుగర్ తీసుకోవడం వల్ల కాదు… టైప్ 1 డయాబెటిస్ ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల వస్తుంది… కాకపోతే ఒకసారి డయాబెటిస్ వచ్చాక సుగర్ వినియోగం గరిష్ఠ స్థాయిలో తగ్గాల్సిందే…

9) అపోహ… క్యారెట్స్ కంటి దృష్టిని మెరుగుపరుస్తాయి…

నిజం… క్యారెట్స్ స్థూలంగా కంటిచూపుకి మంచివే కానీ నేరుగా అవి తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని, దృష్టిలో స్పష్టత వస్తుందనీ ఆశించలేం… క్యారెట్లలో బీటా కెరటిన్లు ఎక్కువ, విటమిన్ ఏ పెరగడానికి దోహదపడుతుంది… ఈ విటమిన్ కంటిచూపుకి కీలకం… జన్యుపరమైన, వయోపరమైన, అరోగ్యపరమైన కంటిచూపు లోపాల్ని క్యారెట్స్ నేరుగా సరిదిద్దవు…

10) అపోహ… పిడికిళ్లు బిగించడం, మెటికలు విరవడం కీళ్లవాతానికి దారితీస్తుంది…

నిజం… వేళ్లను విరవడం వల్ల శబ్దాలు వస్తాయి అంతే… పైగా జాయింట్స్ లూబ్రికేషన్‌కు కారణమయ్యే సినోవియల్ ఫ్లూయిడ్‌లో చేరే బబుల్స్‌ను దూరం చేస్తాయి… కాకపోతే ఆ శబ్దాలు మన దగ్గరలో ఉండే కొందరికి ఇరిటేషన్ తెప్పించవచ్చు తప్ప నేరుగా ఈ అంశానికి కీళ్ల ఆరోగ్యంతో సంబంధం ఏమీ లేదు… మరీ బలవంతంగా వేళ్లను విరవడం మంచిది కాదు…

11) అపోహ… బయట చలిగా ఉన్నా సరే ఆల్కహాల్ శరీరంలో వేడిని కలుగజేస్తుంది…

నిజం… తాత్కాలికంగా ఆ ఫీల్ కలుగజేస్తుంది… చర్మానికి దగ్గరగా ఉండే రక్తనాళాలు వ్యాకోచించే ప్రభావం అది… అంతేతప్ప శరీరంలోని ఉష్ణాన్ని పెంచడం మాత్రం అబద్ధం… నిజానికి శరీరంలోని ఉష్ణం తగ్గేలా చేసి, ఆల్కహాల్ ప్రభావం మరింత చల్లబరుస్తుంది మనల్ని…

12) అపోహ… గుడ్లు గుండెకు చెడ్డవి…నిజం… గుడ్లు అనేకరకాలుగా మనిషి శరీరానికి ఉపయుక్తం… పోషకవిలువల రీత్యా… గుడ్లలో ఉండే డైటరీ కొలెస్టరాల్ ప్రభావం బ్లడ్ కొలెస్టరాల్ లెవల్స్ మీద చాలా తక్కువ… ఇలాంటి కొలెస్టరాల్ వల్ల బ్లడ్ కొలెస్టరాల్ లెవల్స్ ప్రమాదకరంగా పెరుగుతాయనీ, గుండె పోట్లు వస్తాయనీ, ధమనులు పూడుకుపోతాయనేది నిజం కాదు…

13) అపోహ… ఫిట్స్ వచ్చినప్పుడు మన నాలుకను మనమే కొరికేసి మింగేసే ప్రమాదం ఉంది…

నిజం… ఇది తప్పు… కండరాల కదలికలు, ఒత్తిడి కారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు నాలుక అటూ ఇటూ కదులుతుంది, తిరుగుతుంది… అంతేతప్ప నాలుకను కొరుక్కుని మింగేయడం అసాధ్యం… ఇలాంటి సమయాల్లో కాస్త గాలి ఆడేలా, చుట్టూ ఉన్నవారిని పక్కకు కదిలించి, పడుకోబెట్టి, దగ్గరలో ఉండే హానికరమైన వస్తువులను తీసేయాలి… నోటిలో వేళ్లు, ఇతరత్రా ఏమీ పెట్టకూడదు… వీలైతే వైద్యసహాయం కోసం ప్రయత్నించడం బెటర్…

14) అపోహ… మూడుసార్లు భారీగా తినడంకన్నా చిన్న మొత్తాల్లో ఎక్కువ సార్లు తినడం బెటర్…

నిజం… రోజుకూ మూడుసార్లు భోజనం చేయాలా, ఎక్కువసార్లు చేయాలా అనేది మన వ్యక్తిగత ఇష్టం, ప్రాధాన్యతల మీద ఆధారపడి ఉంటుంది… అంటే మన లైఫ్ స్టయిల్ కూడా… డయాబెటిస్ ఉన్నవాళ్లు బెటర్ ఇన్సులిన్ ఉత్పత్తి కోసం చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువ సార్లు మీల్స్ చేస్తారు… ఆకలిని బట్టి, మన ఎనర్జీ లెవల్స్‌ను బట్టి కొందరు రెండుమూడుసార్లు ఎక్కువ మొత్తంలో మీల్స్ చేస్తే, కొందరు దానికి భిన్నంగా వెళ్తారు… నిజానికి నంబర్, సైజ్ కాదు, తీసుకునే ఆహారం క్వాలిటీ, పోషకాల విలువ ప్రధానం…

15) అపోహ… చలి వాతావరణం మిమ్మల్ని అనారోగ్యవంతులను చేస్తుంది…

నిజం… చలి వాతావరణం నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయదు, కానీ పరోక్షంగా అనారోగ్యాన్ని కలగజేయవచ్చు… క్రిములు మాత్రమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి… తడి జుట్టుతో బయట చలి వాతావరణంలోకి వెళ్తే, అనారోగ్య క్రిములు ఏమీ లేకపోతే మనకూ ఏమీ కాదు… (సోర్స్ అండ్ క్రెడిట్స్ :: ఇండియాటుడే) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions