Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బండ్ల శిరీష..! ఆస్ట్రోనాటేనా..? ఆస్ట్రోటూరిస్టా..? మీకు తెలియని ఇంకొన్ని సంగతులు..!

July 14, 2021 by M S R

అయిపోయిందా..? అంతరిక్షం నుంచి ఇంకా కిందకు దిగివచ్చారా లేదా..? మన బండ్ల శిరీష ఏ కులమో చర్చించుకుంటూ, ఫేస్ బుక్‌లో మస్త్ విజయోత్సహాలు జరుపుకున్నాం కదా, ఆ హ్యాంగోవర్ తగ్గిందా..? భారతీయ మూలాలున్న మూడో మహిళా వ్యోమగామి, నాలుగో ఆస్ట్రోనాట్ అని ఘనంగా వార్తాకథనాలు కూడా రాసుకున్నాం, చదువుకున్నాం కదా… మన గుంటూరు, మన తెనాలి దాకా ఓన్ చేసుకున్నాం కదా… గుడ్… మన అమ్మాయి అమెరికా వెళ్లేందుకు విమానం ఎక్కితేనే సంబరపడిపోతాం, పది మందికీ చెప్పుకుని ముచ్చటపడతాం, మరి అంతరిక్షంలోకి వెళ్తే చప్పట్లు కొట్టలేమా..? ఆనందపడిపోమా..? అమెరికా వెళ్లిన మనవాళ్లు డాక్టరీ, సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు… అన్ని భిన్న రంగాల్లోనూ కాళ్లు, వేళ్లూనుకుంటున్నారని సంతోషపడిపోమా..? ఇదీ అంతే… అయితే..?

bandla

– ఆమె చదివింది Aerospace, Aeronautical, Astronautical Engineering… అందుకే ఒక ఆస్ట్రో టూరిజం వ్యాపారసంస్థలో చాన్స్ దొరికింది… ఆమె ఆస్ట్రో సైంటిస్టు కాదు… ఆస్ట్రో టూరిస్ట్… ఆ స్పేస్ టూరిజం సంస్థలో ఓ ఉన్నతోద్యోగి… ఇది నిరాశావాదం నిండిన కథనం ఏమీ కాదు… నిజమేమిటో చెప్పుకునే కథనం… పెసిమిజం కాదు, నిజం… రిచర్డ్ బ్రాన్సన్ అనే ఓ బ్రిటిషర్ పక్కా వ్యాపారి, కానీ సాహసి… పదిమంది వెళ్లే పంథాలో గాకుండా భిన్నంగా వెళ్తాడు, ధైర్యంగా వెళ్తాడు… వర్జిన్ అనే ఒక గ్రూపు తనది… మూణ్నాలుగు వందల రకాల వ్యాపారాలు చేస్తాడు తను… ఇప్పుడు తను అడుగుపెట్టిన కొత్త వ్యాపారపంథా అంతరిక్ష పర్యాటకం… స్పేస్ టూరిజం… తనొక్కడే కాదు, ఇతర గ్రూపులు కూడా ఆ ఆలోచనల్లో ఉన్నయ్… డబ్బు ఏంచేసుకోవాలో కూడా తెలియనంతగా సంపాదించిన వాళ్లు ఉన్నారు కదా, వాళ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చే టూరిజం దందా…

Ads

sirisha

70 ఏళ్ల వయస్సులో… స్పేస్ క్రాఫ్ట్స్ రూపొందించి, ప్రయోగాలు చేసి, ఇక ఏకంగా తనే తాజా టెస్ట్ క్రాఫ్ట్‌లో అడుగుపెట్టాడు బ్రాన్సన్… మెచ్చుకోవాలి, ఆ వయస్సులోనూ ఆ దూకుడు ఆలోచనధోరణికి… తనతోపాటు మరో అయిదుగురినీ తీసుకుపోయాడు… ఇద్దరు పైలట్లు, మిగిలినవారిలో ఒకరు మన బండ్ల శిరీష… వీళ్లు అంతరిక్షానికి వెళ్లి మానవాళి కోసం చేసే ఖగోళ పరిశోధనలు ఏమీ ఉండవ్… అదొక ఉత్తేజపూరిత పర్యాటకం మాత్రమే… అంటే శిరీష సక్సెస్‌ఫుల్ కెరీరిస్ట్… తన వృత్తిజీవితంలో తనకు ఓ విజయం… అంతే… నిజంగా అంతే… – నాసా, షార్ వంటివి అంతరిక్ష పరిశోధనలు చేసే వివిధ దేశాల ఖగోళ సంస్థలు… అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల కూడా ఉంది… వ్యోమగాములు వెళ్లడం, అక్కడ రోజుల తరబడీ ఉండటం, పరిశోధనలు చేయడం… అది ఓ సైన్స్… మన భారతీయ మూలాలున్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాకేష్ శర్మ… వాళ్లంతా వ్యోమశాస్త్రవేత్తలు… బండ్ల శిరీష కేవలం ఓ వ్యోమపర్యాటకురాలు… తేడా అర్థమైంది కదా… సరే, ఎవరైతేనేం..? అంతరిక్షంలోకి అడుగుపెట్టింది కదా..? కాదేమో… అదీ ఓ సందేహమే…

space

అసలు అంతరిక్షం అంటే ఏమిటి..? ఈ నిర్వచనం దగ్గరే వస్తోంది చిక్కు… సముద్ర ఉపరితలం నుంచి 80 కిలోమీటర్లు దాటితే చాలు, ఇక అదంతా అంతరిక్షమే అంటాడు అమెరికావాడు… ఎహె, కాదు, 90, 100 కిలోమీటర్లు దాటాలి అంటాయి మిగతా దేశాలు… ఈ బోర్డర్‌ను కర్మన్ లైన్ అంటాం… జస్ట్, దాన్ని అలా దాటేసి, మూణ్నాలుగు నిమిషాల్లో తిరిగి మిసోస్పియర్‌లోకి… అంతే మన వాతావరణంలోకి వచ్చేస్తే… దాన్ని అంతరిక్షయానం అనాలా..? వాళ్లను వ్యోమగాములు అనాలా..? ఈ చర్చ ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తోంది… ప్రొఫెషనల్ ఆస్ట్రో సైంటిస్టులు ఈ స్పేస్ టూరిజాన్ని లైట్ తీసుకుంటారు, ఈ వార్తలన్నీ చదివి నవ్వుకుంటారు… దానికి కారణాలు బోలెడు… మానవాళి భవిష్యత్తు అన్వేషణ అంతరిక్ష పరిశోధన… శిరీష టీం చేసింది కేవలం వ్యాపారం… ప్రధాన తేడా అది… ఆమెకు తనేమిటో తెలుసు… అందుకే ఎక్కడా గొప్పలు చెప్పుకోలేదు… కంపెనీకి అవసరమైన మేరకే చెబుతుంది… అంతే…

sirisha2

శిరీష ఆ వర్జిన్ గ్రూపుకి చెందిన ఈ అంతరిక్ష టూరిజం ప్రాజెక్టుకు వైస్ ప్రెసిడెంట్… అదీ ప్రభుత్వ వ్యవహారాల విభాగానికి… సో, ఈ సాహసయాత్రను తను సరే అనడం, ఆ టీంలో చేరిపోవడం… బ్రాన్సన్ రియాలిటీలో బతికే మనిషి… నేను ఒక వ్యాపారిగా, ఒక వినియోగదారుడిగానే ఈ టూర్‌ను మదింపు చేసుకుంటున్నాను అన్నాడు… తన అంచనాలను బట్టి తన వ్యాపార ప్రణాళికలుంటయ్… తన ప్రణాళికలు సక్సెసయితే కోట్ల డాలర్లు గుమ్మరించగల టూర్లు అవి… సో, కర్మన్ లైన్ దాటిందా లేదా..? ఆమె సైంటిస్టా కాదా..? ఆమె టూర్లతో మానవాళికి వచ్చేదేముంది..? అసలు ఆమెను ఆస్ట్రోనాట్ అనొచ్చా లేదా..? ఎవరిష్టం వాళ్లు..? కానీ ఖచ్చితంగా ఆమెది ఓ సాహసమే.., ఎలాగంటే..?

sirisha

చిన్నప్పటి నుంచీ చుక్కలు ఇష్టం, ఆకాశం ఇష్టం… నాలుగేళ్ల వయస్సులో అమెరికాలో ఉండే అమ్మ, నాన్న, అక్క దగ్గరకు ఒక్కదాన్నే పంపించారు… ఓ తోటి ప్రయాణికుడిని కాస్త చూసుకొమ్మని చెప్పారు… అంతే, ఆమె ఏమీ భయపడలేదు… బోరుమని ఏడవలేదు… అదీ శిరీష… సో, ఆ గుణమే ఆమెను తొలి స్పేస్ టూరిస్ట్ క్రాఫ్ట్ ఎక్కేలా చేసిందేమో… శిరీష తల్లిదండ్రులు ఉన్నతవిద్యలు చదివినవాళ్లే… అక్క ప్రత్యూష ఆర్గానిక్ సైన్స్ టెక్నీషియన్… తాత రాగయ్య హైదరాబాద్ వ్యవసాయ వర్శిటీలో మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్… అమ్మ తరపు తాత వెంకటనర్సయ్య రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్… విద్యాధిక వాతావరణంలో పెరగడం కూడా ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్…

సియాన్ హు అనే బాయ్ ఫ్రెండ్ ఆమెకు…! 2019 నుంచీ ప్రేమ… May 29, 2022న తెలుగు సంప్రదాయంలోనే పెళ్లి చేసుకోబోతున్నారు… తన గురించి మీకు వెబ్ ప్రపంచం పెద్దగా వివరాలు ఏమీ చెప్పదు… చెప్పడం లేదు… చెప్పుకోవడానికి ఇష్టపడడు… చివరగా :: ఆమెకు నాసాలో పనిచేయడం అంటే ఇష్టం… కానీ ఐసైట్ కారణంగా రిజెక్టయింది… అయితేనేం… అంతరిక్ష పంథాలోనే ప్రయాణిస్తోంది..!! (ఈ స్టోరీ గనుక నచ్చితే ‘ముచ్చట’కు ఆర్థికంగా అండగా నిలవండి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions