కాంతారా రివ్యూ జోలికి పోవడం లేదు ఇక్కడ… హైదరాబాద్‌లోని ఓ థియేటర్, ఉదయమే షో… ఫ్రీ పాసులున్న ఫిలిమ్ విలేకరులు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు… సినిమా అయిపోయింది… అప్పటిదాకా ఊగిపోయిన థియేటర్ ఒక్కసారిగా సైలెంట్… ఇంకేమైనా రాబోయే సీన్ ఉందేమో అని చూస్తున్నారు… సినిమా అయిపోయిందని తెలిశాక దాదాపు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్… వుయావ్ అనే రిషబ్ శెట్టి కేక అందరినీ వెంటాడుతోంది…
ఈ ప్రశంస సినిమా కథకు కాదు, చాలాచోట్ల మామూలు కథే, బోర్ కొడుతుంది కొంతసేపు… కానీ ఆ చివరి క్లైమాక్స్ సినిమాను, రిషబ్ శెట్టిని ఎక్కడికో తీసుకెళ్లింది… ఇది రొటీన్ ఫార్ములా రివ్యూల్లో ఇమడదు… ఓ ఫీల్ కావాలి… సరే, అప్పుడే రిషబ్ శెట్టికి దక్కాల్సిన అవార్డుల మీద చర్చలు కూడా మొదలయ్యాయి… అవార్డులు తన మెడలో పడకపోతే వాటి ఖర్మ… నిజానికి తనకు ఆల్‌రెడీ ఓ జాతీయ అవార్డు వచ్చింది 2018లోనే… అవార్డు కొత్తేమీ కాదు తనకు… కానీ నటుడిగా కాదు… Sarkaari Hiriya Praathamika Shaale, Kaasaragodu, Koduge అనే సినిమాకు బెస్ట్ చిన్న పిల్లల సినిమా అవార్డు వచ్చింది… నిజానికి అది సోషియో పొలిటికల్ కామెడీ…
రిషబ్ శెట్టి 2010 నుంచీ చిన్నాచితకా వేషాలు వేస్తున్నా సరే, బేసిక్‌గా తన దృష్టి దర్శకత్వం మీదే… 2016లో రికీ, కిరిక్ పార్టీలను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది… బెల్‌బాటమ్‌లో లీడ్ రోల్ చేశాడు… అది సూపర్ హిట్, తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు, దానికి సీక్వెల్ తీస్తున్నాడు… సో, రెండు పడవల మీద కాళ్లు కాదు, మూడు పడవల మీద కాళ్లు ఒకేసారి… అయిదు సినిమాలకు కేవలం నిర్మాత… మన తెలుగువాళ్లయితే ఇదే కాంతారా సినిమాకు 100, 200 కోట్ల ఖర్చు చెప్పేవాళ్లేమో… దిక్కుమాలిన గ్రాఫిక్స్ పెట్టేసేవాళ్లేమో…
Ads
కాంతారా బడ్జెట్ కేవలం 16 కోట్లు… కన్నడంలోనే వసూళ్లు 100 కోట్లు… ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగులో రిలీజు… ఇంకేం కావాలి..? కేజీఎఫ్‌కన్నా ఎక్కువ లాభదాయకత… తెలుగులో తీసుకున్నది అల్లు అరవింద్ కాబట్టి డబ్బింగు క్వాలిటీ బాగుంది… అయితే తెలుగు జనానికి కనెక్ట్ అవుతుందానే సందేహం ఉండేది… ఈరోజు టాక్‌తో అదీ పోయింది… కొన్ని అలా కుదురుతాయి… ఇదే సిమిలర్ ప్రయత్నం సీక్వెల్ పేరిట చేస్తే జనానికి నచ్చకపోవచ్చు కూడా… జనం మెదళ్లకు ఆ ‘కొత్తదనం’ ఎక్కింది… అలాగని వాళ్లంతా సినిమాలో చూపిన భూత్ కోళా, దైవారాధన, యక్షగాన తదితరాల్ని నమ్మాలని లేదు… జస్ట్, ఆ క్లైమాక్స్ ఎంత హై లోకి తీసుకెళ్లింది, తమను ఎంతగా ఇన్వాల్వ్ చేసింది… అదొక్కటే…
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ రిషబ్ శెట్టికి స్నేహితుడే… రక్షిత్ శెట్టితో స్నేహం చెప్పనక్కర్లేదు… రిషబ్ కాంతారా లీడ్ రోల్ చేస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ హెచ్చరించాడు తనను… ‘‘ఒరేయ్, నటన మీదే అంతగా కాన్సంట్రేట్ చేస్తే దర్శకుడిగా చచ్చిపోతావురా…’’ కానీ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, లోడ్ రోల్… అన్నింట్లోనూ సేమ్ పర్‌ఫామెన్స్… ‘‘ఈ హిట్‌కు కారణం మీరు నమ్మరు గానీ మా కన్నడ ప్రేక్షకులు పదేసి, ఇరవయ్యేసి మంది నాన్-కన్నడ ప్రేక్షకులకు ఈ సినిమా చూడాలంటూ సజెస్ట్ చేయడం… ఈ టాక్‌ను కొట్టేది లేదు… ’’ అంటున్నాడు రిషబ్…
‘‘మా సినిమాటోగ్రాఫర్ అర్వింద్ (ఈ సినిమా సక్సెస్‌లో కీలకం) అయిదారేళ్ల క్రితం రిక్కీ సినిమా సమయంలో డ్రోన్ ఆపరేటర్… తరువాత లూసియాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ను చేశాం, నా కిరీక్ పార్టీ సినిమాకొచ్చేసరికి అసోసియేట్ కెమెరామన్ హోదా ఇచ్చేశాం…’’ అన్నాడు నవ్వుతూ… నువ్వు ఆస్తికుడివేనా అనడిగితే… ‘‘వై నాట్… సినిమాలో చూపించినవి కూడా నమ్ముతాను… షూటింగుకు ముందు ధర్మస్థలి వెళ్లి, మంజునాథ ఆశీస్సులు తీసుకున్నాకే కొల్ల షూట్ స్టార్ట్ చేశాం…’’ అని బదులిచ్చాడు… ప్రస్తుతం చేతిలో ఆరు సినిమాలున్నయ్, నాలుగు లీడ్ రోల్స్, రెండు డైరెక్టర్‌గా… కన్నడ ఇండస్ట్రీలో ఏమిటింత మార్పు..?!
Share this Article