Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ టాలీవుడ్ ఇంట్రస్టింగ్ ముచ్చట్లు మీరెప్పుడైనా విన్నారా..? (పార్ట్-1)

February 16, 2023 by M S R

Sankar G……..  సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం. 1. యస్వీ రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లి చాప్లిన్ రంగారావు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మర్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు బిఎన్ రెడ్డి.

2. నందమూరి తారకరామారావు తనకు 40 ఏళ్లు వచ్చాక, కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. వెంపటి చినసత్యం మాస్టారి వద్ద ఆ నాట్యాన్ని అభ్యసించారు. నర్తనశాలలో తాను పోషించిన బృహన్నల పాత్రకు న్యాయం చేయడం కోసం రామారావు నాట్యాన్ని శ్రమించి నేర్చుకున్నారు.

3. హిందీ నటుడు దిలీప్ కుమార్ దేవదాసు పాత్ర ద్వారా యావత్ భారతదేశానికి సుపరిచితుడయ్యాడు. అంతకుముందే వివిధ భాషలలో వేరు వేరు నటులు దేవదాసు పాత్రను పోషించారు. ఓ ఇంటర్వ్యూలో విలేఖరి దిలీప్ కుమార్‌ను ప్రశ్నిస్తూ, ఆయనకు ఏ నటుడు పోషించిన దేవదాసు పాత్ర ఇష్టమని అడగగా, దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు పోషించిన దేవదాసు పాత్ర తనను బాగా ఆకట్టుకుందని దిలీప్ తెలిపారు.

Ads

4. కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనను కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా షూటింగ్‌‌లో భాగంగా గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరిచూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలేవీ అందుబాటులో లేవు. ఆఖరికి ది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి, వారి ప్రత్యేక విమానంలో హుటాహుటిన మద్రాసు చేరుకున్నారు.

5. నటుడు చంద్రమోహన్ సతీమణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆమె పేరేమిటో తెలుసా? జలంధర. ఆమె అగ్ని పుష్పం, ఎర్ర మందారాలు, చిత్రశిల, మైనపు బొమ్మ, సాలభంజిక లాంటి కథలు రాశారు. పున్నాగపూలు, స్మృతి చిహ్నం వంటి నవలలు రాశారు.

6. నటుడు హరనాథ్ తండ్రి బుద్ధరాజు వరహాలరాజు గొప్ప చారిత్రక రచయిత, పరిశోధకుడు. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గొప్ప మహద్గ్రంథాన్ని ఆయన రచించారు. అలాగే తన పరిశోధనలలో భాగంగా 900 గ్రామాలను సందర్శించారు.

7. అలనాటి హాస్యనటుడు కస్తూరి శివరావు మద్రాసు పాండీబజారులో బ్యూక్ అనే ఫారిన్ మోడల్ కారు కొనుగోలు చేసిన వారిలో ప్రథముడు. మద్రాసు వీధులలో ఆ కారు తిరిగితే, అది కచ్చితంగా శివరావుదే అని ప్రజలు ఇట్టే చెప్పేసేవారు. అయితే తన చరమాంక దశలో శివరావు అదే పాండీ బజార్ వీధులలో సైకిల్ మీద తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు కారణం తాగుడికి బానిసై ఆర్థికంగా కూడా ఆయన చాలా నష్టపోవడం.

8. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా అనేక చిత్రాలలో నటించారు. కానీ ఆయన గొప్ప రచయిత కూడా. తెలుగువారి జానపద కళారూపాలు, పోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్య కళావికాసం, తెలుగువారి చలన చిత్ర కళ లాంటి గొప్ప పరిశోధక గ్రంథాలను ఎన్నో రాశారు. అలాగే ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యులలో మిక్కిలినేని కూడా ఒకరు.

9. అనేక తెలుగు పౌరాణిక చిత్రాలలో శకుని పాత్రను పోషించిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి. ఆయన పలు సాంఘిక సినిమాలలోని ప్రతినాయక పాత్రలలో కూడా రాణించారు. కానీ వార్థక్యం వచ్చాక ఆయన తన జీవితాన్ని భగవంతుడి సేవకే అర్పించారు. సన్యాస దీక్షను స్వీకరించారు. శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతిగా పేరు మార్చుకొని ఆశ్రమం నిర్మించుకొని, అందులోనే నివసించేవారట.

10. మాయాబాజర్ లాంటి చిత్రాలలో శకుని పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు. అయితే ఆయన కెరీర్ తొలినాళ్ళలో శ్రీకృష్ణుడిగా కూడా నటించారట. ద్రౌపది వస్త్రాపహరణం (1936) లాంటి చిత్రాలలో ఆయన కృష్ణ పరమాత్ముడిగా నటించారు.

11. గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనికి భార్యగా నటించిన శాంత కుమారి, నిజ జీవితంలో ఆయన కంటే 8 సంవత్సరాలు పెద్దవారు. అలాగే అదే చిత్రంలో గుమ్మడికి పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు అతని కంటే 3 సంవత్సరాలు పెద్ద. గుమ్మడికి చిన్నకుమారుడిగా నటించిన జగ్గయ్య అతని కంటే సంవత్సరం పెద్ద.

12. నటుడు రేలంగి వెంకట్రామయ్య హాస్య నటుడిగా సుపరిచతులు . కానీ పేరు, డబ్బు వచ్చిన తర్వాత తోటి హాస్యనటులకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన చిత్రాలను కావాలనే తగ్గించుకున్నారట. ఎవరైనా నిర్మాతలు తనను సంప్రదిస్తే, ఆయన తన బదులు ఇతర కళాకారులను సిఫార్సు చేసేవాడట. ఇంత ఉదారత ఎంతమందికి ఉంటుంది. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో చలం, పద్మనాభం మొదలైన వారున్నారు.

13. నటుడు చిరంజీవి తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్‌సీసీ క్యాడెట్‌గా కూడా రాణించారు. తన కళాశాల తరఫున ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ప్యారేడ్‌కి ప్రత్యేకంగా ఎంపికైన క్యాడెట్లలో ఆయన కూడా ఒకరు. ఈ ప్యారేడ్‌లో ప్రదర్శించిన సంప్రదాయ వేషధారణలలో చిరంజీవి పోతురాజు పాత్ర పోషించారు. తనతో పాటు ప్రదర్శనలో పాల్గొన్న మరొో విద్యార్థిని పోలేరమ్మ వేషాన్ని ధరించింది.

14. సినీ నటుడు అక్కినేని నాగార్జున తన సతీమణి అమలతో కలిసి హైదరాబాద్‌లో జంతు హక్కుల పరిరక్షణకై బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సంస్థను స్థాపించారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ ఇది. కొన్ని వందల వీధి కుక్కలను సంరక్షించే బాధ్యతలను ఈ సంస్ధ చేపట్టింది.

15. నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య 369 చిత్రానికి ప్రేరణ HG Wells రాసిన ఆంగ్ల నవల The Time Machine. ఈ విషయం సింగీతం వారే తెలిపారు. అలాగే Back to the Future అనే హాలీవుడ్ సినిమాలోని సన్నివేశాలను కూడా ప్రేరణగా తీసుకున్నారన్నది పలువురి విమర్శకుల అభిప్రాయం.

16. నటుడు నాని హీరో కాకముందు దర్శకుడు బాపు వద్ద క్లాప్ డైరెక్టరుగా రాధా గోపాళం అనే సినిమాకు పనిచేశాడు. అలాగే ఒక సంవత్సరం ఓ రేడియో ఛానల్‌లో ఆర్జేగా కూడా పనిచేశాడు.

17. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఉయ్యాలా జంపాలా. చిత్రమేంటంటే, ఈ చిత్రంలోని పలు సంభాషణలను రాజ్ తరుణ్ తానే స్వయంగా రాసుకున్నాడు. అలాగే కొంతవరకు స్క్రీన్ ప్లే వర్క్ కూడా చేశాడు.

18. నటుడు వరుణ్ సందేశ్ తాతయ్య ప్రముఖ తెలుగు రచయిత జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి. ఆయన ఆల్ ఇండియా రేడియాలో దాదాపు 28 సంవత్సరాలు పనిచేశారు.

19. రవితేజ హీరో కాకముందు పలు బాలీవుడ్ సినిమాలకు కూడా అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేశాడు. ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజ్, క్రిమినల్ అందులో ప్రధానమైనవి.

20. కరుణామయుడు, షిర్డీసాయి బాబా, యోగి వేమన, కబీర్ దాస్ లాంటి చిత్రాలతో పాపులర్ అయిన నటుడు విజయ్ చందర్. ఈయన తాతగారు ఎవరో తెలుసా? ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం గారు. చిత్రమేంటంటే టంగుటూరి ప్రకాశం గారి బయోపిక్ “ఆంధ్రకేసరి”లో కూడా టైటిల్ రోల్‌ను విజయచందరే పోషించారు…. (తరువాయి రెండో భాగంలో….)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions