The Future: “సైన్స్ లో ఆర్డినరీ డిగ్రీ లేదా పీజీ చేస్తే ఏమి భవిష్యత్తు ఉంటుంది? ఇంజనీరింగ్ లో చేరు” ఇది నేడు తల్లితండ్రులు పిల్లలకు చెబుతున్న మాట. నిన్నటిదాకా పరిస్థితులు వేరు. ఇప్పుడు కృత్రిమ మేధ/ రోబో యుగం మొదలయ్యింది. జాబ్ మార్కెట్ ను ఇది తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. కృత్రిమ మేధ ‘విద్య’ నిర్వచనాన్ని తిరగరాస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత వేగం పుంజుకోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చదువుకు భవిష్యత్తు వుంటుంది?
ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. సర్టిఫికెట్ లు, మార్కులు చూసి ఉద్యోగాలిచ్చే కాలం పోయింది. పరిజ్ఞానం, నైపుణ్యాలు… వీటి ఆధారంగా మాత్రమే ఇక జాబ్ మార్కెట్ నడుస్తుంది. ఇవి ఉన్నవారికే ఉద్యోగాలు వస్తాయి. రోబో యుగంలో ఒక నైపుణ్యం కీలకం కానుంది. అది- ‘కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ’. దీన్ని తెలుగులో ‘అభిజ్ఞవశ్యత’ అని చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్, ఫైనాన్స్, మానేజ్మెంట్.. ఈ మూడు సబ్జెక్టుల మధ్య సంబంధం ఉందా? పెద్దగా ఏమీ లేదనే అనిపిస్తుంది కదా?
ఒకాయన డాక్టర్ కోర్స్ చేశాడు. ఆసుపత్రి ప్రారంభించాడు. అది ఇంతింతై వటుడింతై అన్నట్టు పెద్దదయింది. ఇప్పుడు ఆ పెద్ద డాక్టర్ గారు ఆసుపత్రి మానేజ్మెంట్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. అంటే తన కింద పని చేసే ఉద్యోగుల పని తీరు కనిపెట్టడం, వారిని మోటివేట్ చెయ్యడం, రోగుల బంధువులతో మాట్లాడడం, వారిని సమాధాన పరచడంలాంటి పనులకే అయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. అయన ఎంబీబీస్ లో, అటుపైన చదివింది వేరు. ఇప్పుడు చేస్తున్న పని వేరు.
Ads
భార్య, భర్త ఒక కర్రీ పాయింట్ పెట్టుకొన్నారు. వారివురూ వంటలు చెయ్యడంలో చేయితిరిగినవారు. అనతికాలంలోనే వారి కర్రీ పాయింట్ కు విపరీతమయిన పేరు వచ్చింది. ఇప్పడు వారి కింద ఇరవై మంది పని చేస్తున్నారు. భార్య భర్తలిద్దరూ ఇప్పుడు వంట చెయ్యడం దాదాపు మానేశారు. కర్రీ పాయింట్ మేనేజ్ చెయ్యడం దాన్ని విస్తరించడంపై దృష్టి పెడుతున్నారు.
పై రెండు ఉదాహరణలో తాము చదివిన లేదా తమకు పట్టున్న అంశాన్ని దాటి అవసరాల మేరకు వారు వేరే సబ్జెక్టు డొమైన్ లోకి వెళ్లిపోయారు. దీన్నే అభిజ్ఞవశ్యత అంటారు. అంటే ఈ నైపుణ్యం కొత్తది కాదు అని అర్థం అవుతుంది. కాకపోతే కృత్రిమ మేధ యుగంలో ఇదే కీలకం కానుంది.
ఒకే రోజులో .. ఆ మాటకు వస్తే ఒకే గంటలో అవసరాన్ని బట్టి తన మేధను ఉపయోగించే తీరు. నాది ఫలానా సబ్జెక్టు. నాకు ఇదే తెలుసు… .. ఇంతకంటే మించి చేయలేనని కాకుండా… ఒక నిమషంలో అవతలి వారిని అర్థం చేసుకోవడానికి సైకాలజిస్ట్ గా, కిందిస్థాయి ఉద్యోగులను ఉత్తేజపరచాడనికి మానేజ్మెంట్ స్పెషలిస్టుగా.. ఇంకో గంటలో బ్యాంకు వారితో లోన్ గురించి మాట్లాడడానికో లేదా ఉద్యోగుల జీతభత్యాల గురించి నిర్ణయం తీసుకోవడానికి ఫైనాన్స్ స్పెషలిస్టుగా ఇలా ఒకే రోజు, ఒకే మనిషి అనేక సబ్జెక్టుల పరిజ్ఞానాన్ని రంగరించి తన వృత్తిని, వ్యక్తి గత జీవితాన్ని విజవంతంగా నిర్వహించే నైపుణ్యాన్నే అభిజ్ఞవశ్యత అంటారు.
కృష్ణుడు గోపికలకు ప్రియుడు. ద్రౌపదికి అన్న. పాండవులకు పెద్ద దిక్కు. ఒక సంగీతకారుడు (మురళి). రాజనీతి తెలిసినవాడు. చతురత, లౌక్యం మెండుగా ఉన్నవాడు. తండ్రిగా మినహాయిస్తే మిగతా అనేక పాత్రల్లో రాణించినవాడు. కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీకి బహుశా ఇంతకు మించిన ఉదాహరణ లేక పోవచ్చు.
ఇంజనీరింగ్ అనేది సాంకేతికశాస్త్రం. ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వారికి తమ డొమైన్ లో స్పెషలైజ్డ్ నాలెడ్జి వస్తుంది. ఇది ఇప్పటిదాకా ఓకే. కానీ కృత్రిమ మేధ అనేక సబ్జెక్టుల పరిధిని చెరిపివేయనుంది. వాటి రూపాన్ని సమూలంగా మార్చివేయనుంది.
ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకొందాము. యంత్రాలు తయారు చేయడం, నిర్వహించడం ఈ సబ్జెక్టు డొమైన్ కదా. ఇప్పుడు కృత్రిమ మేధ వల్ల ఈ రంగంలో సమూల మార్పులు రానున్నాయి. డ్రైవర్లు లేని కార్లు వచ్చేశాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మరో పదేళ్లలో ఊహించలేని మార్పులు. ఈ పరిస్థితుల్లో పదేళ్ల క్రితం చదివిన మెకానికల్ ఇంజనీరింగ్ చదువు పనికొస్తుందా? వస్తుంది .. రాదు .. రెండు సమాధానాలు ఇవ్వాలి. మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా తన సబ్జెక్టు పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడం.. మార్పులను అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా అనుసరణ పొందడం .. ఇలా చేసిన వారు జాబ్ మార్కెట్లో నిలబడతారు. లేని వారు నయా నిరుద్యోగులుగా మిగిలిపోతారు.
సబ్జెక్టుల స్వరూపం, రూపు రేఖలు, పరిధి సమూలంగా మారిపోతున్న తరుణంలో బేసిక్ స్కిల్స్ వున్నవాడిదే రాజ్యం. ఆ స్కిల్స్ పునాదిగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారొచ్చు. ఇద్దరు వంటవాళ్ళున్నారు. ఒకాయన పరోటా చేయడంలో సిద్ధహస్తుడు. తింటే అయన చేతి పరోటానే తినాలని అందరూ అనుకొంటారు. మరొకాయన అన్ని వంటకాలు చేయగలడు. దేనిలో అంత పేరు లేదు. పరోటా తింటే కోలన్ కాన్సర్ ఖాయం అని ఆ ఏరియాలో అందరికీ తెలిసిపోయింది. పరోటా మాస్టర్ మరో వంటకానికి షిఫ్ట్ కాలేడు. ఉద్యోగం పోయింది. రెండో అయన సులభంగా మరో వంటకానికి షిఫ్ట్ అయిపోయాడు .
సైన్స్ డిగ్రీ / పీజీ చేసినవారికి ఒక సమస్యను చిన్న భాగాలుగా చేసి తమ క్రిటికల్ థింకింగ్, విశ్లేషణాత్మక పరిజ్ఞాన్ని ఉపయోగించి పరిష్కారాన్ని సాదించగలిగిన నేర్పు ఉంటుంది. అందుకే ఈ రోజు ఫైనాన్స్ రంగంలో క్వాంటిటేటివ్ అనలిస్ట్స్ గా, రిస్క్ మేనేజర్లుగా ఫిజిక్స్ మాథ్స్ లాంటి సైన్స్ సబ్జెక్టు లు చదివిన వారు రాణించగలుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఎక్కువగా జరగనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ కన్నా మంచి విద్యాసంస్థల్లో మాథ్స్, ఫిజిక్స్ లాంటి బేసిక్ సైన్స్ సబ్జెక్టు లు చదివిన వారిదే రాజ్యం కానుంది అంటారు ఐఐటీ ప్రొఫెసర్ కాజూరి.
కస్టమర్ సక్సెస్ స్పెసలిస్ట్, డేటా సైంటిస్ట్, కృత్రిమ మేధ నిపుణుడు, బిగ్ డేటా స్పెసలిస్ట్, ఫింటెక్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, క్లోడ్ కంప్యూటింగ్ స్పెషలిస్ట్, కమర్షియల్ హోర్టికల్జరిస్ట్, సైకలాజికల్ కౌన్సెలర్, అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ .. ఇవి రానున్న రోజుల్లో రానున్న ఉద్యోగాలు .
టైపిస్ట్, అకౌంటెంట్, ట్రావెల్ ఏజెంట్, సెక్రటరీ, బ్యాంకు క్లర్క్, పెయింటర్, డ్రైవర్, క్లరికల్ ఉద్యోగాలు, ఫుడ్ డెలివరీ ఉద్యోగాలు, గ్రాఫిక్ డిజైనింగ్, ప్లంబర్ , రిసెప్షనిస్ట్ .. రానున్నరోజుల్లో మాయం కానున్న ఉద్యోగాలు….. -వాసిరెడ్డి అమరనాథ్
Share this Article