Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యండమూరి వీరేంద్రనాథ్ నవలల్లోని కొన్ని విలువైన కొటేషన్స్…

March 30, 2023 by M S R

Sankar G……………..  #యండమూరి గారి రచనల నుండి కొన్ని విలువైన మాటలు…

ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మధుర ఘడియలు ఉంటాయి. మిగితా జీవితమంతా దానికి ఉపోద్ఘాతము, స్మృతి మాత్రమే.!

-లేడీస్ హాస్టల్

Ads

స్త్రీ ప్రేమ ఒక ప్రవాహం లాంటిది. కాలం ఎత్తు పల్లాల మీద కన్వీనియంట్ గా జారి వ్యక్తిత్వం ఒడుదుడుకుల మధ్య(అవగాహన పెరిగే కొద్ది) ఒక పర్వతాన్ని వదిలి మరో శిఖరాన్ని ప్రేమించి, చివరకు సముద్రం అనే భద్రతా భావంతో స్ధిరపడుతుంది. మగవాడికి ఆ భద్రతా భావం లేదు కాబట్టి, కొంతకాలానికి విభిన్నమైన సర్కిల్స్, అలవాట్లు వెతుక్కుంటాడు.

-అంతర్ముఖం

ఓ క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవటానికి జీవితకాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవటానికి జీవితకాలం పడుతుంది.

-లేడిస్ హాస్టల్

భవిషత్ పట్ల భయం, సెంటిమెంట్ల పట్ల బలహీనత, సామాజిక కట్టుబాట్ల పట్ల నిస్సహాయత.. ఇవే మనుష్యుల్ని బాధపెడతాయి. వేదనకి గురిచేస్తాయి.

-అగ్నిప్రవేశం

ఒక మనిషి తన అనుభవాన్ని, ఆలోచన్లనీ మరో మనిషితో పంచుకోవాలన్న తాపత్రయమే హ్యూమన్ రిలేషన్స్ కి పునాది.

-థ్రిల్లర్

వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్ధం మాత్రమే మిగులుతుంది.

-అతడు ఆమె ప్రియుడు

హత్య చేసినవాడు కూడా తనకు అనుగూణంగా ఒక ఆర్గ్యుమెంట్ తయారుచేసుకుంటాడు.

-రక్త సిందూరం

మరీ విషాదంగా ఉన్నప్పుడు నీ మనస్సు వైపు చూడు.. ఒకప్పుడు అమితమైన సంతోషం ఇచ్చినది అదే కదా!

-ఆనందో బ్రహ్మ

దేవుడి ముందు ఏకాగ్రతతో ధ్యానం చేసి, గుడిమెట్లు దిగుతూ ఎదురుగా వచ్చే అమ్మాయిని కళ్ళార్పకుండా చూసే మనిషి ఎలా తన ప్రవర్తనని సమర్ధించుకుంటాడు? ఆత్మవిమర్శ చేసుకుంటే అమ్మాయిని చూడడం అన్నా మానివేయాలి. లేకపోతే గుడికి వెళ్ళడం ఐనా మానేయాలి. దేని దారి దానిదే అన్నదే ఆత్మవంచన! ద్వంద్వ ప్రవృత్తి. డబుల్ సైకాలజీ!

-ఋషి

గెలుపు మనిషిని మిరిమిట్లు గొలిపే వెలుగులోకి నింపుతుంది. ఆ వెలుగుకి అలవాటు పడటానికి కళ్ళు కాస్త టైమ్ తీసుకుంటాయి. కళ్ళు కనపడని ఆ టైమ్ లో మనిషి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు.

-మరణమృదంగం

అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దు:ఖం.. ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందికి వెళతాం! ఎక్కితే పైకి వెళతాం!

-ది డైరీ ఆఫ్ మిసెస్ శారద

ఏనాటికైనా మంచితనానికే జయం అని ఎన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నా ముందుగా జయం అందుకునే వారు అధికారం, బలం ఉన్నవారు.!

-అంతర్ముఖం

ఏ సమస్యకయినా మూలకారణం వ్యక్తిత్వం లేకపోవడమే. ఏ రచయితా సమస్యకి పరిష్కారం చెప్పడు. మనుషులు ఎలా బ్రతకాలో మాత్రమే చెబుతాడు.

-అగ్ని ప్రవేశం

నిర్లిప్తతని దగ్గరికి రానివ్వకు. అదో రాక్షసిలాంటిది. ఒక్కసారి దాన్ని నీ దగ్గరికి ఆహ్వానించినా ఇక ఆ మత్తు నీ నరనరాల్లోకి పాకిపోతుంది. నీ లక్ష్యానికి దూరంగా తీసుకుపోతుంది.

-చెంగల్వపూదండ

నా ఈ భావాన్ని నీకు చెప్పటం కన్నా, నాలో నేను దాచుకుంటేనే మనసు అంతరంగపు పొరల్లో అది నిక్షిప్తమై సంతోషాన్ని ఇస్తుంది. చెప్పటం కన్నా చెప్పకపోవడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.

-వెన్నెల్లో ఆడపిల్ల

నీ చిరునవ్వు మిలియన్ డాలర్లయితే నేను కొనలేను నేస్తం. నీ చిరునవ్వు ఖరీదు లక్షమిలియన్ల రక్త కణాలైతే మాత్రం ధమనుల్నీ, సిరల్నీ పెనవేసి పిండి ఇవ్వగలను.

-చీకట్లో సూర్యుడు

నువ్వనేవాడివి గుర్తుందా? మనకిష్టంలేని వ్యక్తితో రతినైనా సాగించవచ్చు కానీ, పెదాల మీద ముద్దాడ లేమని.. పెదవులతో పెదవులు కలిపి ముద్దాడాలంటే ఎంతో ఇష్టం ఉండి తీరాలని.. లేకపోతే మొహం తిప్పేసుకోవాల్సి వస్తుంది.

-13-14-15

అన్ని విజయాల్లోకి గొప్ప విజయం దాన్ని ఎక్కువమంది గుర్తించడం.

-నల్లంచు తెల్లచీర

దు:ఖం అనేది చాలా చిత్రమైనది. పూర్తిగా వచ్చేసినా బావుంటుంది. అసలు రాకపోయినా బావుంటుంది. కానీ లావాలా గుండె లోతుల్లో కదులుతుంటే ఆ బాధ అనిర్వచనీయం.

-తులసి

రాత్రి మరీ నిశ్శబ్ధంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో శ్మశానపు జిల్లేళ్ళూ, వైరాగ్యపు ఉమ్మెత్తలు, నిరాశపు ఎడారి పూలు, నీటి మీదకు వంగిన కొమ్మ మీద కూర్చుని, తిరిగిరాని ప్రేయసి కోసం సంజెవెలుగులో కోయిలపాడే ఆర్తి గీతాన్ని వింటూ, దు:ఖాశ్రువుల్ని లెక్క బెట్టుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూడడం – విషాదం.

-వెన్నెల్లో ఆడపిల్ల

కంటి నుంచి ఒక నీటి చుక్క వెలువడి నాతో అన్నది.. “మిత్రమా.. ఇన్నాళ్ళూ నేను నీ గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్నాను. నీ బాధల్లోనూ పాలుపంచుకున్నాను. ఈ క్షణం నువ్వుపడే ఈ వ్యధను భరించలేక బైటకు వెళ్తున్నాను. నా ఈ వీడ్కోలు నీకేమాత్రమైన సంతోషాన్నిస్తే మిత్రమా.! నాకు అంతకన్నా కావాల్సిందేముంది.?”.. సెలవు.

-వెన్నెల్లో ఆడపిల్ల

నా చావుకి నేనే ఇంత భయపడుతున్నానే, ఎంతో కష్టపడి, శ్రమించి, మెదడులోకి విజ్ఞానాన్ని, వేలిచివర్లలోకి సాధనని తెచ్చుకున్న సంగీత విద్వాంసులు, కళాకారులు, సైంటిస్టులు, గణిత శాస్ర్తజ్ఞులు, రాజకీయ నాయకులు, వారంతా ఎంత బాధ పడి ఉండాలి? పచ్చటి పొలాల్ని, తోటల్ని, ఏళ్ళ తరబడి పెరిగిన అడవుల్ని ఒక తుఫాను నాశనం చేసినట్టు, అంత విజ్ఞానాన్ని కూడా ఒక్క చావు నాశనం చేస్తున్నది కదా.

-అంతర్ముఖం

తల్లి కడుపులో పెరుగుతున్న శిశువు నుదుటికన్నా స్వచ్ఛమైనది ఈ ప్రపంచంలో ఏది లేదు.

-ధ్యేయం

ఎక్కడైతే శతృత్వం ఉంటుందో అక్కడ మనిషి తన కంటూ ఒక రీజన్ ఏర్పరుచుకుని వాదించడం ప్రారంభిస్తాడు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ రీజన్ ఉండదు.!

-థ్రిల్లర్

శారీరక సుఖానికి, మానసిక వ్యధకు సంబంధం లేదని ఏనాడో తెలుసుకోవడం వల్లనేమో, ప్రతిక్షణం కీచులాడుకునే దంపతులు కూడా పిల్లల్ని కనగలుగుతున్నారు.

-మంచుపర్వతం

ఏ స్త్రీ అయినా, తనకి దగ్గరవటం కోసం తిరిగి పురుషుడి కళ్ళల్లో కోర్కె గుర్తించలేదంటే అది ఆత్మవంచన.! గుర్తించనట్టు నటిస్తే అది వేరే సంగతి.

-రాక్షసుడు

చాలామంది స్త్రీలు జీవితంలో ఏదో వెలితిగా ఉందని, ఆ వెలితిని పోగొట్టుకునే శక్తి తమకు లేదని బాధ పడుతుంటారు. దీనినే ‘గుడ్ గర్ల్ సిండ్రోమ్’ అంటారు.

-మీరు మంచి అమ్మాయి కాదు

ఈ ప్రపంచంలో చాలామంది మంచి మొగవాళ్ళు ఉండొచ్చు. కానీ, మంచిభర్తలు మాత్రం చాలా తక్కువ.

-ప్రియురాలు పిలిచే

మొగవాడికి శరీరం అనే రిఫ్రిజరేటర్ లో మెదడు అనే భాగం వేడక్కకుండా కాపాడే కంప్రెషర్.. స్త్రీ తాలూకు ఆలోచన.

-ప్రార్ధన

నిజమైన భార్య నిన్ను నవ్విస్తుంది. పాడిస్తుంది. ఏడిస్తే దగ్గరై ఓదారుస్తుంది. గుండె గది ఒంటరితనాన్ని తన జ్ఞాపకాలతో పోగొడుతుంది. వర్షపు చినుకుల శబ్ధాన్ని కూడా కలిసి వింటుంది. ఇస్తుంది.. తీసుకుంటుంది. అన్నీటికంటే బ్రతకటం ఎందుకో నేర్పుతుంది.

-భార్యాగుణవతిశత్రు

కథ అంటే కావలసిన చోట ఆనందాన్ని అతికించవచ్చు. వద్దంటే విషాదం తీసేయవచ్చు. జీవితం అలా కాదు.

-లేడీస్ హాస్టల్

చీకట్లో ఉన్నామని దిగులు పడుతూ కూర్చుంటే, జీవితం చివరివరకూ అగ్గిపెట్టె గూట్లోనే ఉండిపోతుంది.

-అగ్నిప్రవేశం

ఈ ప్రపంచంలో చాలామంది జీవితాన్ని అనుభవించరు. ప్రేక్షకుడిలా చూస్తుంటారు. మిస్సవుతున్నామనే తొందరపాటే వీళ్ళని ఏదైనా అనుభవించడానికి పురిగొల్పుతుంది. అంతే తప్ప, అందులోంచి ఆనందాన్ని ఆస్వాదించాలనే ఆసక్తి ఏమి ఉండదు ఇలాంటి వ్యక్తులకు.

-అబద్దం లాంటి నిజం(కథ)

తనేం సాధించాడో జీవితపు చివరి రోజుల్లో మనిషి తీరిగ్గా ఆలోచించుకోవడానికే వృద్దాప్యం అనేదాన్ని దేవుడు సృష్టించాడు.

-వెన్నెల్లో గోదావరి

జీవితంలో ఇవన్నీ మంచి అనుభవాలు, ఇవి చెడ్డవి అని వేరు వేరు ఉండవు. ఒక అనుభవంలోనే రెండు రకాల అనుభూతులు ఉంటాయి.

-దేవుడు.. నీ కులమేమిటి?

ప్రేమ – స్నేహం కన్నా పెద్దదైనది.. సెక్స్ కన్నా ఉదృతమైనది.!

-రాధ – కుంతి

గాయం వల్ల వచ్చిన అరుపు కంటే గాయం వలన వచ్చిన మచ్చకు గొంతెక్కువ. అది చాలా కాలం బాధిస్తుంది. ప్రేమ పరిమళపు ఆహ్లాదం కంటే ఆ తరువాత వచ్చే వియోగపు ముల్లు బాధే ఎక్కువ.

-ప్రేమ

ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏ లంచం అయినా ఇచ్చి లొంగదీసుకోవచ్చు. చాలా మార్గాలున్నాయి. కానీ మృత్యువు మాత్రం దేనికి లొంగదు. మూల్యంగా ప్రాణం చెల్లించాల్సిందే.

-అతడు ఆమె ప్రియుడు

గొడవపడితే సమసమాజం పేరు చెప్పి సరదాగా కారు అద్దాలు బ్రద్దలు కొడదామనుకున్న వాళ్ళెవ్వరూ, ఆస్పత్రికి వచ్చిరోగి బాగోగులు చూడరు.

-సంపూర్ణ ప్రమాయణం

బ్రతికితే మనకు దు:ఖం. చస్తే మనవాళ్ళకి దు:ఖం. చచ్చినా, బ్రతికినా దు:ఖమే.

-పర్ణశాల

ఒకరి అందం, అర్హత వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి, వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.

-సంపూర్ణ ప్రేమాయణం

ముందు శ్రీరాముడు శివ ధనుస్సుని ఎత్తనేలేక పోయాడట! దూరంగా సీత నిండు పూలజడలో కూర్చుని ఉండడం చూసి, దీన్నే ఎత్తలేకపోయిన వాణ్ణి రేపు ఆ జడని ఎలా పక్కకి తొలగించగలను అనుకుని, అలా అనుకోగానే ధనస్సుని అవలీలగా ఎత్తేశాడట.

-ఆనందో బ్రహ్మ

ఉత్తరమంటే శృతి చేసిన వీణలా ప్రతి అక్షరం మనసును మీటాలట.

-ప్రియురాలు పిలిచె..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions