Nancharaiah Merugumala …….. ఇద్దరు అత్యంత సంపన్న ‘ఏపీ’ముఖ్యమంత్రులూ (వైఎస్ జగన్, పేమా ఖాండూ) మైనారిటీ మతస్థులే, ఒకరు క్రైస్తవ, మరొకరు బౌద్ధ మార్గీయులు!
………………………………………………………………..
‘‘ఇండియాలో రాజకీయ అవినీతి ఓటర్లకు డబ్బు పంచి వారి ఓట్లు కొనుగోలు చేయడంతో మొదలవుతుంది. అధికారంలోకి రావడానికి కోట్లాది రూపాయల ధనం ఖర్చు చేసే నేతలు తాము పదవిలో ఉన్న ఐదేళ్లలో ఆ సొమ్ము రాబట్టుకోవడానికి చాలా ప్రయాస పడతారు,’’ అని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పేమా ఖాండూ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని ఈటానగర్ లో ‘డబ్బు సంస్కృతికి’ వ్యతిరేకంగా ఆయన ప్రచారోద్యమం ప్రారంభిస్తూ మాట్లాడారు.
Ads
వచ్చే ఎన్నికల్లో పంపిణీ చేసే సొమ్ములను బట్టిగాక పార్టీల పనితీరు ఆధారంగా నాయకులను గెలిపించేలా చేయడానికి జనం సహకరించాలని ఖాండూ కోరారు. 43 ఏళ్ల ఈ ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేశంలోని పెద్ద ఏపీ (ఆంధ్రప్రదేశ్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (50)కి కొన్ని పోలికలున్నాయి. ప్రజాస్వామ్య సంప్కరణల సంఘం (ఏడీఆర్) వివిధ పార్టీల నేతల ఎన్నికల అఫిడవిట్లలో స్వచ్ఛందంగా వెల్లడించే ఆస్తులను లెక్కగట్టి ప్రకటించిన వివరాల ప్రకారం–
భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రుల్లో జగన్ మొదటి స్థానంలో (రూ.510 కోట్లు) ఉండగా, ‘బుల్లి ఏపీ’ సీఎం పేమా ఖాండూ రెండో స్థానంలో (రూ.163.3 కోట్లు) ఉన్నారు. ఈ ఇద్దరు ‘యువ సీఎం’ల మధ్య మరో పోలిక ఏమంటే–వారిరువురూ మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు (రెలిజియస్ మైనారిటీస్) చెందినవారే. జగన్ ప్రొటెస్టెంట్ క్రైస్తవ (సీఎస్సఐ) కుటుంబంలో పుట్టగా, పేమా ఖాండూ అరుణాచల్ ప్రదేశ్ లో మెజారిటీవర్గమైన బౌద్ధ ధర్మం అనుసరించే కుటుంబంలో పుట్టారు.
ఇలా ఇద్దరు అత్యంత సంపన్న సీఎంలూ మైనారిటీలే కావడం భారత దేశ లౌకిక స్వభావానికి, ధర్మ నిరుపేక్ష జీవనశైలికి చక్కటి నిదర్శనం. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు భారత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్) లో 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ చొప్పించిన ‘సెక్యులర్, సోషలిస్టు’ అనే బలమైన మాటలను తొలగించేసింది సునాయాసంగా.
ఇక మళ్లీ రెండు ‘ఏపీ’ల ముఖ్యమంత్రుల విషయానికి వస్తే–ఈ సీఎంల ఇద్దరు తండ్రులూ వారి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి గారు ఐదేళ్ల 111 రోజులు పదవిలో ఉంటే, పేమా తండ్రి దోర్జీ ఖాండూ నాలుగు సంవత్సరాల 36 రోజులు అధికారంలో కొనసాగారు. ఈ సీఎంల తండ్రులకు ఉన్న మరో కీలక పోలిక ఏమంటే వారిద్దరూ సీఎం పదవిలో ఉండగా అధికార పర్యటనలపై వెళుతుండగా హెలికాప్టర్ ప్రమాదాల్లోనే మరణించారు.
దోర్జీ ఖాండూ మరణం (2011 ఏప్రిల్ 30న) వెనుక కుట్ర ఉందనే కథనాలు అప్పట్లో వచ్చాయి. అలాగే రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ కూలిపోయి చనిపోవడంపై (2009 సెప్టెంబర్ 2) కూడా కొందరికి అనుమానాలు లేకపోలేదు. ఇలా ఇద్దరు ప్రస్తుత ‘ఏపీ’ రాష్ట్రాల సీఎంలు జగన్, ఖాండూ మధ్య పైన వివరించిన పోలికలు ఉన్నాయి.
పేమా ఖాండూ తన తండ్రి దోర్జీ మరణించిన ఐదేళ్లకు 2016 జులై 17న ఏపీ సీఎం అయ్యారు. జగన్ అయితే తండ్రి వైఎస్సార్ కన్నుమూసిన దాదాపు పదేళ్ల తర్వాత 2019 మే 30న పెద్ద ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఖాండూ గత 7 సంవత్సరాల రెండు నెలలుగా పదవిలో ఉండగా, జగన్ నాలుగేళ్ల నాలుగు నెలలుగా అధికారంలో కొనసాగుతున్నారు.
Share this Article