.
అంతకుముందు మొక్కల్లో జీవం లేదనీ, చెట్లన్నీ నిర్జీవాలనీ మనిషి భావించేవాడు… కానీ మొక్కల్లో జీవం ఉందని కనిపెట్టిన శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్… ఆయన ఒక భారతీయ శాస్త్రవేత్త.., 1901 లో, మొక్కలు కూడా జంతువుల మాదిరిగానే ప్రతిస్పందిస్తాయని కూడా నిరూపించాడు…
అంటే… ఆయన క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగించి, మొక్కలు కూడా జంతువులలాగే ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయని.., నొప్పిని, సంతోషాన్ని అనుభవిస్తాయని నిరూపించాడు… మొక్కల జీవిత చక్రం, పునరుత్పత్తి వ్యవస్థ, వాటి చుట్టూ ఉన్న వాతావరణం గురించి తెలుసుకునే సామర్థ్యాన్ని కూడా ఆయన నిరూపించాడు…
ఇది మళ్లీ ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… బాధను అవి వ్యక్తీకరిస్తాయి… ధ్వనులు చేస్తాయి… అవి కొన్నిరకాల కీటకాలకు అర్థమవుతాయి… అంటే మొక్కల భాష అర్థం కావడం… అదీ జంతుజాతికి…! విశేషమైన పరిశోధన ఇది… ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధించి తేల్చిన విశేషం ఇది…
Ads
ఈ రీసెర్చ్ కోసం వాళ్లు చిమ్మటల మీద ప్రయోగాలు జరిపారు… అవి సాధారణంగా తమ గుడ్లను టమాటా మొక్కల మీద పొదుగుతూ ఉంటాయి… గుడ్ల నుంచి బయటికి వచ్చే లార్వాలకు ఆ మొక్కల భాగాలు, ఆకులు ఆహారం… ఐతే ఏ టమాటా మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏవి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నాయో, ఆ మొక్కలు విడుదల చేసే ధ్వనితరంగాల ఆధారంగా తెలుసుకుంటాయట…
తమ అనారోగ్యాన్ని ఆ మొక్కలు అల్ట్రాసోనిక్ ధ్వని సంకేతాలుగా చెబుతుంటాయి… మనిషి చెవులు వాటిని గ్రహించలేవు గానీ కొన్ని కీటకాలు వాటిని అర్థం చేసుకోగలవు… ఇదీ పరిశోధన సారాంశం… వృక్షాలకూ ఉద్వేగాలుంటాయి, అవి వ్యక్తీకరిస్తుంటాయి, అవి జంతుజాతికీ అర్థమవుతుంటాయనే పరిశోధన ఖచ్చితంగా ఓ సంచలనమే…
రాబోయే రోజుల్లో తెగుళ్లు, పంట ఉత్పత్తి, రసాయనాల వాడకం వంటి అనేక అంశాలను ప్రభావితం చేయగల పరిశోధన ఇది… కాకపోతే ఇది ప్రాథమిక దశ… ఇంకా చాలా దూరం వెళ్లాలి… ఎంతసేపు..? ఇప్పుడున్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ మేధస్సు, విశ్లేషణ సామర్థ్యాలను బట్టి… త్వరలోనే మనిషి మొక్కలు, చెట్లతో ధ్వనిబంధం ఏర్పరుచుకోగలడు… ఖాయం…
Share this Article